breaking news
Mumbai Muncipal Corporation Election
-
రిసార్ట్‌లో ‘షిండే’ కార్పొరేటర్లు.. వీడని ‘మేయర్’ ఉత్కంఠ
ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ఎన్నికల్లో బీజేపీ కూటమి స్పష్టమైన విజయం సాధించినప్పటికీ, ముంబై రాజకీయాల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, సొంతంగా మేజిక్ ఫిగర్‌ను దక్కించుకోలేదు. దీంతో పార్టీకి ఫిరాయింపుల భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మిత్రపక్షమైన బీజేపీ నుండే ఏవైనా ‘ఆపరేషన్లు’ జరుగుతాయేమోనన్న అనుమానంతో, కొత్తగా ఎన్నికైన తమ శివసేన కార్పొరేటర్లను బాంద్రాలోని ఓ రిసార్ట్‌కు తరలించారు. మేయర్ ఎన్నిక పూర్తయ్యే వరకు షిండే వర్గం ఈ ‘రిసార్ట్ పాలిటిక్స్’ వ్యూహాన్ని అమలు చేయనున్నదని తెలుస్తోంది.మ్యాజిక్ ఫిగర్‌కు అంచున ఎన్డీఏ కూటమిమొత్తం 227 స్థానాలున్న బీఎంసీలో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు 114 స్థానాల మద్దతు అవసరం. తాజా ఫలితాల్లో బీజేపీ 89 స్థానాలను గెలుచుకోగా, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 29 స్థానాల్లో విజయం సాధించింది. ఇవి రెండూ కలిపితే ఎన్డీఏ కూటమి బలం 118కి చేరింది. ఇది మ్యాజిక్ ఫిగర్ కంటే కేవలం నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువ. ఈ స్వల్ప ఆధిక్యం కారణంగా, ఏ చిన్నపాటి చీలిక వచ్చినా మేయర్ పీఠం చేజారిపోయే ప్రమాదం ఉంది.శివసేన ఐక్యంగా ఉంటే..మరోవైపు శివసేన (యూబీటీ) 65 స్థానాలను గెలుచుకుంది. ఒకవేళ శివసేన ఐక్యంగా ఉండి ఉంటే, ఉద్ధవ్, షిండే వర్గాల సీట్లు కలిపి (65+29) 94 అయ్యేవని, అది బీజేపీ (89) కంటే ఎక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉండి ఉంటే ఫలితాలు పూర్తిగా తారుమారయ్యేవని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. బీఎంసీపై పట్టు కోల్పోయినప్పటికీ, ముంబై మేయర్‌గా శివసేన (యూబీటీ) అభ్యర్థిని చూడాలన్న తన కల ఇంకా చెదరలేదని, దేవుడు అనుగ్రహిస్తే అది సాధ్యమేనని ఆయన వ్యాఖ్యానించారు.పార్టీలో అసంతృప్తి బీజేపీ అత్యధిక సీట్లు గెలిచినప్పటికీ, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్టీలో అసంతృప్తి నెలకొంది. ఎన్నికలకు ముందు 155 పైగా స్థానాల్లో పోటీ చేసి, కనీసం 110-125 సీట్లు గెలవాలని బీజేపీ తన లక్ష్యంగా పెట్టుకుంది. కానీ షిండే వర్గం గట్టిగా పట్టుబట్టి 91 సీట్లు తీసుకోవడంతో, బీజేపీ 137 స్థానాల్లోనే పోటీ చేయాల్సి వచ్చింది. చివరకు 89 సీట్లతో సరిపెట్టుకోవాల్సి రావడంతో పార్టీ నాయకత్వం నిరాశలో ఉంది. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుండి చేర్చుకున్న 11 మంది సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా ఓడిపోవడం గమనార్హం. ముంబై బీజేపీ యూనిట్లో సమన్వయ లోపం, అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు, రాజ్, ఉద్ధవ్ ఠాక్రేలు లేవనెత్తిన మరాఠీ ఆత్మగౌరవం నినాదాన్ని తిప్పికొట్టలేకపోవడమే ఈ ఫలితాలకు కారణమని బీజేపీ నేతలు అంటున్నారు.ఇది కూడా చదవండి: సిగరెట్ మాఫియా గుప్పిట్లోకి భారత్? -
ముంబైని గెలిచేదెవరు?
దాదాపు దశాబ్ద కాలం తర్వాత బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి గురువారం ఎన్నికలు జరగబోతున్నాయి. రెండు కోట్లమంది జనాభాతో, కోటి మూడు లక్షలమంది ఓటర్లతో ఉండే ఆ మహానగరం మొగ్గు ఎటువైపుందోనన్న ఉత్కంఠ సామాన్యుల్లో మాత్రమే కాదు... రాజకీయపక్షాల్లో సైతం నెలకొనివుంది. ఇన్నాళ్లూ కరోనా మహమ్మారి, ఓబీసీ కోటాపై నడిచిన కోర్టు కేసులు ఎన్నికలకు ఆటంకంగా నిలిచాయి. దేశంలోనే అత్యంత సంపన్నవంతమైన కార్పొరేషన్‌గా, దాదాపు రూ. 60,000 కోట్ల బడ్జెట్‌తో ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాలను ముంబై మించిపోయింది. అధికార మహాయుతి కూటమిలో ఉంటూ కీచులాడుకుంటున్న పార్టీలను ఏకం చేయటంతోపాటు, రెండు దశాబ్దాల నుంచి దూరదూరంగా ఉంటున్న దాయాదులు ఠాక్రే సోదరుల్ని సైతం కలిపిన ఘనత ఈ ఎన్నికలదే. ఇంతవరకూ తనతో కలిసి నడిచిన ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లు దూరం జరగటంతో గత్యంతరం లేని కాంగ్రెస్ ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ)తో పొత్తు పెట్టుకుంది. 1998 నాటి లోక్‌సభ ఎన్నికల్లో తమ రెండు పార్టీలూ మహారాష్ట్రలో మెజారిటీ స్థానాలు గెల్చుకున్నాయని గుర్తుచేస్తోంది. బీఎంసీ అనగానే కాంట్రాక్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మహానగర పాలనాధికారం వగైరాలుంటాయి గనుక ఈ ఎన్నికల్లో విజేతగా ఆవిర్భవించే పార్టీ అదుపులో పుష్కలంగా నిధులు, దండిగా రాజకీయ పలుకుబడి, అస్మదీయులకు పంచి పెట్టేందుకు రకరకాల ప్రాజెక్టులు సిద్ధంగా ఉంటాయి. రాష్ట్రాన్నేలుతున్న బీజేపీ–షిండే శివసేన–అజిత్ పవార్ ఎన్సీపీలతో కూడిన మహాయుతి ఇప్పటికే బీఎంసీ తమ చేతి కొచ్చినంత ఆత్మవిశ్వాసంతో ఉంది. తమ రాజ్యాధికార శక్తి, సంస్థాగత నిర్మాణం అందుకు తోడ్పడగలవని భావిస్తున్నాయి. శివసేన పేరునూ, గుర్తునూ ఏక్నాథ్ షిండే కైంకర్యం చేయగా బలహీనపడిన ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన(యూబీటీ) గత్యంతరం లేక ఇరవయ్యేళ్ల క్రితం వేరుపడిన దాయాది రాజ్ ఠాక్రేకు సన్నిహితమై ఆయన పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్)తో పొత్తు పెట్టుకుంది. ఎప్పటిలా ముంబైలో యూపీ, గుజరాత్, బిహార్‌ల నుంచి వలసొచ్చేవారితో మరాఠీలకు అన్యాయం జరుగుతున్నదంటూ ఆ సోదర ద్వయం నిప్పులు చెరుగుతోంది. త్రిభాషా సూత్రాన్ని మహాయుతి సర్కార్ ఆ మధ్య అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం మరాఠీ ప్రజల్ని దెబ్బతీయటానికేనన్నది వారి అభియోగం. అయితే బీఎంసీ పరిధిలో మరాఠీ మాట్లాడే వారు 30 శాతం మించరు. 1960ల్లో శివసేన ఎదుగుదలకు తోడ్పడిన ప్రాంతీయత, అస్తిత్వవాదం ఇప్పుడేమాత్రం పనికొస్తాయన్నది పెద్ద ప్రశ్న. అందుకే కావొచ్చు... ఇళ్లల్లో పనిచేసే మహిళలకు నెలకు రూ. 1,500; 700 చదరపు అడుగుల వరకూ ఉండే ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు వగైరా హామీలిస్తున్నారు.ముంబైకి పెట్టుబడుల వరద పారించామంటూ ఎన్నికల ప్రచారం మొదలెట్టిన బీజేపీ ప్రత్యర్థుల దూకుడు చూసి పంథా మార్చుకుంది. నగరంలో ‘బెస్ట్’ బస్సుల్లో మహిళలకు 50 శాతం రాయితీ, వచ్చే అయిదేళ్లూ మున్సిపల్ చార్జీల పెంపుపై మారటోరియం, నిరుపేదలకు ఇళ్లు వగైరాలు మాట్లాడుతోంది. ఆ పార్టీ వలసొచ్చినవారి ప్రయోజనాలకే పాటుబడుతున్నదన్న అనుమానాలున్నా, మరాఠీ మధ్యతరగతి వర్గానికి దగ్గరయ్యామని బీజేపీ భావిస్తోంది. ఆ సంగతలా ఉంచి ఈ ఎన్నికల్లో కూడా ఉచితాలు వినబడటం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రభుత్వాలతో పోలిస్తే రుణ సేకరణకు పరిమితులుండే కార్పొరేషన్లలో ఇలాంటి రాయితీలు, వాగ్దానాలు ఆచరణ సాధ్యమేనా అని చూడటం లేదు. దేశంలో అన్ని కార్పొరేషన్ల మాదిరే బీఎంసీకి... ఆమాటకొస్తే దాంతోపాటే ఎన్నికలు జరగబోతున్న మహారాష్ట్రలోని మరో 28 కార్పొరేషన్లకూ ఎన్నో సమస్యలున్నాయి. ఉపాధి లేమి, ప్రాథమిక సదుపాయాల లేమి, అస్తవ్యస్త రహదారులు వగైరాలు అందులో కొన్ని. అయితే భావోద్వేగాలూ... లేకుంటే తాయిలాలూ తప్ప ఏ పార్టీ దగ్గరా భవిష్యత్తుకు పనికొచ్చే పథకాలున్నట్టు కనబడదు. దేశ ఆర్థిక రాజధానిగా ఉంటున్న ముంబై ఎటు మొగ్గినా దానికి పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదని ఎన్నికల ప్రచారం తంతు చూస్తే అనిపిస్తుంది. -
కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం
ముంబై: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కమల వికాసం కొనసాగుతున్న తరుణంలో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తన హవా చూపింది. సోమవారం వెలువడిన మిరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 95 స్థానాలకు గానూ 61 బీజేపీ కైవసం చేసుకోవటం విశేషం. శివసేన కేవలం 22 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇవి పేరుకు మిత్రపక్షాలే అయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం విడివిడిగానే పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ 10 సీట్లు గెలుచుకోగా, ఎన్సీపీ, ఎంఎన్ఎస్ సింగిల్ సీటు కూడా గెలుచుకోలేక ఢీలా పడిపోడ్డాయి. ఇక విజయంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. బీజేపీ సాధించిన భారీ విజయం, విశ్వాస్-వికాస్ అంటూ మోదీ ఇచ్చిన పిలుపునకు ప్రజలు మళ్లీ పట్టాం కట్టారని ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. 2012 లో ఇదే కార్పొరేషన్ కు జరిగిన పోల్ లో బీజేపీ 32 స్థానాలు గెల్చుకోగా, సేన 15 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 19, ఎన్సీపీ 26 సీట్లు గెలుచుకున్నాయి.


