గురువుల్లో గుబులు | Tasks through automation in the TEN exams | Sakshi
Sakshi News home page

గురువుల్లో గుబులు

Mar 13 2026 3:55 AM | Updated on Mar 13 2026 12:01 PM

Tasks through automation in the TEN exams

టెన్త్‌ పరీక్షల్లో ఆటోమేషన్‌ ద్వారా విధులు  

జూనియర్లకు సీఎస్, డీవో విధులు 

54 వేల మందిలో 25 శాతం మంది ప్రైవేటు టీచర్లు  

ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు  

సాక్షి, అమరావతి: ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రవేశపెట్టిన ‘ఆటోమేషన్‌’ విధానం ఉపాధ్యాయుల్లో గుబులు రేపుతోంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లా స్థాయిలో చేపట్టే ఇన్విజిలేషన్, డిపార్ట్‌మెంటల్‌ విధులను ఈసారి పూర్తిగా కేంద్రీకృతం చేశారు. రాష్ట్ర కార్యాలయమే విధుల నిర్వహణ, పరీక్ష కేంద్రాలు, ఇన్విజిలేటర్ల ఎంపికను చేపట్టింది. ఇందుకోసం కొత్తగా ఆటోమేషన్‌ విధానం అమలు చేశారు. 

దాంతో పరీక్షల విధుల్లో సీనియర్‌ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే నియమించాల్సిన చోట జూనియర్లు, ప్రైవేటు ఉపాధ్యాయులకు స్థానం కల్పించడంపై ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం మూడేళ్ల సర్వీసు కూడా లేని వారిని చీఫ్‌ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్‌ అధికారులుగా నియమించారు. ఇన్విజిలేటర్లుగా అత్యంత జూనియర్లు, ప్రైవేటు స్కూళ్ల టీచర్లను సైతం నియమించారు. ఉపాధ్యాయుల అనుమతి సైతం తీసుకోకుండా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా విధులు కేటాయించడం గమనార్హం.  

25 శాతం ప్రైవేటు ఉపాధ్యాయులే...  
ఈ నెల 16 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 6.38 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షల విధుల్లో సుమారు 54 వేల మంది సిబ్బంది పాలుపంచుకుంటారు. ఇందులో చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు 7 వేల మంది, ఇన్విజిలేటర్లు 40 వేల మంది, ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకు 7 వేల మందిని నియమించారు. గతంలో ఏటా పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సీనియారిటీ ఆధారంగా జిల్లా కార్యాలయాల్లో (డీఈవో) ఎంపిక చేసేవారు. వారి వివరాలను రాష్ట్ర కార్యాలయానికి అందించేవారు. 

సీనియారిటీ, ఆసక్తి ఆధారంగా కేవలం ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌ పాఠశాల ఉపాధ్యాయులను మాత్రమే పరిగణనలోకి తీసుకునేవారు. అనారోగ్య సమస్యలున్న వారిని మినహాయించి, మిగిలిన వారికి విధులు కేటాయించేవారు. కానీ ఈ ఏడాది పూర్తిగా ఆటోమేషన్‌ విధానం ద్వారా చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను రాష్ట్ర కార్యాలయమే ఎంపిక చేసింది. ఈ ఏడాది ప్రైవేటు స్కూళ్లలోని టీచర్లను కూడా 25 శాతం మందిని విధుల్లోకి తీసుకోవడం గమనార్హం.  

ఆటోమేషన్‌పై ఆందోళన  
పరీక్షల నిర్వహణలో చీఫ్‌ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెటల్‌ ఆఫీసర్లది కీలకపాత్ర. పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లు చూసుకోవడం, పరీక్ష ప్రారంభ సమయానికి ముందే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ప్రశ్నపత్రాలను భద్రంగా తేవడం, పరీక్ష నిర్వహణలో ఇన్విజిలేటర్లు, ఇతర శాఖలతో సమనన్వయం చేసుకోవడంతోపాటు పరీక్ష ముగిసిన తర్వాత జవాబు పత్రాల బండిళ్లను పార్సిల్‌ చేసే వరకు వీరిద్దరే అత్యంత కీలకం. కానీ ఈసారి జిల్లా విద్యాశాఖ అధికారులు ఇచ్చిన సీనియారిటీ జాబితాను పక్కనబెట్టారు. 

పూర్తిగా ఆటోమేషన్‌ చేసినట్టు చెప్పి కంప్యూటర్‌ ఆధారంగా విధులు అప్పగించామని రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టరేట్‌ ప్రకటించింది. ఆటోమేషన్‌ విధానంతో అంతా తారుమారయ్యింది. సీనియర్లకు అప్పగించాల్సిన విధులను జూనియర్లకు కేటాయించారు. ఆన్‌లైన్‌లోని ఉపాధ్యాయుల డేటా ఆధారంగా ఈ విధులు వేశారేగాని, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. 

జిల్లాలో పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందిని జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు సర్దుబాటు చేసే అవకాశం లేకుండా చేశారు. ఇది పరీక్షల నిర్వహణపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా ఒక స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుల్లో సగం మంది మించకుండా పరీక్షల విధులు వేయాల్సి ఉండగా.. చాలాచోట్ల 100 శాతం మందిని విధులకు కేటాయించడం గమనార్హం.  

ఇష్టారాజ్యంగా ఇన్విజిలేషన్‌ విధులు
పరీక్షల ఇన్విజిలేషన్‌ విధుల కేటాయింపులో పాఠశాల విద్యాశాఖ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి తమ్మినాన చందనరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. కేంద్రీకృత విధానంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఇన్విజిలేషన్‌ విధులు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. 

ఇంటర్మీడియెట్‌ ఓపెన్‌ పరీక్షలకు నియమించిన ఉపాధ్యాయులను తిరిగి పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేషన్‌ విధులకు ఎలా నియమిస్తారని నిలదీశారు. గతంలో జిల్లా స్థాయిలో విధులు కేటాయింపు విధానంలో అనారోగ్య సమస్యలున్న వారిని, విధులు నిర్వహించలేని వారిని మినహాయించే విధానం ఉండేదని, ప్రస్తుతం ఇవేమీ పట్టించుకోకుండా విధులు కేటాయించారని విమర్శించారు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించి ఇన్విజిలేషన్‌ విధులను మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు.    

Advertisement
 
Advertisement
Advertisement