విద్వేష వ్యాఖ్యలపై ‘సుప్రీం’ ఆగ్రహం | Sensational Supreme Court verdict on hate speech | Sakshi
Sakshi News home page

విద్వేష వ్యాఖ్యలపై ‘సుప్రీం’ ఆగ్రహం

Feb 25 2026 12:03 PM | Updated on Feb 25 2026 12:37 PM

Sensational Supreme Court verdict on hate speech

న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న విద్వేష ప్రసంగాలు (Hate Speech), సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యక్తులు లేదా వ్యవస్థలు ఏవైనా సరే.. ప్రసంగాలు, మీమ్స్, కార్టూన్లు లేదా మరే ఇతర మాధ్యమాల ద్వారా.. ఏదైనా ఒక సమాజాన్ని కించపరచడం అనేది రాజ్యాంగబద్ధంగా అంగీకారం కాదని స్పష్టం చేసింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో ఇతరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.

 


మతం, భాష, కులం లేదా ప్రాంతం ఆధారంగా ఏ ఒక్క సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నా అది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని ధర్మాసనం పేర్కొంది. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో మీమ్స్, ఫొటోల ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేయడం పెరిగిపోతున్నదని, ఇటువంటి చర్యలు సామాజిక సామరస్యానికి విఘాతం కలిగిస్తాయని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఎవరైనా సరే ఈ నిబంధనలకు లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

 

ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగాన్ని సమర్థిస్తానని ప్రమాణం చేసి, పదవీ బాధ్యతలు చేపట్టిన వారు, బాధ్యతారహితంగా మాట్లాడటం ఏమాత్రం చెల్లదని హెచ్చరించింది. సాధారణ పౌరుల కంటే కూడా ప్రజాప్రతినిధులపై ఈ బాధ్యత ఎక్కువగా ఉంటుందని, వారు చేసే వ్యాఖ్యలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని కోర్టు పేర్కొంది. రాజ్యాంగ పరిమితులను అతిక్రమించి సమాజాన్ని అవమానపరిచే చర్యలకు పాల్పడితే చట్టపరమైన పరిణామాలు తప్పవని సుప్రీంకోర్టు  స్పష్టం చేసింది. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా, డిజిటల్ రూపంలో ఉన్న మీమ్స్, కార్టూన్లకు కూడా వర్తిస్తుందని తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement