టెహ్రాన్: ఇరాన్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ అంతటా డజన్ల కొద్దీ పాలన, సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF) తీవ్రమైన దాడుల తరంగాన్ని కొనసాగిస్తోంది. ఇటీవలి దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) డ్రోన్ ప్రధాన కార్యాలయంపై బాంబులు వేశాయి.
ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ కేంద్ర ప్రధాన కార్యాలయం నుంచి డ్రోన్లు ప్రయోగిస్తారు. "ఇరాన్ ఉగ్రవాద పాలన ఈ ప్రధాన కార్యాలయం నుంచి ఇజ్రాయెల్ వైపు డ్రోన్లను ప్రయోగించింది. అలాగే, ప్రయోగానికి సిద్ధంగా ఉన్న అదనపు డ్రోన్లను అక్కడ నిల్వ చేసింది" అని ఐడీఎఫ్ తెలిపింది.
ఈ దాడి ఇరాన్‌లోని వివిధ సైనిక స్థావరాలు, మిసైల్ ఉత్పత్తి యూనిట్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ఏరోస్పేస్ సదుపాయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో భాగమే. ఇజ్రాయెల్ వైమానిక దళం టెహ్రాన్‌లోని ఐఆర్‌జీసీ ఎయిర్ ఫోర్స్ కమాండ్ సెంటర్‌ను కూడా లక్ష్యంగా చేసుకుందని తెలుస్తోంది. ఈ దాడులతో ఇరాన్ సైనిక సామర్థ్యం గణనీయంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ వైపు నుంచి ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలపై ప్రతీకార దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ ఘటన మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. రెండు వైపులా దాడులు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి.


