ప్రతీయేటా పెద్ద పండుగ(సంక్రాంతి) తరువాత రిపబ్లిక్ డే వస్తుంటుంది. నాటి రోజుల్లో ఈ గణతంత్ర వేడుకలు రెండో పెద్ద పండుగలా జరిగేవి... అంటే ఇప్పుడు అలా లేదని కాదు.. నాడు ఇళల్లో నెలకొన్న ఉత్సాహం కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. దూరదర్శన్ ప్రధాన వినోద మాధ్యమంగా ఉన్న 90ల నాటి ఆ తీపి జ్ఞాపకాల తుట్టెను ఒకసారి కదిలిస్తే..
నాటి రోజుల్లో రిపబ్లిక్ డే ఉదయం అంటే చాలు.. అదొక తెలియని ఉత్సాహం.. బయట చలి గాలులు వీస్తున్నా.. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిలో అందరూ తెల్లవారుజామునే నిద్రలేచేవారు. నాడు స్మార్ట్‌ఫోన్ల స్క్రోలింగ్ అనేదే లేదు.. ఆపకుండా వచ్చే నోటిఫికేషన్ల గోల అంతకన్నా లేదు.. వందల కొద్దీ టీవీ ఛానెళ్ల గందరగోళం అసలే లేదు. కుటుంబ సభ్యులంతా చలిని తట్టుకునేందుకు దుప్పట్లు కప్పుకుని, చేతిలో వేడి వేడి టీ కప్పులతో టీవీ ముందుకు చేరేవారు. దూరదర్శన్‌లో వచ్చే రిపబ్లిక్ డే ప్రసారాలను చూసేందుకు ఎంతో ఉత్పాహం చూపించేవారు.
దూరదర్శన్ రిపబ్లిక్ డే ప్రసారాలకు ఒక ప్రత్యేకమైన నేపథ్య సంగీతం ఉండేది. వ్యాఖ్యాతల గంభీరమైన గొంతు, రాజ్‌పథ్ దృశ్యాలు మనసులో దేశభక్తిని నింపేవి. సైనికుల కవాతును పిల్లలు ఆశ్చర్యంగా చూస్తుంటే, శకటాల గురించి తల్లిదండ్రులు చర్చించుకునేవారు. తాతయ్యలు, నాయనమ్మలు గత స్మృతులను నెమరువేసుకునేవారు. కెమెరా చూపించే ప్రతి కోణం, ప్రతి క్షణం ఎంతో ముఖ్యమైనదిగా భావించేవారు. రాష్ట్రపతి సెల్యూట్ నుంచి చివరిలో యుద్ధ విమానాల విన్యాసాల వరకు, కుటుంబం మొత్తం ఆ కార్యక్రమాలనన్నింటినీ కన్నార్పకుండా చూసేది.
నాటి పాఠశాల విద్యార్థులకు రిపబ్లిక్ డే అంటే రెట్టింపు ఉత్సాహం వచ్చేది. బడికి వెళ్లే హడావిడి లేదు, హోంవర్క్ టెన్షన్ లేదు. కొంతమంది పిల్లలు ముందు రోజే స్కూల్ ఉత్సవాల్లో పాల్గొని ఉంటే, మరికొందరు నాటి సెలవును ఆస్వాదించేవారు. టీవీలో వచ్చే పరేడ్ తప్పనిసరిగా చూసేవారు. ఈ ప్రసారం ముగిశాక కొందరు జెండా వందనం కోసం బయటకు వెళ్తే, మరికొందరు ఇంట్లోనే ఉండి పిండివంటలు ఆరగించేవారు. ఆనాటి గణతంత్ర సంబరం ఆత్మీయత, అనుబంధాల మధ్య జరిగేది.
ప్రతి ఒక్కరి చేతిలో తలొక ఫోను లేని ఆ రోజుల్లో, కుటుంబం మొత్తం ఒకే టీవీ సెట్ ముందు కూర్చునేది. వ్యక్తిగత స్క్రీన్లు లేవు, చెవులకు హెడ్ ఫోన్లు పెట్టుకుని ఎవరి లోకంలో వారు ఉండటాలు లేవు. నేడు రిపబ్లిక్ డేని మనం ఎంతో గొప్పగా జరుపుకుంటున్నా, ఆనాటి దూరదర్శన్ జ్ఞాపకాలు అందరి మదిలో చెరగని ముద్ర వేశాయి. ఒకే ఒక్క దూరదర్శన్ ప్రసారం కోట్లాది మందిని ఏకం చేసిన తరుణం అది. రిపబ్లిక్ డే అంటే కేవలం దేశభక్తి మాత్రమే కాదు, కుటుంబంతో గడిపే సంతోషకరమైన రోజు అని మనకు గుర్తుచేస్తుంది.
ఇది కూడా చదవండి: గణతంత్ర వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్స్ ఇవే..


