పార్టీ శ్రేణుల మధ్య ప్రసంగిస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
వైఎస్సార్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవంలో వైఎస్ జగన్
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు
మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
వైఎస్సార్‌ను గుండెల్లో పెట్టుకున్న ప్రతి ఒక్కరిదీ వైఎస్సార్‌సీపీ
దేశ రాజకీయాల్లో ప్రబలమైన పార్టీ.. పెను మార్పులకు నాంది
జగన్ ఏనాడూ భయపడలేదు... వెనక్కి తగ్గలేదు
అదిగో మా పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని.. నాతో నడిచే ప్రతి ఒక్కరూ గర్వంగా కాలర్ ఎగరేసుకుని చెప్పొచ్చు
విలువలు, విశ్వసనీయతకు మారుపేరు
సాక్షి, అమరావతి: విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య.. విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్థం చెబుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్క జగన్‌ది మాత్రమే కాదు.. కొన్ని కోట్ల మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులది.. వైఎస్సార్‌ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని నేను గర్వంగా చెబుతున్నా..’’ అని స్పష్టం చేశారు.
గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తరలిరావడంతో పార్టీ కేంద్ర కార్యాలయం జనసంద్రంగా మారింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించిన అనంతరం వైఎస్ జగన్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలి వచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులనుద్దేశించి వైఎస్ జగన్ ఏమన్నారంటే.. 
నల్లకాలువలో ఇచ్చిన మాటతో..
మన పార్టీ ఆవిర్భవించి ఈరోజుకు 15 ఏళ్లు పూర్తయింది. 2011 మార్చి 12న పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఒక మార్క్‌గా నిల్చింది. రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ప్రబలంగా మన పార్టీ కనిపిస్తోంది. 15 సంవత్సరాల క్రితం పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో పుట్టింది అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే.. ఆరోజు నల్లకాలువలో ఇచ్చిన ఒక మాట, మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపన, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితుల్ని మార్చింది. రాష్ట్రం దశ, దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది.
కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పుకునేలా పార్టీ అడుగులు వేస్తుంది..
ఆరోజు జగన్ అనే వాడు ఒకే ఒక్కడు... కానీ జగన్ ఏనాడూ భయపడలేదు. ఆరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ, దేశంలోనూ అధికారంలో ఉంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్నిన పరిస్థితి చూశాం. కానీ, జగన్ ఏనాడూ భయపడలేదు. కారణం జగన్‌కు నమ్మకం ఉన్నది పైన ఉన్న దేవుడు, కింద ఉన్న మీమీద మాత్రమే అని గర్వంగా చెబుతా. నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న నా దేవుడు.. ఇద్దరూ తోడుగా ఉండి నన్ను నడిపించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగరేసుకుని.. అదిగో అతడే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకునేలా పార్టీ అడుగులు వేస్తుందని మరొక్కసారి మీ అందరికీ వినమ్రంగా, వినయపూర్వకంగా చెబుతున్నా. మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. వైఎస్సార్‌ను అభిమానించే ప్రతి గుండెకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వైఎస్సార్‌ను ప్రేమించే ప్రతి గుండె ఏ రాష్ట్రంలో ఉన్నా, ఆ ప్రతి గుండెకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.


