పాఠశాలల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలు! | Drug and marijuana sales in schools | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలు!

Feb 22 2026 5:14 AM | Updated on Feb 22 2026 5:14 AM

Drug and marijuana sales in schools

అరకు, పాడేరు ప్రాంతాల్లో విద్యార్థుల భద్రతపై జెడ్పీటీసీల ఆందోళన 

చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం 

మహారాణిపేట: అరకు, పాడేరు ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థులు డ్రగ్స్, గంజాయి బారిన పడుతుండటంపై విశాఖ జెడ్పీటీసీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జె. సుభద్ర అధ్యక్షతన శనివారం నిర్వహించిన స్థాయీ సంఘ సమావేశాల్లో ఈ సమస్యపై వాడివేడి చర్చ జరిగింది. వైఎస్సార్‌సీపీ సభ్యులు  చెట్టి రోశ్ని (అరకు), సుర్ల గిరిబాబు (గొలుగొండ), సోము సత్యనారాయణ (మునగపాక), సీపీఎం సభ్యులు డి.గంగరాజు (అనంతగిరి) ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యా సంస్థల వద్ద గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని  కోరారు. 

బాబు సర్కార్‌ నిర్లక్ష్యం వల్లే మాదకద్రవ్యాల సాగు, అమ్మకాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు. దీనిపై స్పందించిన చైర్‌పర్సన్‌ విద్యాశాఖ ఇతర విభాగాలతో కలిసి విద్యార్థుల్లో అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

అల్లూరి జిల్లా డీఎంహెచ్‌ఓను సరెండర్‌ చేయాలి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్న డీఎంహెచ్‌ఓను తక్షణమే సరెండర్‌ చేయాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. ఆ అధికారి వల్ల ప్రజలు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అనంతగిరి, అరకు జెడ్పీటీసీలు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు రాత్రిళ్లు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకువచ్చారు. 

దీనిపై చైర్‌పర్సన్‌ స్పందిస్తూ మహిళా సిబ్బంది పట్ల అగౌరవంగా ప్రవర్తించే అధికారుల వైఖరి మార్చుకోవాలని, ఈ వ్యవహారంపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు ఇవ్వాలని జెడ్పీటీసీ గిరిబాబు కోరారు. గత 19 నెలలుగా కొత్త పెన్షన్ల మంజూరు లేకపోవడంతో పేదలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈఓ పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈఓ కె.రాజ్‌కుమార్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement