ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ఎన్నికల్లో బీజేపీ కూటమి స్పష్టమైన విజయం సాధించినప్పటికీ, ముంబై రాజకీయాల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, సొంతంగా మేజిక్ ఫిగర్‌ను దక్కించుకోలేదు. దీంతో పార్టీకి ఫిరాయింపుల భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మిత్రపక్షమైన బీజేపీ నుండే ఏవైనా ‘ఆపరేషన్లు’ జరుగుతాయేమోనన్న అనుమానంతో, కొత్తగా ఎన్నికైన తమ శివసేన కార్పొరేటర్లను బాంద్రాలోని ఓ రిసార్ట్‌కు తరలించారు. మేయర్ ఎన్నిక పూర్తయ్యే వరకు షిండే వర్గం ఈ ‘రిసార్ట్ పాలిటిక్స్’ వ్యూహాన్ని అమలు చేయనున్నదని తెలుస్తోంది.
మ్యాజిక్ ఫిగర్‌కు అంచున ఎన్‌డీఏ కూటమి
మొత్తం 227 స్థానాలున్న బీఎంసీలో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు 114 స్థానాల మద్దతు అవసరం. తాజా ఫలితాల్లో బీజేపీ 89 స్థానాలను గెలుచుకోగా, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 29 స్థానాల్లో విజయం సాధించింది. ఇవి రెండూ కలిపితే ఎన్‌డీఏ కూటమి బలం 118కి చేరింది. ఇది మ్యాజిక్ ఫిగర్ కంటే కేవలం నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువ. ఈ స్వల్ప ఆధిక్యం కారణంగా, ఏ చిన్నపాటి చీలిక వచ్చినా మేయర్ పీఠం చేజారిపోయే ప్రమాదం ఉంది.
శివసేన ఐక్యంగా ఉంటే..
మరోవైపు శివసేన (యూబీటీ) 65 స్థానాలను గెలుచుకుంది. ఒకవేళ శివసేన ఐక్యంగా ఉండి ఉంటే, ఉద్ధవ్, షిండే వర్గాల సీట్లు కలిపి (65+29) 94 అయ్యేవని, అది బీజేపీ (89) కంటే ఎక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉండి ఉంటే ఫలితాలు పూర్తిగా తారుమారయ్యేవని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. బీఎంసీపై పట్టు కోల్పోయినప్పటికీ, ముంబై మేయర్‌గా శివసేన (యూబీటీ) అభ్యర్థిని చూడాలన్న తన కల ఇంకా చెదరలేదని, దేవుడు అనుగ్రహిస్తే అది సాధ్యమేనని ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీలో అసంతృప్తి
బీజేపీ అత్యధిక సీట్లు గెలిచినప్పటికీ, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్టీలో అసంతృప్తి నెలకొంది. ఎన్నికలకు ముందు 155 పైగా స్థానాల్లో పోటీ చేసి, కనీసం 110-125 సీట్లు గెలవాలని బీజేపీ తన లక్ష్యంగా పెట్టుకుంది. కానీ షిండే వర్గం గట్టిగా పట్టుబట్టి 91 సీట్లు తీసుకోవడంతో, బీజేపీ 137 స్థానాల్లోనే పోటీ చేయాల్సి వచ్చింది. చివరకు 89 సీట్లతో సరిపెట్టుకోవాల్సి రావడంతో పార్టీ నాయకత్వం నిరాశలో ఉంది. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుండి చేర్చుకున్న 11 మంది సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా ఓడిపోవడం గమనార్హం. ముంబై బీజేపీ యూనిట్‌లో సమన్వయ లోపం, అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు, రాజ్, ఉద్ధవ్ ఠాక్రేలు లేవనెత్తిన మరాఠీ ఆత్మగౌరవం నినాదాన్ని తిప్పికొట్టలేకపోవడమే ఈ ఫలితాలకు కారణమని బీజేపీ నేతలు అంటున్నారు.
ఇది కూడా చదవండి: సిగరెట్ మాఫియా గుప్పిట్లోకి భారత్?


