బహ్రెయిన్ చమురు కేంద్రంపై ఇరాన్ దాడి | Iran Strikes Bahrain Largest Oil Refinery Forcing Bapco to Declare Force Majeure | Sakshi
Sakshi News home page

బహ్రెయిన్ చమురు కేంద్రంపై ఇరాన్ దాడి

Mar 9 2026 7:22 PM | Updated on Mar 9 2026 7:50 PM

Iran Strikes Bahrain Largest Oil Refinery Forcing Bapco to Declare Force Majeure

పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. గల్ఫ్ ప్రాంతంలో కీలకమైన ఇంధన కారిడార్‌ లక్ష్యంగా ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. బహ్రెయిన్‌లోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రమైన ‘అల్-మామీర్’పై ఇరాన్ దాడికి పాల్పడింది. ఈ పరిణామంతో బహ్రెయిన్ ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ ‘బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ’ (బాప్కో) తన చమురు రవాణాపై ‘ఫోర్స్ మేజర్’(అదుపు చేయలేని అసాధారణ పరిస్థితులు) ప్రకటించింది.

బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ అధికారిక సమాచారం ప్రకారం.. అల్-మామీర్ చమురు సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడిలో రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగాయి. ఆస్తి నష్టం భారీగానే జరిగినప్పటికీ అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు ధ్రువీకరించారు. అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర రక్షణ దళాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.

‘ఫోర్స్ మేజర్’ అంటే ఏమిటి?

చమురు వ్యాపార ఒప్పందాల్లో ఫోర్స్ మేజర్ అనేది అత్యంత కీలకమైన అంశం. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు లేదా నియంత్రించలేని అసాధారణ పరిస్థితులు సంభవించినప్పుడు.. ఒక కంపెనీ తన క్లయింట్లకు ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వస్తువులను (చమురు) సరఫరా చేయలేకపోతే ఈ నిబంధనను వాడుకుంటుంది. దీనివల్ల డెలివరీలో జాప్యం జరిగినా లేదా సరఫరా ఆగిపోయినా కంపెనీ(బాప్కో)పై ఎలాంటి చట్టపరమైన చర్యలు లేదా జరిమానాలు పడే అవకాశం ఉండదు.

అంతర్జాతీయ సరఫరాలకు అంతరాయం కలిగినప్పటికీ బహ్రెయిన్ అంతర్గత మార్కెట్‌కు ఇంధన కొరత లేకుండా అత్యవసర ప్రణాళికల ద్వారా సరఫరాను కొనసాగిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

స్తంభించిన హార్ముజ్ జలసంధి..

ఈ దాడి ప్రభావం కేవలం బహ్రెయిన్‌పైనే కాకుండా ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే చమురులో ఐదో వంతు రవాణా అయ్యే అత్యంత కీలకమైన హార్ముజ్‌ జలసంధి గుండా ట్యాంకర్ల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా ట్యాంకర్లు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర భారీగా పెరిగింది. ఇది ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు మొదలైనప్పటి ధరల కంటే 60 శాతం అధికం కావడం గమనార్హం.

ఇదీ చదవండి: నగరాల్లో వంటగ్యాస్ సంక్షోభం!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement