పాట్నా: బీహార్‌లో అధికార జేడీ(యూ)కు చెందిన ఎమ్మెల్యే అనంత్ సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే అనంత్ సింగ్.. ఓ ఆసుపత్రిలో సిగరెట్ తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తీరుపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆసుపత్రిలో సిగరెట్ తాగుతూ రీల్స్ చేస్తున్నాడా? ఏం సందేశం ఇచ్చారంటూ నేతలు మండిపడుతున్నారు.
వివరాల మేరకు.. జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్.. పాట్నాలోని ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజిఐఎంఎస్)కు వైద్య చికిత్సల కోసం వెళ్లారు. ఈ సందర్భంగా అనంత్ సిగరెట్ తాగారు. ఆసుపత్రి లోపలే ధూమపానం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
JDU MLA Anant Singh smokes Ciggerate in Patna Hospital
Public hospital turned into personal ashtray
Indian Civic sense on Display pic.twitter.com/4qaDm9N5my— Nehr_who? (@Nher_who) January 19, 2026
మరోవైపు.. ఈ వీడియోను ఆర్జేడీ ప్రతినిధి ప్రియాంక భారతి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్బంగా ఆమె స్పందిస్తూ..‘నితీశ్ కుమార్‌కు ప్రియమైన నేత అనంత్ సింగ్ సిగరెట్ పొగతో బీహార్‌లో సుపరిపాలనను తీసుకువస్తున్నాడని ఎద్దేవా చేశారు. అలాగే, నితీశ్ గారాల పెంపుడు విలన్.. ఆసుపత్రిలో సిగరెట్ తాగుతూ రీల్స్ చేస్తున్నాడా? అని ప్రశ్నించారు. ఈ వీడియోపై నెటిజన్లు సైతం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉండి ఇలాంటి ప్రవర్తన ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బీహార్ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనంత్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. జన్ సూరజ్ పార్టీ ప్రశాంత్ కిశోర్ మద్దతుదారు దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో అనంత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అనంత్ సింగ్ విజయం సాధించారు. మొకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీకి చెందిన వీణా సింగ్‌పై 28,206 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రస్తుతం ఆయనపై 28 క్రిమినల్ కేసులు ఉన్నాయి.


