అవినాశ్‌ బెయిల్‌ రద్దుకు సుప్రీం నో.. | Supreme Court no to cancellation of Avinash Reddy bail | Sakshi
Sakshi News home page

అవినాశ్‌ బెయిల్‌ రద్దుకు సుప్రీం నో..

Mar 12 2026 4:30 AM | Updated on Mar 12 2026 4:30 AM

Supreme Court no to cancellation of Avinash Reddy bail

దర్యాప్తు పూర్తయిందన్న సీబీఐ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం 

సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలపై తీవ్ర అసహనం 

సుప్రీంకోర్టులోనే ట్రయల్‌ నిర్వహిస్తారా అంటూ ఆయనకు సూటి ప్రశ్న 

విచారణను సాగదీయాలన్న కుట్రను సాగనీయని అత్యున్నత న్యాయస్థానం

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ముసుగులో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి తదితరులపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతూ,  పలు పిటిషన్లతో పదే పదే కోర్టుల మెట్లు ఎక్కుతున్న డాక్టర్‌ సునీతకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో బుధవారం చుక్కెదురైంది. ఎంపీ అవినాశ్‌ రెడ్డి, భాస్కర్‌రెడ్డితో పాటు పలువురి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీత దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్‌ ఎన్‌. కోటీశ్వర్‌ సింగ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పును వెలువరించింది.  

దర్యాప్తు ముగిసింది: సీబీఐ 
ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ, వివేకా కేసులో దర్యాప్తు పూర్తయ్యిందన్నారు. ఈ కేసులో ఇప్పటికే మూడో సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ను సైతం కింది కోర్టులో దాఖలు చేశామని తెలిపారు. కాబట్టి ఈ వ్యవహారంలో ఇకపై ఎలాంటి తదుపరి దర్యాప్తు అవసరం లేదని విన్నవించారు. సీబీఐ వాదనలతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో బెయిల్‌ రద్దు అవసరం లేదని స్పష్టం చేసింది.  

నాలుగు వారాల్లో ‘సెక్షన్‌ 207’ ప్రక్రియ పూర్తికి నిర్దేశం 
దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో కింది కోర్టులో విచారణను ఇకపై వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా నిందితులకు కేసు చార్జ్‌షీట్లు, ఇతర ఆధారాల పత్రాలను అందజేయడానికి సంబంధించిన ‘సీఆర్‌పీసీ సెక్షన్‌ 207’ ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని కింది కోర్టును ఆదేశించింది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే వీలైనంత త్వరగా కేసు ట్రయల్‌ ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేసింది. పునఃదర్యాప్తు పేరుతో వివేకా హత్య కేసు విచారణను అసెంబ్లీ ఎన్నికల వరకు సాగదీసి, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్న ప్రత్యర్థుల కుట్రలో సునీత పావుగా మారారన్న విమర్శల నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.  

ట్రయల్‌ కోర్టు విచారణ ఇక్కడెందుకు.. సిద్ధార్థ లూథ్రాకు ప్రశ్న 
విచారణ సందర్భంగా సునీత తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వ్యవహరించిన తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కింది కోర్టులో తేల్చుకోవాల్సిన అంశాలను ఆయన పదే పదే ధర్మాసనం ముందు లేవనెత్తారు. ‘మా వద్ద కేసుకు సంబంధించిన కీలక మెటీరియల్‌ ఉంది.. దాన్ని పరిశీలించి బెయిల్‌ రద్దు చేయండి’ అంటూ లూథ్రా వాదించే ప్రయత్నం చేశారు. దీనిపై జస్టిస్‌ సుందరేశ్‌ తీవ్రంగా స్పందించారు. ఏమిటిది.. మీరు సుప్రీంకోర్టులోనే కేసు ట్రయల్‌ (విచారణ) నిర్వహించాలనుకుంటున్నారా?’ అంటూ లూథ్రాను సూటిగా ప్రశ్నించారు. ట్రయల్‌ కోర్టు పరిధిలో జరగాల్సిన విచారణను ఇక్కడికి ఎందుకు తెస్తున్నారంటూ లూథ్రా తీరును తప్పుబట్టారు. ఇలా పదే పదే పిటిషన్లు వేస్తూ కోర్టుల సమయాన్ని వృథా చేయవద్దని సూచించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement