ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సరిహద్దుల్లో అప్రమత్తమైంది. భారత్-పాక్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు గస్తీ ముమ్మరం చేశాయి. సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్ జవాన్లు భారీగా మోహరించాయి. డ్రోన్లతో ఎల్‌ఓసీ వెంట బలగాలు నిఘా పెట్టాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం అంతటా భద్రతా తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. వేడుకల కోసం చేసిన కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య గురుగ్రామ్, చిల్లా, టిక్రీ, సింఘు, కాపషేరా, బదర్‌పూర్ మరియు ధౌలా కువాన్ సరిహద్దుల వద్ద పోలీసులు క్షుణ్ణంగా వాహన తనిఖీలు చేపట్టారు.
గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని.. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (JeM) భారత్‌లో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ దేశానికి చెందిన నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ISI) ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 26న భీకర దాడులకు పాల్పడేందుకు ‘26-26’ అనే కోడ్ నేమ్‌ను పెట్టుకున్నట్లు తెలిపాయి.
గణతంత్ర వేడుకలకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో దాడులకు దిగవచ్చని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు సరిహద్దులు సహా జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పలువురు అనుమానితుల ఫొటోలతో దిల్లీ పోలీసులు వాంటెడ్ నోటీసులు జారీ చేశారు.


