దాదాపు దశాబ్ద కాలం తర్వాత బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి గురువారం ఎన్నికలు జరగబోతున్నాయి. రెండు కోట్లమంది జనాభాతో, కోటి మూడు లక్షలమంది ఓటర్లతో ఉండే ఆ మహానగరం మొగ్గు ఎటువైపుందోనన్న ఉత్కంఠ సామాన్యుల్లో మాత్రమే కాదు... రాజకీయపక్షాల్లో సైతం నెలకొనివుంది. ఇన్నాళ్లూ కరోనా మహమ్మారి, ఓబీసీ కోటాపై నడిచిన కోర్టు కేసులు ఎన్నికలకు ఆటంకంగా నిలిచాయి. దేశంలోనే అత్యంత సంపన్నవంతమైన కార్పొరేషన్‌గా, దాదాపు రూ. 60,000 కోట్ల బడ్జెట్‌తో ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాలను ముంబై మించిపోయింది. అధికార మహాయుతి కూటమిలో ఉంటూ కీచులాడుకుంటున్న పార్టీలను ఏకం చేయటంతోపాటు, రెండు దశాబ్దాల నుంచి దూరదూరంగా ఉంటున్న దాయాదులు ఠాక్రే సోదరుల్ని సైతం కలిపిన ఘనత ఈ ఎన్నికలదే. ఇంతవరకూ తనతో కలిసి నడిచిన ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లు దూరం జరగటంతో గత్యంతరం లేని కాంగ్రెస్ ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ)తో పొత్తు పెట్టుకుంది. 1998 నాటి లోక్‌సభ ఎన్నికల్లో తమ రెండు పార్టీలూ మహారాష్ట్రలో మెజారిటీ స్థానాలు గెల్చుకున్నాయని గుర్తుచేస్తోంది.
బీఎంసీ అనగానే కాంట్రాక్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మహానగర పాలనాధికారం వగైరాలుంటాయి గనుక ఈ ఎన్నికల్లో విజేతగా ఆవిర్భవించే పార్టీ అదుపులో పుష్కలంగా నిధులు, దండిగా రాజకీయ పలుకుబడి, అస్మదీయులకు పంచి పెట్టేందుకు రకరకాల ప్రాజెక్టులు సిద్ధంగా ఉంటాయి. రాష్ట్రాన్నేలుతున్న బీజేపీ–షిండే శివసేన–అజిత్ పవార్ ఎన్సీపీలతో కూడిన మహాయుతి ఇప్పటికే బీఎంసీ తమ చేతి కొచ్చినంత ఆత్మవిశ్వాసంతో ఉంది. తమ రాజ్యాధికార శక్తి, సంస్థాగత నిర్మాణం అందుకు తోడ్పడగలవని భావిస్తున్నాయి. శివసేన పేరునూ, గుర్తునూ ఏక్‌నాథ్ షిండే కైంకర్యం చేయగా బలహీనపడిన ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన(యూబీటీ) గత్యంతరం లేక ఇరవయ్యేళ్ల క్రితం వేరుపడిన దాయాది రాజ్ ఠాక్రేకు సన్నిహితమై ఆయన పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్‌ఎస్)తో పొత్తు పెట్టుకుంది.
ఎప్పటిలా ముంబైలో యూపీ, గుజరాత్, బిహార్‌ల నుంచి వలసొచ్చేవారితో మరాఠీలకు అన్యాయం జరుగుతున్నదంటూ ఆ సోదర ద్వయం నిప్పులు చెరుగుతోంది. త్రిభాషా సూత్రాన్ని మహాయుతి సర్కార్ ఆ మధ్య అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం మరాఠీ ప్రజల్ని దెబ్బతీయటానికేనన్నది వారి అభియోగం. అయితే బీఎంసీ పరిధిలో మరాఠీ మాట్లాడే వారు 30 శాతం మించరు. 1960ల్లో శివసేన ఎదుగుదలకు తోడ్పడిన ప్రాంతీయత, అస్తిత్వవాదం ఇప్పుడేమాత్రం పనికొస్తాయన్నది పెద్ద ప్రశ్న. అందుకే కావొచ్చు... ఇళ్లల్లో పనిచేసే మహిళలకు నెలకు రూ. 1,500; 700 చదరపు అడుగుల వరకూ ఉండే ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు వగైరా హామీలిస్తున్నారు.
ముంబైకి పెట్టుబడుల వరద పారించామంటూ ఎన్నికల ప్రచారం మొదలెట్టిన బీజేపీ ప్రత్యర్థుల దూకుడు చూసి పంథా మార్చుకుంది. నగరంలో ‘బెస్ట్’ బస్సుల్లో మహిళలకు 50 శాతం రాయితీ, వచ్చే అయిదేళ్లూ మున్సిపల్ చార్జీల పెంపుపై మారటోరియం, నిరుపేదలకు ఇళ్లు వగైరాలు మాట్లాడుతోంది. ఆ పార్టీ వలసొచ్చినవారి ప్రయోజనాలకే పాటుబడుతున్నదన్న అనుమానాలున్నా, మరాఠీ మధ్యతరగతి వర్గానికి దగ్గరయ్యామని బీజేపీ భావిస్తోంది. ఆ సంగతలా ఉంచి ఈ ఎన్నికల్లో కూడా ఉచితాలు వినబడటం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రభుత్వాలతో పోలిస్తే రుణ సేకరణకు పరిమితులుండే కార్పొరేషన్లలో ఇలాంటి రాయితీలు, వాగ్దానాలు ఆచరణ సాధ్యమేనా అని చూడటం లేదు.
దేశంలో అన్ని కార్పొరేషన్ల మాదిరే బీఎంసీకి... ఆమాటకొస్తే దాంతోపాటే ఎన్నికలు జరగబోతున్న మహారాష్ట్రలోని మరో 28 కార్పొరేషన్లకూ ఎన్నో సమస్యలున్నాయి. ఉపాధి లేమి, ప్రాథమిక సదుపాయాల లేమి, అస్తవ్యస్త రహదారులు వగైరాలు అందులో కొన్ని. అయితే భావోద్వేగాలూ... లేకుంటే తాయిలాలూ తప్ప ఏ పార్టీ దగ్గరా భవిష్యత్తుకు పనికొచ్చే పథకాలున్నట్టు కనబడదు. దేశ ఆర్థిక రాజధానిగా ఉంటున్న ముంబై ఎటు మొగ్గినా దానికి పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదని ఎన్నికల ప్రచారం తంతు చూస్తే అనిపిస్తుంది.


