ట్రంప్‌నకు కోపం తెప్పించే పని చేసిన పుతిన్‌ | Putin Offers "Unwavering Support" To Iran's New Supreme Leader Mojtaba Khamenei | Sakshi
Sakshi News home page

ట్రంప్‌నకు కోపం తెప్పించే పని చేసిన పుతిన్‌

Mar 9 2026 6:09 PM | Updated on Mar 9 2026 6:32 PM

Putin Offers "Unwavering Support" To Iran's New Supreme Leader Mojtaba Khamenei

టెహ్రాన్‌: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీకి వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం మొజ్తబా ఖమేనీకి మద్దతు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీ మరణించారు. అలీ ఖమేనీ కుమారుడే మొజ్తబా ఖమేనీ.

మొజ్తబాకు పుతిన్‌ ఓ సందేశం పంపారు. “ఇరాన్‌కు మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఇరాన్‌లోని మిత్రులతో ఐక్యంగా ఉంటాం. ఇరాన్‌కు రష్యా విశ్వసనీయ భాగస్వామిగా ఉంది. భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుంది. ఇరాన్ దాడులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో మీ పదవీకాలంలో మీకు చాలా ధైర్యం, అంకితభావం అవసరం” అని తెలిపారు.

తాజాగా, డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లకు పుతిన్ వ్యాఖ్యలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు ఉండడం తనకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇరాన్‌లో సామరస్యం, శాంతిని తీసుకువచ్చే నేత కావాలని చెప్పారు. తమ ఆమోదం లేకపోతే అతను ఎక్కువ కాలం నిలవడని అన్నారు. అలాగే, ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించడం గమనార్హం. 

యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు..
కాగా, ప్రజల ముందుకు మొజ్తబా ఖమేనీ అంతగా రారు. తన 56 సంవత్సరాల జీవితంలో అదే తీరును అవలంభించారు. అయితే, ఇరాన్‌లో చెలరేగిన నిరసనలను అణచివేయడంలో మొజ్తబా పాత్ర ఉంది. గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. సోమవారం ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభించింది. బీరూట్‌లో హిజ్బుల్లా మౌలిక వసతులపై కూడా దాడి చేసింది.

దీనికి ముందు రోజు టెహ్రాన్ చమురు నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ ప్రతిగా ఇజ్రాయెల్‌పై, పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలపై దాడులు చేస్తోంది. ఆదివారం సౌదీ అరేబియాలోని ఓ నివాస ప్రాంతంలో ఒక ఆయుధం పడటంతో ఒక భారతీయుడు సహా ఇద్దరు విదేశీయులు మరణించారు.

ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో మొజ్తబా తండ్రి అలీ ఖమేనీతో పాటు తల్లి, కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ మీడియా నివేదికల ప్రకారం.. మొజ్తబా భార్య పేరు జహ్రా హద్దాద్-అదెల్, ఆయన కుమారుల్లో ఒకరు దాడుల్లో మరణించారు. మొజ్తబాకు ఒక కుమార్తె కూడా ఉంది. మొత్తం ముగ్గురు పిల్లలు. 

Advertisement
 
Advertisement
Advertisement