డేటా.. 'నీరెలా'? | Data centers are expanding in the country | Sakshi
Sakshi News home page

డేటా.. 'నీరెలా'?

Feb 25 2026 3:34 AM | Updated on Feb 25 2026 3:34 AM

Data centers are expanding in the country

దేశంలో విస్తరిస్తున్నడేటా సెంటర్స్‌ 

ఐదేళ్లలోనాలుగింతలుపెరిగిన సామర్థ్యం 

ఈ కేంద్రాలున్ననగరాల్లో నీటి కొరత   

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌ :  భారత్‌ కేంద్రంగా డేటా సెంటర్ల నుంచి కార్యకలాపాలు సాగించే విదేశీ క్లౌడ్‌ సేవల కంపెనీలకు తాజా బడ్జెట్‌లో 2047 వరకు ట్యాక్స్‌ హాలిడే (పన్ను మినహాయింపు) ప్రతిపాదించారు. తద్వారా ఈ రంగంలో రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. 

క్లౌడ్‌ మౌలిక వసతులను కీలక రంగాల్లో ఒకటిగా, అలాగే కంప్యూటింగ్‌ సామర్థ్యాలను నిర్వహణ వ్యయాలుగా కాకుండా మూలధనంగా వర్గీకరించడం ద్వారా భారత్‌ ప్రపంచ డిజిటల్‌ ఫ్యాక్టరీగా మారేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పరిశ్రమ ధీమాగా ఉంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఈ సెంటర్ల విస్తరణతో నీరు, శక్తి వనరులపై తీవ్ర ప్రభావం చూపుతుండటం ఆందోళన కలిగించే అంశం. 

డిజిటలీకరణ భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది.ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కృత్రిమ మేధ (ఏఐ), 5జీ సేవలకు డిమాండ్‌ పెరుగుతోంది. డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌–2023తోపాటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం డేటా మన దేశంలోనే నిల్వ చేయాలి. ఈ నేపథ్యంలో భారత్‌లో డేటా సెంటర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఐటీ మౌలిక సదుపాయాలను కలిగి ఉన్న కేంద్రీకృత సౌకర్యాలేఈ డేటా సెంటర్లు.  

ఐదు నగరాలకే.. 
డేటా సెంటర్ల సామర్థ్యం 2019తో పోలిస్తే భారత్‌లో 2024 నాటికి నాలుగింతలు దాటింది. అయితే 94% సామర్థ్యం అయిదు నగరాలకే పరిమితమైంది. వీటిలో దేశ ఆర్థిక రాజధాని ముంబై మినహా మిగిలిన చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, పుణె నగరాలు ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. 

డేటా సెంటర్ల దూకుడుతో భవిష్యత్తులో నీటి కొరత మరింత తీవ్రమవుతుందని న్యూయార్క్‌కు చెందిన ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్, రేటింగ్స్‌ కంపెనీ ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ అంచనా వేస్తోంది. ఈ కేంద్రాల్లో సర్వర్లను చల్లబరిచేందుకు నీటి ఆధారిత కూలింగ్‌ సిస్టమ్స్‌ను పెద్దఎత్తున వినియోగిస్తారు. అందుకే నీరు చాలా అవసరమవుతుంది. ఇక భారత్‌లో మొత్తం విద్యుత్‌ వినియోగంలో డేటా కేంద్రాల వాటా 2024తో పోలిస్తే ఆరేళ్లలో మూడింతలు కానుందని అంచనా.  

1 మెగావాట్‌కు 25.5 మిలియన్‌ లీటర్లు  
» 100 పదాల ఈ–మెయిల్‌ రూపొందించినందుకు ఏఐ చాట్‌బాట్‌ను చల్లబరిచే కూలింగ్‌ వ్యవస్థకు వాతావరణ పరిస్థితులను బట్టి 200–1,500 మిల్లీలీటర్ల నీరు అవసరం అవుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోరి్నయా పరిశోధకులు గుర్తించారు.  
»   డిజిటల్‌ మౌలిక వసతులను ధ్రువీకరించే న్యూయార్క్‌ సంస్థ అప్‌టైమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అంచనా ప్రకారం డేటా సెంటర్ల శీతలీకరణ అవసరాల కోసం 1 మెగావాట్‌ లోడ్‌కు సంవత్సరానికి 25.5 మిలియన్‌ లీటర్ల నీరు అవసరం.  

ఉద్యోగాలు అంతంతే.. 
» భారత్‌లో 130కిపైగా డేటా సెంటర్స్‌ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 
»  85కు పైచిలుకు కేంద్రాలు అభివృద్ధి దశలో ఉన్నాయి.  
»  100 మెగావాట్ల ఫెసిలిటీ రాకతోకార్యకలాపాలు, నిర్వహణ, టెక్నీషియన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్‌ ఇంజనీర్లు, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు, మేనేజర్లు వంటి 100–200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 
»  భారీస్థాయి కేంద్రం నిర్మాణ సమయంలో 100 మెగావాట్లకు ఎలక్ట్రికల్,మెకానికల్, నిర్మాణం వంటి విభాగాల్లో 400–600 మందికి 18–36 నెలలపాటు ఉపాధి లభిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement