తిరువనంతపురం: కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మండిపడ్డారు. రాష్ట్రాలు, పట్టణాల పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ద అభివృద్ధి ఎందుకు లేదని అసహనం వ్యక్తం చేశారు. కేరళ పేరు మార్చారు కానీ.. అభివృద్ధిని మర్చిపోయారని విమర్శలు గుప్పించారు.
కేరళ పేరును కేరళంగా మార్చడంతో ఎంపీ శశిథరూర్ మరోసారి స్పందించారు. ఈ సందర్బంగా శశిథరూర్.. కేంద్ర ప్రభుత్వానికి పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఎందుకు లేదు?. కేరళకు కేంద్రం ఒక్క ఎయిమ్స్ కానీ, కొత్త విద్యా సంస్థలు కానీ ఇవ్వలేదు. బడ్జెట్‌లో ఒక్క ప్రాజెక్టు కూడా కేటాయించలేదు. కానీ పేరు మార్చమంటే మాత్రం వెంటనే ఆమోదిస్తారు. మలయాళంలో ఇప్పటికే దాన్ని ‘కేరళం’ అనే పిలుస్తారని, ఇప్పుడు ఇంగ్లీషులోకి కూడా అదే పదాన్ని తీసుకురావడంలో అర్థం లేదు. ఇప్పుడు కేరళ ప్రజలను ఏమని పిలవాలి.. ‘కేరళమైట్’ అందామంటే అదేదో బ్యాక్టీరియాలా అనిపిస్తోంది. ‘కేరళమియన్’ అందామంటే ఖనిజంలా ఉంది’ అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. కేరళలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, అంతకుముందే.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. అన్ని భారతీయ భాషల్లోనూ ‘కేరళం’ అనే పేరు ఉండాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడంతో మంగళవారం జరిగిన సమావేశంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో, కేరళ పేరు మార్పు జరిగింది.


