వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో ఆసక్తికర సంఘటన | T20 WC 2026 IND VS ENG Semis: Dhoni Humbles Sakshi Dhoni In Front Of Millions On LIVE TV After Brain Fade | Sakshi
Sakshi News home page

T20 WC 2026: ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో ఆసక్తికర సంఘటన

Mar 6 2026 11:50 AM | Updated on Mar 6 2026 12:01 PM

T20 WC 2026 IND VS ENG Semis: Dhoni Humbles Sakshi Dhoni In Front Of Millions On LIVE TV After Brain Fade

టీ20 ప్రపంచకప్‌ 2026 రెండో సెమీఫైనల్లో భారత్‌ ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముంబైలోని వాంఖడే స్టేడియం జరిగిన ఈ కీలక సమరాన్ని వీక్షించేందుకు అతిరథ మహారథులంతా తరలివచ్చారు. వీరిలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని జంట హైలైటైంది. వీరికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఇందులో సాక్షి (ధోని సతీమణి) ఆనందంతో ఎగిరి గంతులేస్తుండగా.. ధోని వారిస్తాడు.  

అసలేం జరిగిందంటే.. భారత్‌ నిర్దేశించిన 254 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ ఛేదించే దిశగా సాగుతోంది. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా సామ్ కర్రన్‌కు బౌలింగ్ చేస్తుండగా, బంతి బ్యాట్ దిగువ భాగాన్ని తాకి నేలపై పడి పైకి ఎగిరింది. బుమ్రా చురుకుగా వ్యవహరించి ఆ బంతిని క్యాచ్ పట్టాడు. ఇది ఔట్ కాదని అందరికీ తెలుసు. అయితే ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్న సాక్షి ధోని, కర్రన్‌ ఔటయ్యాడన్న ఆనందంతో లేచి చప్పట్లు కొడుతూ, ఎగురుతూ గంతులేసింది.

ఆ సమయంలో ఆమె వెనుకే ఉన్న ధోని అది ఔట్‌ కాదంటూ సాక్షిని శాంతపరిచాడు. ఈ సన్నివేశం చుట్టూ ఉన్న వారిలో నవ్వులు పూయించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియోను చూసిన వారంతా మిస్టర్‌ కూల్‌ ఇంకా కూల్‌గానే ఉన్నాడంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. భారత్‌ ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరడం ఒక ఎత్తైతే ఈ సన్నివేశం మరో ఎత్తుగా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌,.. సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 89 పరుగులు) ఇరగదీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ (39), శివమ్‌ దూబే (43), హార్దిక్‌ పాండ్యా (27), తిలక్‌ వర్మ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ యువ బ్యాటర్‌ జేకబ్‌ బేతెల్‌ భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. తొలి బంతి నుంచే బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి, కేవలం 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు.

అయితే బేతెల్‌ సెంచరీ పూర్తి చేయడానికి ఒక్క ఓవర్‌ ముందు భారత్‌కు బ్రేక్‌ దొరికింది. 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు.

19వ ఓవర్‌ బంతిని అందుకున్న హార్దిక్‌ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్‌ కర్రన్‌ను ఔట్‌ చేయడంతో పాటు ఆ ఓవర్‌లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్‌కు గెలుపుపై ధీమా వచ్చింది.

చివరి ఓవర్‌ వేసిన దూబే తొలి బంతికే బేతెల్‌ను (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) ఔట్‌ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్‌ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినా (ఆర్చర్‌) అప్పటికే ఇంగ్లండ్‌ ఓటమి ఖరారైపో​యింది.

కాగా, భారత్‌ మార్చి 8న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement