కేరళ ‘కేరళం’.. బెంగాల్‌ ‘బంగో’ అయ్యేదెన్నడు? | Bengal failed to become Bongo or Bangla | Sakshi
Sakshi News home page

కేరళ ‘కేరళం’.. బెంగాల్‌ ‘బంగో’ అయ్యేదెన్నడు?

Feb 25 2026 10:56 AM | Updated on Feb 25 2026 11:18 AM

Bengal failed to become Bongo or Bangla

న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా ‘కేరళం’గా మారుస్తూ పంపిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం ద్వారా దశాబ్దాల కాలంగా మలయాళీలు కోరుకుంటున్న తమ రాష్ట్ర అసలు పేరు పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. త్వరలో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేరళ పేరు మార్పునకు సానుకూలంగా స్పందించిన కేంద్రం, పశ్చిమ బెంగాల్ విషయంలో కొన్ని దశాబ్దాలుగా విముఖత వ్యక్తం చేయడం ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది.

పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగో’ లేదా 'బంగ్లా'గా మార్చాలని నాటి జ్యోతి బసు నుండి నేటి మమతా బెనర్జీ వరకు కనీసం నాలుగు సార్లు అసెంబ్లీ తీర్మానాలు చేసినా కేంద్రం వాటిని తిరస్కరించింది. ముఖ్యంగా అక్షర క్రమం ప్రకారం అధికారిక సమావేశాల్లో తమ రాష్ట్రం(వెస్ట్‌ బెంగాల్‌) పేరు చివరన రావడం వల్ల, తమకు మాట్లాడే అవకాశం అందరికంటే చివర్లో వస్తోందని, తద్వారా రాష్ట్ర సమస్యలను వివరించే సమయానికి ఏకాగ్రత తగ్గుతోందని మమతా బెనర్జీ గతంలో వాదించారు.

2016లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు పేర్లు (ఆంగ్లంలో బెంగాల్, బెంగాలీలో బంగ్లా, హిందీలో బంగాల్) విధానాన్ని కేంద్రం తిరస్కరించింది. రాష్ట్రం మొత్తానికి ఒకే పేరు ఉండాలని కేంద్రం స్పష్టం చేయడంతో, 2018లో ‘బంగ్లా’ అనే పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించినా, ఆ పేరు పొరుగు దేశమైన 'బంగ్లాదేశ్'ను పోలి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.

కేరళ ప్రతిపాదన ఆమోదం పొందడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. కేరళలో బీజేపీ, సీపీఎం మధ్య ఉన్న రహస్య ఒప్పందం వల్లే ఈ నిర్ణయం వేగంగా జరిగిందని ఆమె ఆరోపించారు. బెంగాల్‌పై కేంద్రం వివక్ష చూపుతోందని, అయినా తాము ‘బంగ్లా’ పేరు కోసం పోరాడుతూనే ఉంటామని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రాల పేర్ల మార్పులో పార్లమెంటుదే తుది నిర్ణయం అయినందున ఈ విషయంలో బెంగాల్ పేరు మార్పునకు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.

 ఇది కూడా చదవండి: చావబోయే పాక్‌ ప్రధానిని కాపాడా: ట్రంప్

Advertisement
 
Advertisement
Advertisement