మద్యం అక్రమ కేసులో ఏ2గా ఉన్న అధికారి
27 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
గుంటూరు జిల్లా జైలుకు తరలింపు..
ప్రాసిక్యూషన్‌కు సహకరిస్తున్నా అక్రమంగా అరెస్టు చేశారు
హైకోర్టులో బెయిల్ తీర్పు పెండింగ్‌లో ఉంది
వాసుదేవరెడ్డి తరఫు న్యాయవాది వాదన
విజయవాడ లీగల్: మద్యం అక్రమ కేసులో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేసిన ఏ2 నిందితుడు దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు శనివారం విజయవాడలో అరెస్టు చేశారు. అధికారులు విచారణ కోసం శనివారం సిట్ కార్యాలయానికి పిలిచి, మద్యం అక్రమ కేసుకు సంబంధించిన వివరాలు కాకుండా వేరే కేసుకు సంబంధించిన వివరాలు సేకరించారని తెలిసింది.
అనంతరం వాసుదేవరెడ్డిని సాయంత్రం అరెస్టు చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. విజయవాడ ఏసీబీ న్యాయస్థానం వాసుదేవరెడ్డికి ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఏసీబీ కోర్టులో వాసుదేవరెడ్డి తరపు న్యాయవాది కావూరి గోపీనా«థ్ వాదనలు వినిపిస్తూ, సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరించారని, ఈ కేసులో ఆయన అప్రూవర్ గా మారారని, ఈ సమయంలో అత్యవసరంగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఏసీబీ కోర్టులో వాసుదేవరెడ్డి విచారణకు సంబంధించిన స్టేట్‌మెంట్‌ను సిట్ సమర్పించిందని, హైకోర్టులో వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ తీర్పు పెండింగ్‌లో ఉందన్నారు. ప్రాసిక్యూషన్‌కు పూర్తిగా సహకరిస్తున్నందున సెక్షన్ 35 నోటీసులు జారీ చేసి రిమాండ్‌ను తిరస్కరించాలని న్యాయమూర్తిని కోరారు. సిట్ తరఫు న్యాయవాది రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో వాసుదేవరెడ్డి కీలకపాత్ర వహించారని, ఆయనకు తెలిసే ఈ అక్రమాలు జరిగాయన్నారు. ప్రభుత్వ ఖజానాకు రూ.192 కోట్లు నష్టం చేకూర్చారని, ప్రైవేటు వ్యక్తులకు సహకరించారని పేర్కొన్నారు.
ప్రతి నెల రూ.60 కోట్లు వరకు దారి మళ్లించారని పేర్కొన్నారు. అప్రూవర్‌గా మారినంత మాత్రాన నిర్దోíÙగా చూడలేమని, అతన్ని కస్టడీలోకి తీసుకుని మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నందున రిమాండ్ విధించాలని వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి భాస్కరరావు ఈనెల 27వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ, గుంటూరు జైలుకు తరలించాలని ఆదేశించారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో వాసుదేవరెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.
ధనుంజయ్‌రెడ్డి, ఇతరుల బెయిల్‌పై విచారణ వాయిదా
ఈ కేసులో బెయిల్‌పై ఉన్న ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో దాఖలు చేసిన బెయిల్ పిటీషన్లపై విచారణను న్యాయమూర్తి భాస్కరరావు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు.


