సాక్షి, విజయవాడ: గణతంత్ర దినోత్సవ ఫలితాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. రాజ్యాంగాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏపీలో రాజ్యాంగానికి విలువ,గౌరవం లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బీసెంట్ రోడ్డులో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విషు.. జాతీయ జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సామాజిక సమతుల్యత పాటించాల్సిన ప్రభుత్వం.. ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా పనిచేయడం లేదని మండిపడ్డారు. గత ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రజలకు స్వాతంత్ర ఫలాలను ప్రజలకు చేరువ చేశాం.. కానీ 20 నెలల కూటమి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు’’ అని మల్లాది విష్ణు అన్నారు.
ఏపీలో అన్యాయం రాజ్యమేలుతోంది: కేకే రాజు
విశాఖ: విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు.. జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్యాయం రాజ్యమేలుతుందన్నారు. రాజ్యాంగాన్ని అనుసరించిన పాలన ఇక్కడ జరగడం లేదని మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు రాజ్యాంగానికి లోబడి వైఎస్ జగన్ పాలన చేశారని కేకే రాజు అన్నారు.
‘‘విద్య ఒక్కటే సమాజంలో సమానత్వం తీసుకొస్తుందని నమ్మి వైఎస్ జగన్ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. వెనుకబడిన వర్గాల వారికి వైఎస్ జగన్ ఊతం ఇచ్చారు. అణగారిన సామాజిక వర్గాలకు చట్ట సభల్లో వైఎస్.జగన్ ప్రాతినిధ్యం కల్పించారు. వెనుకబడిన కులాల కోసం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలో ఎవ్వరూ తీసుకోలేదు. రాష్ట్రంలో సాగుతున్న రాచరిక పాలనపై మనమంతా ఐక్యంగా పోరాడాలి’’ అని కేకే రాజు పిలుపునిచ్చారు.


