నేటి నుంచి బెంగాల్‌లో బీజేపీ ‘పరివర్తన్‌ యాత్ర’ | BJP Leaders To Address Parivartan Yatra Rallies Across in West Bengal | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బెంగాల్‌లో బీజేపీ ‘పరివర్తన్‌ యాత్ర’

Mar 1 2026 6:23 AM | Updated on Mar 1 2026 6:23 AM

BJP Leaders To Address Parivartan Yatra Rallies Across in West Bengal

కోటిన్నర మంది ఓటర్లను చేరుకునేలా 260 నియోజకవర్గాల్లో సభలు

తొలి రోజు వేర్వేరు సభల్లో పాల్గొననున్న బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు

2వ తేదీన అమిత్‌షా, రాజ్‌నాథ్‌ ర్యాలీలు..ఆపై మోదీ భారీ బహిరంగ సభ

సాక్షి, న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కాషాయదళం ముందుకు సాగుతోంది. పోలింగ్‌కు ముందు పార్టీ శ్రేణులను సన్న ద్ధం చేసేలా బృహత్‌ కార్యాచరణతో ముందుకెళుతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేలా ఆదివారం నుంచి వారం పాటు ‘పరివర్తన్‌ యాత్ర’కు శ్రీకారం చుట్టింది. 

260 భారీ సభలు..
2021 అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గానూ బీజేపీ 77 సీట్లు గెలుచుకుంది. ఈసారి 160 స్థానాలు లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో తృణముల్‌ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా యాత్రను మొదలు పెట్టనుంది. రాష్ట్రంలో రాజ్యాంగం అమలుకావడం లేదని, మహిళలపై నేరాలు పెరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో టీఎంసీ ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తోంది. ముఖ్యంగా రైతులకు లబ్ధి చేకూర్చే పీఎం కిసాన్‌ వంటి పథకాలు రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు కాలేదని చెబుతోంది.

 అక్రమ ఓటర్లు, చొరబాటుదారుల అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ జాతీయ భద్రతపై టీఎంసీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. వీటన్నింటినీ తమ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇందుకుగాను 260 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు, 250 చిన్నచిన్న సమావేశాలు ఏర్పాటు చేస్తూ మొత్తంగా 5 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసేలా యాత్రను డిజైన్‌ చేశారు. దీనిద్వారా ప్రత్యక్షంగా కోటిన్నర మంది ప్రజలను కలవాలన్నది లక్ష్యంగా ఉంది.

 ఆదివారం ప్రారంభం కానున్న ఈ యాత్రలో తొలిరోజు కూచ్‌బెహర్‌ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ హాజరు కానుండగా, నదియా ఉత్తర్‌లో మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఘార్‌గ్రామ్‌లో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పురులియాలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి పాల్గొననున్నారు. 

2వ తేదీన దక్షిణ 24 పరగణాలు, మథురాపూర్, రాయదిఘి సభలకు హోంమంత్రి అమిత్‌ షా, హౌరా, హూగ్లీ జిల్లాల సభలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, రాద్వాన్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు సభలకు హాజరు కానున్నారు. ఈ యాత్ర చివరి రోజు నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా బూత్‌ స్థాయి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడమే లక్ష్యంగా ఈ యాత్ర ముందుకు సాగనుంది.  

Advertisement
 
Advertisement
Advertisement