ఇంటర్‌ ప్రశ్న పత్రాల చేరవేతలో గందరగోళం | confusion in delivery of inter question papers: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ప్రశ్న పత్రాల చేరవేతలో గందరగోళం

Feb 22 2026 5:21 AM | Updated on Feb 22 2026 5:21 AM

confusion in delivery of inter question papers: Andhra Pradesh

ఒక సెంటర్‌ పేపర్లు మరో సెంటర్‌కు చేరవేత 

బండిల్స్‌లో ఉన్న పేపర్లపైనా అనుమానాలు  

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్‌ పరీక్షల  ఏర్పాట్లలో గందరగోళం తలెత్తింది. ఒక సెంటర్‌కు వెళ్లాల్సిన పేపర్లు మరో సెంటర్‌కు పంపారని ఆయా కేంద్రాల అధికారుల్లో ఆందోళన నెలకొంది. సోమవారం నుంచి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి జిల్లా స్టోరేజ్‌ కేంద్రాలకు పేపర్లు తరలించారు. వాటిని అక్కడి నుంచి పరీక్షల నిర్వహణ సెంటర్లకు అందించేందుకు శుక్ర, శనివారాల్లో స్థానిక పోలీస్‌ స్టేషన్ల (కస్టోడియన్‌)కు చేరవేశారు. ఇక్కడి పేపర్లను ఆయా సెంటర్ల కస్టోడియన్స్, చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో సెంటర్‌ ఆధారంగా డేటాను పరిశీలించగా, ఒక సెంటర్‌కు ఇవ్వాల్సిన పేపర్‌ బండిల్స్‌ స్థానంలో మరో సెంటర్‌వి వచ్చాయని గుర్తించారు.

ఎన్‌టీఆర్‌ జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇలా జరిగినట్టు స్థానిక ఆర్‌ఐవోలు గుర్తించారు. అలాగే, ఈ పేపర్ల సంఖ్య కూడా మారిపోయి ఉంటుందని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శనివారం వచ్చిన సెట్‌–3 పేపర్లలో తప్పులు ఉన్నట్టు, బండిల్స్‌ మారిపోయాయని గుర్తించినట్టు చెబుతున్నారు. మొదటి రెండు సెట్స్‌ సరిగానే ఉన్నాయని, చివరిగా వచ్చిన సెట్‌–3లోనే బండిల్స్‌ మారిపోయినట్టు సమాచారం. సోమవారం జరిగే పరీక్షల్లో సెట్‌–3 పేపర్లు ఇవ్వాల్సి వస్తే.. పరిస్థితి ఏంటని అందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన బండిళ్లల్లో సెంటర్‌కు అవసరమైనన్ని పేపర్లు ఉన్నాయో లేదోనని అధికారులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు స్పందిస్తూ దీనివల్ల ఎలాంటి సమస్యా లేదని పేర్కొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement