భారత న్యాయవ్యవస్థ గురించి వారికి సహేతుకమైన జ్ఞానం ఉందా?
వారితో ఇకపై సంబంధాలు కొనసాగించొద్దు
ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యత అప్పగించొద్దు
ఎన్‌ఈసీఆర్‌టీ లీగల్ స్టడీస్ పాఠ్యప్రణాళికపై న్యాయ రంగ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలి
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశం
ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్‌లో వివాదాస్పద చాప్టర్‌పై విచారణ
న్యూఢిల్లీ: ఎన్‌సీఈఆర్‌టీ ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో అభ్యంతకర అధ్యా యాన్ని చేర్చడానికి కారకులైన ముగ్గురు నిపు ణుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వారితో ఇకపై ఎలాంటి సంబంధాలు కొనసాగించరాదని కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ అనే అంశాన్ని ఈ పుస్తకంలో చేర్చడం సంచలనాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
ఎన్‌ఈసీఆర్‌టీ లీగల్ స్టడీస్‌కు సంబంధించి పాఠ్యప్రణాళికను ఖరారు చేయడానికి న్యాయ రంగానికి చెందిన నిపుణులతో ఒక కమిటీని వారం రోజుల్లోగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కమిటీలో మాజీ సీనియర్ జడ్జి, ఒక ప్రముఖ విద్యావేత్త, పేరు ప్రఖ్యాతలున్న ఒక న్యాయవాది ఉంటే బాగుంటుందని సూచించింది. వీరు నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ (భోపాల్)తో సంబంధం ఉన్నవారైతే ఇంకా మంచి విషయం అవుతుందని ఉద్ఘాటించింది.
ఎనిమిదో తరగతి మాత్రమే కాకుండా, ఉన్నత తరగతుల పాఠ్యప్రణాళికను ఈ కమి టీ ఖరారు చేస్తుందని వెల్లడించింది. వివాదా స్పద అధ్యయాన్ని ప్రొఫెసర్ మైఖేల్ డానినో నేతృత్వంలో టెక్ట్‌బుక్ డెవలప్‌మెంట్ టీమ్ సభ్యులు సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్ రూపొందించారని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చా రు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... ‘‘ప్రొఫె సర్ మైఖేల్ డానినో, ఆయన సహచరులు సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్‌లకు భారత న్యాయవ్యవస్థ గురించి సహేతుక మైన జ్ఞానం లేదని, 8వ తరగతి విద్యార్థుల ముందు భారత న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా, తెలిసి కూడా వాస్తవాలను తప్పుగా చూపించారని మేము సందేహించడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు’’ అని స్పష్టంచేసింది.
తదుపరి తరం విద్యార్థులకు అవసరమైన పాఠ్యప్రణాళిక తయారీ, పాఠ్యపుస్తకాల ఖరారులో ఆ ముగ్గురిని ఎందుకు భాగస్వాములను చేయాలని ప్రశ్నించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు.. ఆ ముగ్గురు నిపుణులను తక్షణమే పక్కనపెట్టాలని ఆదేశించింది. పూర్తిగా ప్రభుత్వ నిధులతో లేదా పాక్షికంగా ప్రభుత్వ నిధలుతో సంబంధం ఉన్న బాధ్యతలు అప్పగించకూడదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులో సవరణ కోరుతూ ముగ్గురు నిపుణులు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని, వివరణ ఇవ్వొచ్చని ధర్మాసనం పేర్కొంది.
దుష్ప్రచారం చేసిన వ్యక్తుల వివరాలివ్వండి
వివాదాస్పద చాప్టర్‌ను తిరగరాస్తున్నామంటూ ఎన్‌సీఈఆర్‌టీ డెరెక్టర్ దాఖలు చేసిన అఫిడవిట్‌పైనా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందించింది. చాప్టర్–4ను మొత్తం తిరగరాయాలని, న్యాయ నిపుణులతో ఏర్పాటు చేసే కమిటీ పరిశీలించి, ఆమోదించేదాకా ఆ చాప్టర్‌ను ప్రచురించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. నేషనల్ సిలబస్, టీచింగ్ టెర్నింగ్ మెటేరియల్ కమిటీ (ఎన్‌ఎస్‌టీసీ)ను పునర్‌వ్యవస్థీకరించాలని కేంద్రానికి పరోక్షంగా సూచించింది. వివాదాస్పద చాప్టర్‌పై ఫిబ్రవరి 26న తాము ఉత్తర్వు జారీ చేసిన తర్వాత సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగినట్లు గుర్తుచేసింది.
ఈ ప్రచారం వెనుక ఉన్న సోషల్ మీడియా వేదికలు, వ్యక్తుల వివరాలు తమకు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. తప్పుడు పనులు చేసేవారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తేల్చిచెప్పింది. న్యాయ వ్యవస్థ గురించి విద్యార్థులకు బోధించడం మంచి విషయమే అయినప్పటికీ.. సంబంధిత పాఠ్యప్రణాళిక తయారీలో కనీసం ఒక న్యాయ నిపుణుడికి కూడా అవకాశం కల్పించకపోవడం తమకు అసంతృప్తి కలిగిస్తోందని వ్యాఖ్యానించింది.
విమర్శను నియంత్రించడం లేదు
దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరు సమీక్షకు అతీతం అని తాము చెప్పడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆరోగ్యకరమైన, చట్టబద్ధమైన, నిర్మాణాత్మక విమర్శను తాము నియంత్రించడం లేదని స్పష్టంచేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను సమగ్రంగా సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. ఈ బాధ్యతను ఎన్‌సీఈఆర్‌టీకి అప్పగించడాకి బదులు ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీకే అప్పగిస్తే తాము ప్రశంసిస్తామని పేర్కొన్నారు.
తటస్థ, స్వతంత్ర నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయడానికి అభ్యంతరం లేదని తుషార్ మెహతా బదులిచ్చారు. వివాదానికి కారకులైన ముగ్గురు నిపుణులతో ఇకపై ఎలాంటి సంబంధం ఉండదని ఎన్‌సీఈఆర్‌టీ ఇప్పటికే ప్రకటించిందని గుర్తుచేశారు. ఆ ముగ్గురిలో ఒకరిని రేపే వైస్ చాన్సలర్‌గా నియమిస్తే పరిస్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. అందుకే వెంటనే పక్కన పెట్టాలని తేల్చిచెప్పింది.


