ఇది హరిత విద్యుత్‌ శకం | PM Surya Ghar Reaches 23. 96 Lakh Households | Sakshi
Sakshi News home page

ఇది హరిత విద్యుత్‌ శకం

Mar 1 2026 5:57 AM | Updated on Mar 1 2026 5:57 AM

PM Surya Ghar Reaches 23. 96 Lakh Households

‘పీఎం సూర్య ఘర్‌’ద్వారా 23.9 లక్షల ఇళ్లకు సౌర వెలుగులు

ఏడు గిగావాట్ల విద్యుదుత్పత్తి.. రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు

దేశంలో తొలి పోర్ట్‌ ఆధారిత గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు ప్రారంభం

సాక్షి, న్యూఢిల్లీ: పర్యావరణ హిత ఇంధన వనరుల (క్లీన్‌ ఎనర్జీ) వినియోగం దిశగా దేశం శరవేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే కాలంలో పూర్తిగా పునరుత్పాదక ఇంధన వనరులపైనే ఆధారపడేలా కేంద్రం ప్రణాళికలను రూపొందించింది. ఇందులో భాగంగా శనివారం ’ఇంధన వనరుల పరిణామ క్రమం’పేరిట విడుదల చేసిన ప్రత్యేక నివేదికలో దేశ ఇంధన రంగ ముఖచిత్రాన్ని సమగ్రంగా వివరించింది.

సౌరవిద్యుత్‌ వెలుగులు
సౌర విద్యుత్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ’పీఎం సూర్య ఘర్‌’పథకం అద్భుత ఫలితాలు సాధిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 23.9 లక్షల ఇళ్లలో రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏకంగా 7 గిగావాట్ల స్వచ్ఛమైన విద్యుత్‌ సామర్థ్యం అదనంగా సమకూరింది. ఈ పథకం వల్ల సామాన్యులకు కరెంటు బిల్లుల భారం తగ్గడంతో పాటు, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోంది.

పెట్టుబడుల వెల్లువ
క్లీన్‌ ఎనర్జీ రంగంలో వస్తున్న మార్పులతో దేశంలోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. విద్యుత్‌ రంగంలో సరికొత్త సంస్కరణల కారణంగా సుమారు రూ. 8 లక్షల కోట్లకు పైగా భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్‌ సఫలమైంది. పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు తగినట్లుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూనే, కాలుష్య రహిత ఇంధన రంగం వైపు దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో ఈ పెట్టుబడులు కీలకంగా మారనున్నాయి.

గ్రీన్‌ హైడ్రోజన్‌.. మిషన్‌ లైఫ్‌
భవిష్యత్‌ ఇంధనంగా భావిస్తున్న గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తిపై కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా దేశంలోనే మొట్టమొదటి పోర్ట్‌ ఆధారిత (ఓడరేవు) గ్రీన్‌ హైడ్రోజన్‌ పైలట్‌ ప్రాజెక్టును విజయవంతంగా ప్రారంభించింది. దీనితో పాటు నీతి ఆయోగ్, ఆర్థిక శాఖల సమన్వ యంతో ’మిషన్‌ లైఫ్‌’ద్వారా పర్యావరణ హిత జీవనశైలిని అలవర్చుకునేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. విద్యుత్‌ పొదుపు, ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి చర్యలతో వాతావరణ మార్పులను అడ్డుకోవచ్చని ఆ నివేదిక స్పష్టం చేసింది. మొత్తమ్మీద బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వనరుల నుంచి కాలుష్య రహిత హరిత ఇంధనం వైపు భారత్‌ చేస్తున్న ప్రయాణం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఈ నివేదిక తేల్చిచెప్పింది. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించే దిశగా ఇది ఒక చారిత్రక ముందడుగుగా అభివర్ణించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement