సాక్షి,చేవెళ్ల: ధైర్యం ఉంటే బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. చేవెళ్ల మాజీ ఎంపీపీ విజయ్ భాస్కర్ రెడ్డి ఆయన అనుచరులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
‘కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనను పక్కన పెట్టారు. మేం అప్పుడు చెప్పాం.. ఇప్పుడూ చెబుతున్నాం. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి మోసం చేస్తుందని. ఇప్పుడు అది నిజమైంది.
రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల కాలంలో వృద్ధుల నుంచి ఆడబిడ్డల వరకు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ప్రతి వర్గాన్ని మోసం చేశారు. శాసనసభ స్పీకర్ ధృతరాష్ట్రుని పోలి కళ్ళకు గంతలు కట్టుకొని నిజాలు చూడలేకపోతున్నారు. చేవెళ్ల నాయకుడు కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, స్పీకర్ మాత్రం ఆయనను ఇంకా బీఆర్ఎస్ సభ్యుడిగానే గుర్తిస్తున్నారు. యాదయ్య స్వయంగా తాను కాంగ్రెస్‌లో ఉన్నానని చెబుతున్నా స్పీకర్ మాత్రం ఒప్పుకోవడం లేదు. కాంగ్రెస్‌కు ధైర్యం ఉంటే తమ పార్టీలో చేరిన యాదయ్యపై చర్యలు తీసుకొని ఎన్నికలకు రావాలి’ అని సవాల్ విసిరారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మళ్ళీ అదే మోసం కొనసాగుతుంది. కేసీఆర్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ప్రజలకు న్యాయం జరుగుతుంది’అని స్పష్టం చేశారు.


