భర్త అసౌకర్యం కంటే భార్య సౌకర్యానికే ప్రాధాన్యత | High Court ruling on transfer of marital dispute cases | Sakshi
Sakshi News home page

భర్త అసౌకర్యం కంటే భార్య సౌకర్యానికే ప్రాధాన్యత

Feb 22 2026 5:26 AM | Updated on Feb 22 2026 5:26 AM

High Court ruling on transfer of marital dispute cases

వైవాహిక వివాదాల కేసుల బదిలీపై హైకోర్టు తీర్పు

సాక్షి, అమరావతి: వైవాహిక వివాదాల కేసుల్లో భర్తకు కలిగే అసౌకర్యం కంటే భార్య సౌకర్యానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. విడాకుల నిమిత్తం భర్త పిటిషన్‌ దాఖలు చేసిన ప్రదేశానికి వెళ్లడానికి భార్యకు తగినంత ఆర్థిక స్తోమత లేనప్పుడు, ఆ పిటిషన్‌ను తనకు సౌకర్యంగా ఉండే చోటుకు బదిలీ చేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన బదిలీ పిటిషన్‌ను అనుమతించవచ్చని హైకోర్టు తెలిపింది. వైవాహిక వివాదాల కేసుల్లో బదిలీ పిటిషన్లను పరిశీలించేటప్పుడు కోర్టులు ఇరుపక్షాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను, వారి జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

రెండు వేర్వేరు విడాకుల కేసుల్లో ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వేణుతురుమల్లి గోపాలకృష్ణారావు ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. తన భర్త మోహన మురళీ దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను రేపల్లె నుంచి ఒంగోలుకు బదిలీ చేయాలని కోరుతూ భార్య రాజేశ్వరి  దాఖలు చేసిన పిటిషన్‌ను, అలాగే తన భర్త పవన్‌ దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను తిరుపతి నుంచి ఆదోనికి బదిలీ చేయాలని ఐశ్వర్య అనే మరో మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి అనుమతించారు. 

కాగా,  విడాకుల కోసం పిటిషన్లు దాఖలు చేసిన భర్తలను తప్పనిసరిగా కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనంటూ ఒత్తిడి చేయవద్దని న్యాయమూర్తి సూచించారు.  భర్తల తరఫున న్యాయవాదులు హాజరవుతున్నంత కాలం వారి వ్యక్తిగత హాజరు అవసరం లేదని పేర్కొన్నారు.  అయితే క్రాస్‌ ఎగ్జామినేషన్‌ లేదా ఇతర ప్రత్యేక పరిస్థితుల్లో వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement