నెట్‌ఫ్లిక్స్‌తో హైదరాబాద్‌కు హాలీవుడ్‌: సీఎం రేవంత్‌ | Hollywood to Hyderabad with Netflix says CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

నెట్‌ఫ్లిక్స్‌తో హైదరాబాద్‌కు హాలీవుడ్‌: సీఎం రేవంత్‌

Mar 13 2026 4:24 AM | Updated on Mar 13 2026 4:25 AM

Hollywood to Hyderabad with Netflix says CM Revanth Reddy

ఫోర్త్‌ సిటీలో కార్పొరేట్‌ ఆఫీసు ఏర్పాటుకు స్థలం ఇస్తాం: సీఎం రేవంత్‌ 

క్రీడారంగాన్ని ప్రోత్సహించడంలో నెట్‌ఫ్లిక్స్‌ సహకరించాలి 

హైటెక్‌ సిటీలో నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్‌ స్టూడియో కార్యాలయం ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు హాలీవుడ్‌ను రప్పించాలనే తన కల నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా నిజం కాబోతున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలోని 500 అతిపెద్ద కంపెనీల పెట్టుబడులను హైదరాబాద్‌కు రప్పించేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారానికి చిరునామాగా ఉన్న తెలంగాణకు వచ్చే పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్‌ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్‌ సిటీలో గురువారం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సినిమారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటుండగా, బాహుబలి, కల్కి, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి సినిమాలు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఇక్కడ నుంచే వచ్చాయి. 

ప్రపంచ సంస్థలకు వేదికగా నిలుస్తున్న హైదరాబాద్‌ అన్ని రకాల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌ విస్తరణకు అవసరమైన అన్ని సదుపాయాలు, సహకారాన్ని మా ప్రభుత్వం అందిస్తుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చూపే అద్భుత అవకాశం వినోదరంగంలో పేరొందిన నెట్‌ఫ్లిక్స్, ఐలైన్‌ ద్వారా లభిస్తుంది. క్రీడా రంగంలో మౌలిక వసతుల కల్పన, క్రీడా విశ్వ విద్యాలయాల ఏర్పాటు వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. త్వరలో క్రీడల ప్రసార రంగంలోనూ అడుగుపెడుతున్న నెట్‌ఫ్లిక్స్‌ నుంచి సహకారాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్యూచర్‌ సిటీలో నెటిఫ్లిక్స్‌ ఆఫీసు నిర్మాణానికి అవసరమైన భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. నెట్‌ఫ్లిక్స్‌ కార్పొరేట్‌ ఆఫీసును ఫ్యూచర్‌ సిటీలో ఏర్పాటు చేయాలి’అని రేవంత్‌ రెడ్డి చెప్పారు. 

ఐలైన్‌ స్టూడియో కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు, దిల్‌రాజు, రానా, సంజయ్‌జాజు, జెఫ్‌షాపిరో తదితరులు 

తెలంగాణ బ్రాండ్‌ విశ్వవ్యాప్తం: మంత్రి దుద్దిళ్ల 
యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్‌ (ఏవీజీసీ) రంగంలో హైదరాబాద్‌ను గ్లోబల్‌ లీడర్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్‌ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్‌లో తెలంగాణ బ్రాండ్‌ విశ్వవ్యాప్తమవుతుంది. గ్లోబల్‌ ప్రొడక్షన్‌ పైప్‌లైన్‌లో నగరం నిర్ణయాత్మక కేంద్రంగా మారుతుంది. ప్రపంచస్థాయి నిర్మాణ ప్రమాణాలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణల వాతావరణంతోపాటు స్థానిక యువత కు భవిష్యత్తు నైపుణ్యాలు ఐలైన్‌ స్టూడియో ద్వారా అందుబాటులోకి వస్తాయి. పరిశ్రమల భాగస్వామ్యంతో ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా ప్రారంభించిన యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీలో నెట్‌ఫ్లిక్స్‌ భాగస్వామిగా మారాలి’అని శ్రీధర్‌బాబు చెప్పారు. 

ఆవిష్కరణలకు కేంద్రం: సంజయ్‌
‘వేగంగా విస్తరిస్తున్న మీడియా, వినోద రంగ మౌలిక సదుపాయాలతో.. ప్రతిభకూ, ఆవిష్కరణలకూ శక్తిమంతమైన కేంద్రంగా హైదరాబాద్‌ నిలిచింది. సాంకేతిక ఆవిష్కరణలను కథన కళారీతులతో మేళవిస్తూ దక్షిణాసియాలో ముఖ్యమైన కేంద్రంగా ఐలైన్‌ స్టూడియోస్‌ సేవలందిస్తుంది. అలాగే దృశ్య శ్రవణ, వినోద రంగాల్లో సరికొత్త అవకాశాలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా 15వేల పాఠశాలలు, కాలేజీల్లో 500 కంటెంట్‌ క్రియేటర్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదించింది. తద్వారా సృజనాత్మక రంగంలో దాదాపు 20 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయి’అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్‌ జాజు చెప్పారు. 

భారత సృజనాత్మక సాంకేతిక సంస్థ (ఐఐసీటీ) త్వరలోనే హైదరాబాద్‌లో ప్రాంతీయ ప్రాంగణాన్ని కూడా ప్రారంభించనున్నట్టు ఆయన ప్రకటించారు. కాగా హైదరాబాద్‌లో ఐలైన్‌ స్టూడియోస్‌ 32వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతోంది. ఇందులో అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్, జనరేటివ్‌ వర్చువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం ఆధునిక సాంకేతికత ఉంటుంది, ఈ స్టూడియో లాస్‌ ఏంజెలిస్, వాంకోవర్, సియోల్, లండన్‌లో స్థాపించిన నెట్‌వర్క్‌ ఆధారంగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో సినీ నటుడు రానా దగ్గుబాటి, ఐలైన్‌ స్టూడియోస్‌ సీఈఓ జెఫ్‌ షాపిరో, తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌ రాజు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement