తప్పుకోండి.. తప్పుకోండి.. వివేక్‌ సార్‌ వస్తున్నారంట | February 25 visit by BSNL Director Vivek Banzal was called off soon after the leaked document | Sakshi
Sakshi News home page

తప్పుకోండి.. తప్పుకోండి.. వివేక్‌ సార్‌ వస్తున్నారంట

Feb 25 2026 1:45 AM | Updated on Feb 25 2026 2:17 AM

February 25 visit by BSNL Director Vivek Banzal was called off soon after the leaked document

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌ అంటే సంగమం, కుంభమేళా, ఆధ్యాత్మికత, చరిత్ర అన్నీ కలిసిన ఒక పవిత్ర నగరం. ఇప్పుడా పవిత్ర నగరంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ డైరెక్టర్‌ వివేక్ బంజాల్ పర్యటన వివాదాస్పదంగా మారింది. వివేక్‌ బంజాల్‌ను ప్రసన్నం చేసుకునేందుకు  ఓ డిప్యూటీ జనరల్ మేనేజర్ రూపొందించిన ఆఫీస్ ఆర్డర్‌పై రగడ మొదలైంది.

ఫిబ్రవరి 19న జారీ చేసిన అధికారిక కమ్యూనికేషన్ ప్రకారం, డైరెక్టర్ పర్యటనకు నిమిషానికో ప్రోటోకాల్ రూపొందించారు. రైల్వే స్టేషన్‌లో స్వాగతం నుంచి పవిత్ర స్నానాలు, ఆలయ దర్శనాలు, భోజనాలు, వ్యక్తిగత సౌకర్యాల వరకు అన్ని అంశాలను విపులంగా వివరించారు. 

ఇక ఆ ఆర్డర్‌ని పరిశీలిస్తే.. వివేక్ బంజాల్ ప్రయాగ్‌ రాజ్‌ పర్యటనలో భాగంగా ఆయనకు రాచమర్యాదలు చేసేందుకు 50మంది ఉద్యోగులు  కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. రెండు రోజుల విధుల్లో భాగంగా వివేక్‌ బంజాల్‌ కోసం 21 పనులు చేయాల్సి ఉండగా.. వాటిల్లో వివేక్ బంజాల్ ఎక్కడికి వెళితే అక్కడి   బోటు ప్రయాణాలు, ఆలయ దర్శనాలు, ‘స్నాన కిట్స్’ తయారీ, ప్యాకేజింగ్, వాహనాల్లో నీటి బాటిల్స్, చాక్లెట్లు, చిప్స్ వంటి రిఫ్రెష్‌మెంట్స్ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. 

అయితే, ఈ ఆఫీస్ ఆర్డర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే గత త్రైమాసికంలో రూ.1,300 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇలాంటి విలాసవంతమైన ఏర్పాట్లు ఎందుకు చేసిందని ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో వీఐపీ కల్చర్‌పై చర్చ మొదలైంది.

తీవ్ర విమర్శల నేపథ్యంలో, ఈ పర్యటనను ఒక్క రోజులోనే రద్దు చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌  పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఆశిష్ గుప్తా, డైరెక్టర్ ప్రయాగ్‌రాజ్ ప్రోగ్రామ్ రద్దయిందని, జారీ చేసిన ప్రోటోకాల్ ఇకపై చెల్లుబాటు కాదని తెలిపారు. అయితే, ఏర్పాట్లపై వచ్చిన వివాదంపై ఆయన వ్యాఖ్యానించలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement