మున్సిపల్ బాండ్ల ద్వారా డబ్బులు సేకరించండి
ల్యాండ్ పూలింగ్‌కు వెళ్లి పీపీపీ విధానంలో ప్రాజెక్టులు చేపట్టండి
అటవీ శాఖపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి
దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎంతో మాట్లాడా.. మరోసారి మాట్లాడతా..
రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి : పట్టణ స్థానిక సంస్థల పౌర సేవలన్నింటినీ అవుట్ సోర్సింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. మున్సిపల్ బాండ్ల జారీ ద్వారా నిధులను సమీకరించడంతో పాటు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను సేకరించి పీపీపీ విధానంలో ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు. సచివాలయంలో గురువారం రెండోరోజు కలెక్టర్ల సదస్సులో పలు శాఖలపై సీఎం సమీక్షించారు. పట్టణ స్థానిక సంస్థలన్నింటిలోనూ విద్యుత్ వాహనాలను తీసుకురావాలని ఆదేశించారు.
అభివృద్ధి చేస్తున్నా జీఎస్టీ ఆదాయం ఆ మేర ఎందుకు పెరగడంలేదనే విషయంపై అధ్యయనం చేయాలని వాణిజ్య పన్నులు, ఆర్థిక శాఖను ఆదేశించారు. అభివృద్ది జరిగితే ఆ మేర ఆదాయం పెరగాలని.. కానీ, ఎక్కడో తేడా కనిపిస్తోందన్నారు. ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి పన్ను ఎగవేతకు చెక్ పెట్టాలన్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది సొంత ఆదాయం పన్ను వృద్ధి కేవలం నాలుగు శాతమే ఉందని.. అలాగే, ఎక్సైజ్ ఆదాయం గత ఏడాది కన్నా ఈ ఏడాది ఐదుశాతం మేర తగ్గిందని ముఖ్యమంత్రి చెప్పారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
కొందరు అటవీ అధికారులతో ఇబ్బందులు..
అటవీ శాఖపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు ఈ శాఖాధికారుల అసాధ్యమైన ఆలోచనలతో ఇబ్బందులు వస్తున్నాయి. ఆచరణ సాధ్యంకాని ఆలోచనలతో వ్యవహరిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఎలా? శ్రీశైలంలో అటవీ శాఖాధికారులు భక్తులను అడ్డుకున్నారు. ఆ తర్వాత రోజు తొక్కిసలాట అయ్యే పరిస్థితి వచ్చింది. బద్వేలులోనూ అటవీ శాఖ ఇదే తరహాలో వ్యవహరించింది. దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎంతో మాట్లాడా. మరోసారి మాట్లాడతా.
అటవీ శాఖాధికారులు పీపుల్స్ ఫ్రెండ్లీగా మారాలి. జిల్లాల్లో పెట్టుబడులు రాబట్టేందుకు కలెక్టర్లు చొరవ చూపుతూ పెట్టుబడుల మీటింగులు పెట్టాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో జిల్లాల వారీగా ర్యాంకులిస్తాం. జాతీయ రహదారులపై వే సైడ్ ఎమినిటీస్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, నైట్‌హాల్ట్ కోసం గదుల నిర్మాణం చేపడితే పెట్టుబడులు వస్తాయి. ఏపీఐఐసీ ద్వారా చేసే భూ కేటాయింపుల్లో కలెక్టర్లు ఐదెకరాల వరకూ చేసేలా వారికి ఆథరైజేషన్ ఇవ్వాలి. విజయవాడలోని డిస్నీల్యాండ్, భవానీ ఐల్యాండ్‌లను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తాం.
పవన్, లోకేశ్ డుమ్మా..
ఇక రెండ్రోజుల ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్ డుమ్మా కొట్టారు. కీలక మంత్రులు హాజరుకాకపోవడంపట్ల అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తంచేసింది. కార్యక్రమంలో భాగంగా ‘అరకు కౌని’ పేరుతో రూపొందించిన తొలి గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ ఫుడ్ మెనూను సీఎం ఆవిష్కరించి స్టాల్‌ను సందర్శించారు. సమావేశంలో సీఎం గొప్పలు పోవడం అధికారులకు అసహనం కలిగించింది. గతంలో సీఎంగా ఉన్నప్పుడు అది చేశా.. ఇది చేశానని చెప్పడం కేవలం కాలక్షేపానికి మాత్రమే పనికొస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.


