
పారిస్: ఫ్రాన్స్‌లో ప్రధానుల మార్పిడి తరచూ చోటుచేసుకుంటోంది. ఈ ఏడాదిలో నలుగురు ప్రధానమంత్రులు మారడాన్ని చూస్తే అక్కడి పరిస్థితి ఇట్టే అర్థం అవుతుంది. 30 రోజుల క్రితం సెబాస్టియన్ లెకోర్ను (39) ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే నాలుగు రోజుల క్రితం కేబినెట్ ఏర్పాటు అనంతరం లెకోర్ను ప్రధాని పదవికి రాజీనామా చేశారు. మద్దతుదారులు బెదిరింపుల మధ్య తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇంతలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తనకు అత్యంత సన్నిహితుడైన సెబాస్టియన్ లెకోర్నుకు మద్దతు పలుకుతూ, తిరిగి ఆయనను ప్రధానిగా నియమించారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటు చేసే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారు.
సెబాస్టియన్ లెకోర్ను రాజీనామా అనంతరం ప్రతిపక్షాలు నూతన ప్రధాని కోసం ఎదురు చూశాయి. అయితే దీనికి భిన్నంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవడం వారిని నిరాశ పరిచింది. దేశంలోని రాజకీయ సంక్షోభాన్ని చక్కదిద్దాలని భావించిన మాక్రాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే లెకోర్నును తిరిగి నియమించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మిత్రపక్షాలు సహకరించే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం మరోమారు ఇబ్బందుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది నుంచి ఫ్రాన్స్‌లో రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. హంగ్ పార్లమెంట్ ఏర్పడిన దరిమిలా ప్రభుత్వం పలు ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
ఫ్రాన్స్ ప్రధానిగా లెకోర్ను సెప్టెంబర్ 9న ఎన్నికయ్యారు. అయితే కొద్ది రోజుల తరువాత తన పదవికి రాజీనామా చేశారు. కాగా నాలుగు రోజుల తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తిరిగి లెకోర్నును ప్రధానిగా నియమించారు. గత ఏడాది మాక్రాన్ తన అధికారాన్ని పదిలం చేసుకుంటారని భావించినప్పటికీ, హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. నాటి నుంచి ఫ్రాన్స్ రాజకీయ ప్రతిష్టంభనలో చిక్కుకుంది. పొదుపు బడ్జెట్‌పై కొనసాగుతున్న ప్రతిష్ఠంభనను ముగించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు ప్రధానిగా కొత్త వ్యక్తిని ఆశించారు. అయితే దీనిని భిన్నంగా లెకోర్ను తిరిగి ఇదే పదవిలో నియమితులయ్యారు. ‘రిపబ్లిక్ అధ్యక్షుడు మాక్రాన్ తిరిగి లెకోర్నును ప్రధానిగా నామినేట్ చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను ఆయనకు అప్పగించారు’ అని ఎలీసీ ప్యాలెస్ మీడియాకు తెలిపింది.
తిరిగి ప్రధానిగా ఎన్నికైన లెకోర్ను మాట్లాడుతూ తాను విధి లేని పరిస్థితుల్లో ఈ మిషన్‌ను అంగీకరించానని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఫ్రాన్స్‌కు బడ్జెట్ అందించేందుకు సాధ్యమైనంతవరకు కృషి చేస్తానని అయన అన్నారు. 2017లో అధ్యక్ష పదవిని చేపట్టిన మాక్రాన్ మొదటి నుంచే రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కాగా ఫ్రెంచ్ జాతీయ ర్యాలీ పార్టీ నేత జోర్డాన్ బార్డెల్లా ప్రధానిగా తిరిగి లెకోర్నును నియమించడాన్ని జోక్‌గా అభివర్ణించారు. లెకోర్ను గతంలో రక్షణ మంత్రిగా పనిచేశారు.