నంద్యాల జిల్లా కల్లూరులో పారిశుద్ధ్య కార్మికులకు వ్రస్తాలు పంపిణీ చేస్తున్న కాటసాని
గ్రామాల్లోనూ వైభవంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు
పార్టీ జెండాను ఎగురవేసి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు
నవరత్నాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీలు
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో సంబరాలు
సాక్షి నెట్‌వర్క్: ఆవిర్భావం నుంచి ప్రతి అడుగులోనూ విలువలు, విశ్వసనీయతతో రాజకీయ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలు గురువారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలో గ్రామాల్లోనూ పండుగలా కార్యక్రమం కొనసాగింది. ప్రజా సంక్షేమం కోసం పురుడు పోసుకున్న పార్టీ జెండాను రాష్ట్రవ్యాప్తంగా ఊరూ వాడా పండుగ వాతావరణంలో కార్యకర్తలు, నేతలు, అభిమానుల కోలాహలం నడుమ ఎగురవేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాల్లో పూజలు చేశారు. రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించి సేవా సందేశాన్ని చాటారు. ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. కేక్‌లు కట్ చేసి కోట్ల మంది సంబరాన్ని పంచుకున్నారు.

వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. ఉరిమే ఉత్సాహంతో బైక్ ర్యాలీలు.. జై జగన్.. జై వైఎస్సార్‌సీపీ నినాదాలతో హోరెత్తించారు. పార్టీ జెండా రెపరెపల నడుమ తమ గుండె చప్పుడు వైఎస్సార్‌సీపీ అని చాటి చెప్పారు. పలుచోట్ల వైఎస్ జగన్ హయాంలో అమలైన నవరత్నాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీలను ప్రదర్శించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజా ప్రతిని«ధులు, సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. నల్లకాలువలో వైఎస్ జగన్ ఇచ్చిన మాట కోసం 2011 మార్చి 12న పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాదు.. దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించిందని గుర్తు చేసుకున్నారు.




వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారని చెప్పారు. అబద్ధపు హామీలతో మోసగించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి సర్కారును తరిమికొట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. పులివెందుల బాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో నేతలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాగా, న్యూఢిల్లీ, తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల ఈ కార్యక్రమాన్ని పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు.
ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ సంబరాలు
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాలు ఢిల్లీలో గురువారం ఘనంగా జరిగాయి. పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజారాణి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. విలువలు, విశ్వసనీయతకు అర్థం చెబుతూ వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిందని ఎంపీలు పేర్కొన్నారు.
తెలంగాణలో ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు
కూకట్‌పల్లి/అల్వాల్/ఖమ్మం మయూరి సెంటర్: వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, అభిమానులు గురువారం కేక్ కట్‌చేసి వేడుకలు నిర్వహించారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని రమ్యా గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అరి్పంచారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. కూకట్‌పల్లి, నేరేడ్‌మెట్ ఆర్‌కేపురం, ఖమ్మంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.


