వ్యూహాత్మక బంధం బలోపేతమే లక్ష్యం
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో ద్వైపాక్షిక చర్చలు
న్యూఢిల్లీ: ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని మోదీ బుధవారం నుంచి రెండ్రోజులపాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ద్వైపాక్షిక రక్షణ, వాణిజ్య సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూలు దృష్టిసారించనున్నారు. ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా కాలుదువ్వుతూ పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణాన్ని ఎగదోస్తున్న వేళ ఇజ్రాయెల్‌లో మోదీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పర్యటనలో భాగంగా మోదీ అక్కడి పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హోర్జోగ్, ప్రధాని నెతన్యాహూతో విడివిడిగా భేటీకానున్నారు.
‘‘ పరస్పర ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం, సమష్టి దార్శనికతల సుసాధ్యమే లక్ష్యంగా, ఉమ్మడి సవాళ్ల పరిష్కారమే ధ్యేయంగా, ఇరుదేశాలు సుదృఢ, సుదీర్ఘకాల వ్యూహాత్మక సంబంధాలను సమున్నత స్థాయికి తీసుకుపోయే ఉద్దేశంతో మోదీ, నెతన్యాహూలు చర్చలు జరుపుతారు’’ అని భారత విదేశాంగ శాఖ మంగళవారం విడుదలచేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తంగా రక్షణ, భద్రత సహకారంలో అంశాలే గురువారం నాటి చర్చల్లో కీలకం కానున్నాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. యుద్ధమయ గాజా అంశం సైతం చర్చకు రానుంది.
బుధవారం రాత్రి మోదీ కోసం నెతన్యాహూ ప్రత్యేక ప్రైవేట్ విందు ఇవ్వనున్నారు. గత తొమ్మిదేళ్లలో మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించడం ఇది రెండోసారి. 2017 జూలైలో పర్యటించినప్పుడే ఇరుదేశాల మధ్య బంధాన్ని ‘వ్యూహాత్మక’ స్థాయికి చేర్చారు. ఆ తర్వాతి ఏడాది జనవరిలో నెతన్యాహూ భారత్‌లో పర్యటించారు. సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, ఇరుదేశాల ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి ఇరుదేశాలు కృషిచేస్తున్నాయి. సైనిక, ఆయుధ వ్యవస్థలను భారత్‌కు సరఫరా చేస్తూ ఇజ్రాయెల్ కీలక మిత్రదేశంగా మారిన విషయం విదితమే.


