పని అయిపోయిందా.. ఇది మరో కుట్రా.? | Botsa Satyanarayana comment on Vasudeva Reddy arrest | Sakshi
Sakshi News home page

పని అయిపోయిందా.. ఇది మరో కుట్రా.?

Feb 22 2026 5:29 AM | Updated on Feb 22 2026 5:29 AM

Botsa Satyanarayana comment on Vasudeva Reddy arrest

వాసుదేవరెడ్డి అరెస్టుపై బొత్స సత్యనారాయణ వ్యాఖ్య 

ఇన్నాళ్లూ వాసుదేవరెడ్డిని పావులా వాడుకున్న చంద్రబాబు ప్రభుత్వం 

అధికారులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకుల అరెస్టులతో కక్షసాధించారు 

చంద్రబాబుపై మద్యం కేసు మూసివేతకీ సహకరించిన వాసుదేవరెడ్డి 

ఇప్పుడు అకస్మాత్తుగా అరెస్టు చేయడం సందేహాస్పదం   

సాక్షి, అమరావతి : మద్యం అక్రమ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీ బెవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీబీసీఎల్‌) అప్పటి మేనేజింగ్‌ డైరెక్టర్‌ వాసుదేవరెడ్డిని ఇప్పటి వరకు వాడుకున్న చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు అరెస్ట్‌ చేసిందని, ఆయనతో పని అయిపోయిందా లేక ఇది మరో కుట్రా అని శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. జరగని మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకున్న కూటమి ప్రభుత్వం, ఇందుకు వాసుదేవరెడ్డిని ఓ పావుగా వాడుకుందని, ఆయన్ను హింసించి, ప్రలోభపెట్టి వారికి  కావాల్సిన విధంగా ఆయన్నుంచి వాంగ్మూలాలు తీసుకుందని బొత్స శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఏ స్కీమ్‌ ప్రకారం ఇంత బురదజల్లారని ఆయన ప్రశ్నించారు.అన్యాయంగా ఆఫీసర్లను, వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ నాయకులను అరెస్టు చేసి జైలులో నిర్బంధించారని, వారందరినీ న్యాయస్థానాలు విడుదల చేయడంతోనే ఈ కేసులో అసలు స్కామ్‌ లేదని అర్ధమవుతోందని బొత్స వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ ఏ2ను బయట ఉండనిచ్చి, తాము ఎంచుకున్న అధికారులను, నాయకులను అరెస్టులు చేయడాన్ని బట్టే ఇందులో ఏ స్కామ్‌ లేదని అందరికీ అర్ధమయ్యిందని, ఇదంతా సర్కారు జల్లిన బురదేనని అర్ధమవుతోందని అన్నారు. 

వరుసగా లడ్డూ కల్తీ వివాదంలో దొరికిపోవడం, హెరిటేజ్‌ – ఇందాపూర్‌ బంధం బయటపడడం, శాసనమండలిలో కనీసం సమాధానం చెప్పలేని దుర్గతి పట్టడంతో.. ఇపుడు ఏదో కొత్త కుట్రకు పదును పెడుతున్నట్లు అర్ధమవుతోందని బొత్స వ్యాఖ్యానించారు. చంద్రబాబు సాగించిన మద్యం దోపిడీపై ఫిర్యాదు చేసిన అప్పటి బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి తాను గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి భిన్నంగా అబద్దపు వాంగ్మూలం ఇచ్చి చంద్రబాబు మద్యం కేసు మూసివేతకు సహకరించిన విషయమూ తెలిసిందేనన్నారు.  

బొత్స ఇంకా ఏమన్నారంటే.. ‘‘వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలను, అప్పటి ప్రభుత్వ హయాంలోని కీలక అధికారులను అక్రమంగా అరెస్ట్‌ చేసి నెలల పాటు జైల్లో ఉంచింది. అయితే న్యాయస్థానాలు బెయిల్‌ ఇవ్వడంతో వారందరూ  జైలు నుంచి విడుదలయ్యారు. ఇన్ని రోజులు ఏ2గా ఉన్న వాసుదేవరెడ్డి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నప్పుడు కనీస స్థాయిలో కూడా అభ్యంతరం చెప్పని చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు తన నిజ స్వరూపాన్ని బయట పెట్టింది. 

వాసుదేవరెడ్డి బయట ఉండటానికి వీల్లేదని, ఆయన సాక్ష్యాలను తారుమారు చేస్తారని, అందువల్ల ఆయన్ను అరెస్ట్‌ చేసినట్లు సన్నాయి నొక్కులు నొక్కుతోంది. వాస్తవానికి ఇదంతా కూడా ఓ నాటకంలా కనిపిస్తోంది. ఇన్ని రోజులు తమ చెప్పు చేతల్లో ఉన్న వాసుదేవరెడ్డి నుంచి వారికి  కావాల్సిన విధంగా వివరాలు తెలుసుకున్న సిట్, ఇప్పుడు అదే వ్యక్తి నుంచి కొత్తగా రాబట్టాల్సిన వివరాలు ఏముంటాయి? అరెస్ట్‌ సమయంలో ఆయన్ను మధ్యవర్తుల సమక్షంలో విచారించామని, అయితే ఆయన కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పలేదని సిట్‌ తన రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. 

ముందస్తు బెయిల్‌ కోసం వాసుదేవరెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినప్పుడు, ఇదే సిట్‌ అప్పుడు ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ప్రస్తుతం రిమాండ్‌ రిపోర్ట్‌లో చేసిన ఏ ఆరోపణను కూడా ఏసీబీ కోర్టు ముందు ప్రస్తావించలేదు. పైపెచ్చు వాసుదేవరెడ్డి తమకు పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పింది. హైకోర్టులో కూడా ఇదే రీతిలో చెప్పింది.  

భయపెట్టి.. ప్రలోభపెట్టి వాసుదేవరెడ్డిని లొంగదీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. 
చంద్రబాబు అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ కీలక నేతలపై దృష్టి సారించారు. ఇందుకు అనుగుణంగా మద్యం కుంభకోణమంటూ ఓ తప్పుడు కేసు తెరపైకి తెచ్చారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేశారు. ఈ సిట్‌ పలువురు వైఎస్సార్‌సీపీ నేతలను, అప్పటి అధికారులను నిందితులుగా చేర్చింది. ఇందులో వాసుదేవరెడ్డి రెండో నిందితునిగా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్‌ చేసేందుకు వాసుదేవరెడ్డిని వేధింపులకు గురి చేసి సిట్‌ తన చెప్పు చేతల్లోకి తెచ్చుకుంది. అరెస్ట్‌ బూచిని చూపి ఆయన్ను భయపెట్టింది. 

ఇలా వాసుదేవరెడ్డిని దార్లోకి తెచ్చుకున్న సీఐడీ, ఆయనకు ప్రలోభాలు చూపింది. ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోమని, రాష్ట్రం నుంచి రిలీవ్‌ చేసి తిరిగి మాతృశాఖ అయిన రైల్వేకు పంపుతామని హామీ ఇచ్చింది. అరెస్ట్‌ చేయబోమని, అప్రూవర్‌గా మారి తాము చెప్పినట్లు చేస్తే చాలని వాసుదేవరెడ్డికి చెప్పింది. దీంతో వాసుదేవరెడ్డి పూర్తిగా చంద్రబాబు అండ్‌ కోకు లొంగిపోయారు. ఇచ్చిన హామీ మేర ఆయన్ను మాతృశాఖ అయిన రైల్వేకు పంపేసింది. ఇదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని వైఎస్సార్‌సీపీ నేతలను, విశ్రాంత అధికారులను అరెస్ట్‌ చేయడం మొదలు పెట్టింది. 

వాసుదేవరెడ్డి వాంగ్మూలాలను ముందు పెట్టి వారికి బెయిల్‌ రాకుండా అడ్డుకుంటూ వచ్చింది. చివరకు వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేయగా, ఆయనకు మద్దతుగా వాదనలు వినిపించింది. వాసుదేవరెడ్డిని అప్రూవర్‌గా మార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిట్‌ ద్వారా శతవిధాలా ప్రయత్నించింది. ముందస్తు బెయిలిస్తే అప్రూవర్‌గా మారుతానంటూ ఏసీబీ కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సిట్‌ వ్యతిరేకించలేదు. అయితే ముందస్తు బెయిల్‌ ఇస్తే అప్రూవర్‌గా మారుతానన్న షరతును ఏసీబీ కోర్టు తప్పుపట్టింది. 

అప్రూవర్‌గా మారే వ్యక్తి కేసు విచారణ మొత్తం పూర్తయి తీర్పు వెలువడేంత వరకు జైల్లోనే ఉండాల్సి ఉంటుందని, ముందస్తు బెయిల్‌ అన్న ప్రశ్నే తలెత్తదని ఏసీబీ కోర్టు తేల్చి చెబుతూ, ఆయన పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో వాసుదేవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అప్రూవర్‌గా మారతానని, ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మద్యం కేసులో సహ నిందితునిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభ్యంతరం చెబుతూ ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 

వాస్తవానికి కీలక నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకించాల్సిన సిట్, విస్మయకరంగా చెవిరెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌ను వ్యతిరేకించింది. తద్వారా పరోక్షంగా వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సమర్థించినట్లయింది.’’ అని బొత్స పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement