నల్లగున్నవ్‌.. నీకెందుకు చదువు..? | Medak Girl Alleges Insult Over Skin Color School Controversy | Sakshi
Sakshi News home page

నల్లగున్నవ్‌.. నీకెందుకు చదువు..?

Mar 13 2026 7:55 AM | Updated on Mar 13 2026 11:47 AM

Medak Girl Alleges Insult Over Skin Color School Controversy

మెదక్‌ కలెక్టరేట్‌: ‘నల్లగున్నవు నీకు చదువెందుకు.. టీసీ ఇస్తాం వెళ్లిపో’.. అంటూ తమ కుమార్తెను పాఠశాలకు రానివ్వడం లేదని తల్లిదండ్రులు గురువారం కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌కు మొర పెట్టుకున్నారు. మెదక్‌ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్‌పూర్‌కు చెందిన బాధిత విద్యార్థిని మనస్విని, ఆమె తల్లిదండ్రులు ఎల్లం, జ్యోతి విలేకరులకు తెలిపిన వివరాలివి. మెదక్‌లోని తెలంగాణ రెసిడెన్షియల్‌ స్కూల్‌ (టీజీఆర్‌ఎస్‌)లో మనస్విని 7వ తరగతి చదువుతోంది. గత నెల 20న కడుపునొప్పి రావడంతో.. ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించి విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లగా కిడ్నీలో స్వల్పంగా రాయి ఉన్నట్లు తేలింది. 

నీళ్లు తాగితే సరిపోతుందని వైద్యులు చెప్పడంతో పాఠశాలలో చేర్పించారు. ఈ క్రమంలో మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు వెళ్లి ఏఎన్‌ఎం ఆశాజ్యోతిని సంప్రదించగా దురుసుగా ప్రవర్తించింది. ‘ఏ అడివినుంచి వచ్చిండ్రు మీరు... ఆ పిల్లకు టీసీ ఇచ్చి పంపిస్తాం’.. అని అవమానించినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతరం పాపకు ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇటీవల పాఠశాలలో చేర్చుకోవాలని వెళ్తే ప్రిన్సిపాల్‌తో పాటు సిబ్బంది నోటికొచ్చినట్లు మాట్లాడి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కిడ్నీలో రాయి తగ్గినట్లు డాక్టర్‌ సర్టిఫికెట్ తెస్తేనే చేర్చుకుంటామని ప్రిన్సిపాల్‌ పాఠశాలలోకి రానివ్వడం లేదని వాపోయారు. ‘నల్లగా ఉన్న నీకు చదువెందుకు?.. టీసీ ఇచ్చి పంపిస్తాం.. వెళ్లిపో’.. అని నర్స్‌ ఆశాజ్యోతి, ప్రిన్సిపాల్‌ తారాసింగ్‌ పాఠశాలలోకి రానివ్వడం లేదని  విద్యార్థిని బోరున విలపించింది. స్పందించిన కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ప్రిన్సిపాల్‌ తారాసింగ్‌ వివరణ తీసుకొని విద్యార్థిని మనస్వినిని పాఠశాలకు పంపించినట్లు సమాచారం.   

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement