సంక్షేమ విద్యా సంస్థలపై గ్యాస్‌ బండ | Kitchens severely affected by gas supply problem | Sakshi
Sakshi News home page

సంక్షేమ విద్యా సంస్థలపై గ్యాస్‌ బండ

Mar 13 2026 2:50 AM | Updated on Mar 13 2026 2:50 AM

Kitchens severely affected by gas supply problem

సరఫరాలో సమస్యతో కిచెన్‌లపై తీవ్ర ప్రభావం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట గురుకులంలో గ్యాస్‌ నిండుకోవడంతో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. దమ్మపేట పాఠశాలకు రెండు, మూడు రోజులుగా గ్యాస్‌ సరఫరా కావడం లేదు.  సంక్షేమ పాఠశాలల్లో గ్యాస్‌ కొరత విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామని, గురుకులాలకు సరిపడా గ్యాస్‌ సరఫరా చేయాలని ఆయన ఏజెన్సీలను ఆదేశించారని ఆర్‌సీఓ కె.వెంకటేశ్వర్లు తెలిపారు.      – పాల్వంచ రూరల్‌  

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, వసతిగృహాలపై గ్యాస్‌ బండ పడింది. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో నెలకొన్న సమస్యతో విద్యార్థులకు భోజనాన్ని అందించడంలో సిబ్బందికి కష్టాలు నెలకొన్నాయి. గురుకుల విద్యా సంస్థల్లో రోజుకు మూడు పూటలా ఆహారాన్ని అందించాల్సి ఉండగా...వసతి గృహాల్లో మాత్రం రెండు పూటలా ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతిగృహాలు, సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఆహారాన్ని గ్యాస్‌ పొయ్యిల ద్వారానే వండి వడ్డిస్తున్నారు. 

తాజాగా నెలకొన్న పరిస్థితితో వంట సంకటంలో పడింది. సకాలంలో వారికి వండివార్చడం ఇబ్బందికరంగా మారడంతో ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి ఏర్పాటు చేస్తూ నెట్టుకొస్తున్నారు. కాగా, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలో గురుకుల పాఠశాలలు, కళాశాలలు వెయ్యికిపైగా ఉన్నాయి. ఇవికాకుండా సంక్షేమ శాఖల పరిధిలో వసతిగృహాలు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో రెండు వేల ఆశ్రమ పాఠశాలలు, పాఠశాల విద్యా శాఖ పరిధిలో మోడల్‌ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు దాదాపు వెయ్యి వరకు ఉన్నాయి. 

వీటి పరిధిలో 12లక్షల మంది విద్యార్థులున్నారు. ఈ విద్యా సంస్థలకు సగటున 4,500 వేల గ్యాస్‌ సిలిండర్లు అవసరం. దీంతో ఒక్కో గురుకుల పాఠశాలకు సగటున 3 సిలిండర్లు అవసరమని సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం సరఫరాలో నెలకొన్న సమస్యతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఒకేసారి నాలుగైదు సిలిండర్లు స్టాక్‌ ఉండే చోట ప్రస్తుతం ఒక్కటి కూడా అందుబాటులో లేదని వాపోతున్నారు. 

మూడు రోజులుగా సంక్షేమ వసతిగృహాల్లో కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తుంగా గురువారం నుంచి గురుకుల విద్యా సంస్థల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండడం, పొయ్యిపై చేసే వంటకు ఎక్కువ సెగ తగలడంతో అన్నం, సాంబార్, ఒక రకం కర్రీతో సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement