సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మురుగుడు హనుమంతరావు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. దేశానికి స్వతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారన్నారు. అంబేద్కర్ తలపెట్టిన ఆశయాలకు అనుగుణంగా అందరూ పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘అంబేద్కర్ స్ఫూర్తికి ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయి. స్వార్థం, అవినీతితో ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయి. రాష్ట్రం ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా పని చేస్తోంది’’ అని బొత్స పేర్కొన్నారు.
వైఎస్సార్ ఆశయ సాధనకు జగన్ కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ప్రతిపక్షంగా ప్రజల కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది. పేద ప్రజల శ్రేయస్సు కోసం పని చేయాలన్నది పార్టీ అధినేత జగన్ నిర్ణయం. ఆ మేరకు కేడర్ పని చేయాలి’’ అని బొత్స పిలుపునిచ్చారు.


