యూత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అరెస్టు | Indian Youth Congress chief Uday Bhanu Chib has been arrested | Sakshi
Sakshi News home page

యూత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అరెస్టు

Feb 25 2026 6:15 AM | Updated on Feb 25 2026 6:15 AM

Indian Youth Congress chief Uday Bhanu Chib has been arrested

నాలుగు రోజుల పోలీస్‌ కస్టడీ 

‘ఏఐ’నిరసనకు మాస్టర్‌ మైండ్‌ 

ఢిల్లీ కోర్టుకు తెలిపిన పోలీసులు 

త్వరలో మరిన్ని అరెస్టులు!

న్యూఢిల్లీ: ఏఐ ఇండియా ఇంపాక్ట్‌ సదస్సు వేదిక వద్ద అర్ధ నగ్న నిరసన ప్రదర్శన కేసులో భారత యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఉదయ్‌ భాను చిబ్‌ను ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దాంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఎనిమిదికి చేరింది. చిబ్‌ను ఉదయం 4:30 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకుని ఉదయం 10 గంటలకు పాటియాలా హౌస్‌ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనపై నేరపూరిత కుట్ర, ప్రభుత్వోద్యోగికి హాని కలిగించడం, విధి నిర్వహణను అడ్డుకోవడం, ఉద్దేశపూర్వక అవిధేయత వంటి పలు అభియోగాలు నమోదు చేశారు. ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ నిరసన ప్రదర్శనకు ప్రధాన సూత్రధారి, కుట్రదారు ఆయనేనని పోలీసులు పేర్కొన్నారు. ‘‘ఇది నేపాల్‌లో జెన్‌–జీ నిరసనల నుంచి ప్రేరణ పొందిన పెద్ద కుట్ర.

 దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు అందులో పాల్గొన్నారు. ఈ దర్యాప్తు చాలా ముఖ్యమైనది’’అని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే చిబ్‌ నిరసన స్థలంలో లేరని, నిరసనకు సంబంధించి ఎలాంటి సూచనలూ చేయలేదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. అంతర్జాతీయ కార్యక్రమాల సందర్భంగా నిరసనలు పరిపాటేనని వాదించారు. భారత్‌ ప్రజాస్వామ్య దేశమని అంతా అభినందిస్తుంటే నిరసనలకు నిరాకరించడం ఏమిటని ప్రశ్నించారు. వాదనల అనంతరం చిబ్‌కు జడ్జి నాలుగు రోజుల పోలీసు రిమాండ్‌ విధించారు.

గత శుక్రవారం ఢిల్లీలో ఏఐ సదస్సు వేదికైన భారత మండపం ముందు యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు టీ షర్టులు విప్పి అర్ధనగ్న నిరసనలకు దిగడం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన వారిలో తెలంగాణకు చెందిన నరసింహ యాదవ్‌ కూడా ఉన్నారు. వేదిక వద్దకు ప్రవేశం కోసం వారంతా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. త్వరలో మరిన్ని అరెస్టులు ఉంటాయని వెల్లడించారు. ఏఐ సదస్సు నిరసన కేసును క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. తదుపరి దర్యాప్తును క్రైమ్‌ బ్రాంచ్‌ తాలూకు ఇంటర్‌ స్టేట్‌ సెల్‌ (ఐఎస్‌సీ) నిర్వహిస్తుంది.  

నియంతృత్వం: రాహుల్‌ 
దేశంలో ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కారు ఖూనీ చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. చిబ్, ఇతర యువజన కాంగ్రెస్‌ నేతల అరెస్టులను ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇది మోదీ సర్కారు నియంతృత్వ ధోరణులకు, పిరికితనానికి నిదర్శనమంటూ దుయ్యబట్టారు. దేశ ప్రయో జనాల కోసం నిర్భయంగా గొంతెత్తిన యువజన కాంగ్రెస్‌ సభ్యులను చూస్తే గర్వంగా ఉందన్నారు.

భయపడేది లేదు: ఖర్గే 
అరెస్టులకు కాంగ్రెస్‌ భయపడబోదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ‘‘మమ్మల్ని భయపెట్టాలని మోదీ ప్రయతి్నస్తున్నారు. అదెన్నటికీ జరగదు. ఆయన సర్కారు ట్రంప్‌కు లొంగిపోయింది. ఆయన షరతులన్నింటికీ తలూపింది. ఉపాధి లేక దేశ యువత తీవ్ర నిరాశలో కూరుకుపోతోంది. మోదీ సర్కారుపై వారిలో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి’’అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement