బహుళత్వ భావనకే గొడ్డలి పెట్టు | Sakshi Guest Column On National Anthem, Jana Gana Mana | Sakshi
Sakshi News home page

బహుళత్వ భావనకే గొడ్డలి పెట్టు

Feb 20 2026 12:12 AM | Updated on Feb 20 2026 12:12 AM

Sakshi Guest Column On National Anthem, Jana Gana Mana

సందర్భం

మన రాజ్యాంగ నిర్మాతలు జాతీయ గీతానికి ఏదో లాంఛనంగా ప్రాధాన్యం ఇవ్వలేదు. భిన్నత్వాన్ని కనుమరుగు కానివ్వకుండానే ఏకత్వాన్ని చాటడానికి మన గణతంత్ర రాజ్యం ఉద్దేశపూర్వకంగానే ‘జనగణమన’ను జాతీయ గీతంగా ఎంచుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ జనవరి 28న జారీ చేసిన ఉత్తర్వు ఆ గీతానికి సంబంధించి ఇంతకాలం ఉన్న ప్రాధాన్యతా క్రమాన్ని మార్చేసింది. అధికారిక కార్యక్రమాలలో జాతీయ గీతానికి ముందు జాతీయ గేయమైన వందేమాతరాన్ని తప్పనిసరిగా ఆలపించాలని ఆ ఆదేశం సారాంశం. పైగా ఆరు చరణాలను పూర్తిగా ఆలపించాలని కూడా ప్రభుత్వం తన ఉత్తర్వులో ఆదేశించింది. అధికారిక కార్యక్రమాలలో మొదటి రెండు చరణాలను ఆలపిస్తే చాలునని రాజ్యాంగ పరిషత్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఆ విధంగా పక్కనపెట్టినట్లయింది. ఈ వైఖరి జాతీయ గీతానికి అగ్ర ప్రాధాన్యం కట్టబెట్టిన రాజ్యాంగ అధికరణం 51(ఎ)ని అగౌరవపరచడమే!

రాజ్యాంగ హోదాల్లో తేడా
జాతీయ చిహ్నాల వరుస క్రమాన్ని నిర్వచించడానికీ, జాతీయ గీతం స్థానాన్ని తెలుపడానికీ రాజ్యాంగ పరిషత్‌ ఎంతో యోచించి నిర్ణయం తీసుకుంది. దాన్ని 1950లో ఉద్దేశపూర్వకంగానే సుస్థిర పరచారు. స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో జాతి జనులను ఉత్తేజపరచిన మూడు గీతాలను పరిశీలించి, రెండింటిని ఎంపిక చేసుకున్నారు: అవి: జనగణమన, వందేమాతరం, సారే జహా సే అచ్ఛా!

‘వందేమాతరం’ గేయం బంకించంద్ర ఛటోపాధ్యాయ 1882లో రాసిన ‘ఆనందమఠ్‌’ నవలలోనిది. దాన్ని రవీంద్రనాథ్‌ టాగోర్‌ స్వర పరిచారు. అది స్వాతంత్య్ర సమరాన్ని ప్రస్తుతించే శక్తిమంతమైన గేయం. అయితే, లౌకికవాదం, సమాన పౌరసత్వం పట్ల గణతంత్ర రాజ్యానికి ఉన్న రాజ్యాంగపరమైన నిబద్ధతను దృష్టిలో పెట్టుకున్న రాజ్యాంగ పరిషత్, దానిలో ఉన్న ప్రాథమిక ఆందోళనను గుర్తించింది. ప్రారంభంలోని చరణాలు మాతృభూమిని స్థూలంగా పౌర పదాలతో ప్రార్థిస్తే, తరువాతి చరణాలు భరతమాతను హిందూ దేవతగా అభివర్ణించాయి. 

అన్ని మతాలకు చెందిన పౌరులూ సమాన మేనని ప్రతిన బూనిన దేశంలో, దేశ మాతను ఆ రకంగా రూపుకట్టించడం చాలా మందికి రాజీపడటం కష్టమైన అంశంగా తోచింది. దానికనుగుణంగా, రాజ్యాంగ పరిషత్‌ కూడా జాతీయ గీతానికీ, జాతీయ గేయానికీ మధ్యనున్న తేడాను గుర్తించింది. రెండింటికీ రాజ్యాంగపరంగా వేర్వేరు హోదాలు కల్పించింది. ఆ తేడాను సాక్షాత్తూ రవీంద్రనాథ్‌ టాగోర్‌ కూడా గుర్తించారు. దాంతో రాజ్యాంగ పరిషత్‌ నూతన గణతంత్ర రాజ్య సమ్మిళిత భావనా పూర్ణతనూ, బహుళత్వాన్నీ పూర్తిగా నింపుకొన్న గీతా నికి ప్రత్యేక స్థానాన్ని పదిలపరుస్తూ, స్వాతంత్య్రోద్యమంలో భావో ద్రేక పాత్ర వహించిన వందేమాతరాన్ని తగు రీతిలో గౌరవించింది.

సమైక్యపరిచే ‘గీతం’
భారతదేశ సార్వభౌమాధికారాన్ని, బహుళత్వాన్ని పంచుకుంటున్న రాజ్యాంగ భవిష్యత్తును అనునిత్యం గుర్తు చేసేదిగా ఉన్నందున రాజ్యాంగ పరిషత్‌ 1950 జనవరి 24న ‘జనగణమన’ను జాతీయ గీతంగా అధికారికంగా స్వీకరించింది.  దానికి 52 సెకన్ల ఆలాపనను నిర్దేశించింది. భారత భాగ్యవిధాత అంటూ 1911లో స్వరపరచిన ఈ గీతాన్ని మొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలలో కోల్‌కతాలో ఆలపించారు. ఒక్క చరణంలోనే భారత దేశాన్ని పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ,వంగ ప్రాంతాల సమ్మిశ్రితంగా పేర్కొంది. ఏక జాతీయతను డిమాండ్‌ చేయకుండానే అందరినీ ఆ తాను ముక్కలుగా పేర్కొంది. భారతీయ పాలితుడు ఆ విధంగా ఏకరూపతలో మిళితం అయి పోకుండానే, రాజకీయ భవితవ్యాన్ని పంచుకునేవాడు, బహుళ అస్తిత్వాలతో నివసించగల సామర్థ్యం ఉన్నవాడు. 

దేశ విభజన, మతపరమైన హింసాకాండ వేదనల నీడలో రాజ్యాంగ పరిషత్‌ చర్చలు జరుపవలసి వచ్చింది. భారత్‌ అధికా రికంగా లౌకిక పంథాను అనుసరించాలా లేక మెజారిటేరియన్‌ అస్తిత్వాన్ని సంతరించుకోవాలా అనే మీమాంస ఏర్పడింది. ఈ నేపథ్యంలో, జాతీయ గీతం ఎంపిక మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ విషయంలో రాజ్యాంగ నిర్ణేతల నిర్ణయం తాత్విక మైనదని కూడా చెప్పాలి. వారు సాంస్కృతిక మెజారిటేరియనిజం కన్నా పౌర జాతీయతనే ఎంచుకున్నారు. జాతీయ చిహ్నాలు సమైక్య పరచనూగలవు, మినహాయించనూగలవని వారికి తెలుసు. జాతీయ గీతానికీ, జాతీయ గేయానికీ మధ్యనున్న ఈ తేడా అలంకారప్రాయమైనది కాదు. సారభూతమైనది. మెజారిటేరియన్‌ ప్రేరణలు లేదా సాంస్కృతిక ఏకరూపత కన్నా సమాన పౌరసత్వ భావననే రాజ్యాంగ చట్రం ప్రతిబింబించింది. 

రాజ్యాంగ దృక్పథమే ఆదర్శం
అనేక దేశాల జాతీయ గీతాలకూ, భారతదేశ జాతీయ గీతానికీ మధ్య స్పష్టమైన తేడా ఉంది. చాలా జాతీయ గీతాలు సైనిక సమ రాన్ని లేదా విప్లవ హింసను ముందుంచుతాయి. కానీ ‘జనగణమన’ అలాంటిది కాదు. వివిధ ప్రాంతాలు, భాషా సమూహాల మధ్య ఐక్యతను ప్రబోధించేదిగా అది రూపొందింది. వైవిధ్య సహనశీలత రూపుదాల్చిన సమాఖ్య ప్రజాస్వామ్యానికి  జాతీయ గీత నిర్మాణ రీతి అత్యంత అనువైనది. జాతీయ గీతంలోని పంక్తులు భారత రాజ్యాంగ సారాంశానికి అద్దం పడతాయి. 

ప్రస్తుత పాలనా యంత్రాంగం ఈ రాజ్యాంగ దృక్పథంతో తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి. ప్రభుత్వ తాజా మార్గదర్శకాలు రాజ్యాంగపరమైన చిహ్నాలపై ప్రభావం చూపేవిగా ఉన్నాయి. వందేమాతరం గేయాన్ని మొదట ఆలపించాలనడం అలాంటిదే. జాతీయ గేయాన్ని కొన్ని పంక్తులకే పరిమితం చేయడానికీ, ఆ రెండింటి మధ్య వరుస క్రమాన్ని మొదట్లోనే నిర్ణయించడానికీ రాజ్యాంగ పరిషత్‌ను పురిగొల్పిన ఆందోళనను ఇది మళ్ళీ ముందుకు తెస్తోంది.

చర్చ, అసమ్మతి, ఆలోచనల తర్వాతనే 1950లో రాజీ సూత్రం ఏర్పడింది. ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా ఆ సమతూకాన్ని అస్థిరపరచడం ప్రభుత్వ ధోరణిని, ఎన్నికల రాజకీయాల సమీక రణల కసరత్తును మాత్రమే వెల్లడిస్తుంది. ‘జనగణమన’ ఆలాపన సమయంలో మనం నిల్చుంటున్నామంటే దాని శ్రావ్యతకు ముగ్ధులై మాత్రమే కాదు; ఇండియా పట్ల రాజ్యాంగానికి ఉన్న ఆలోచన, ఈ దేశంలో నివసిస్తున్న అందరికీ రిపబ్లిక్‌ సమానంగా చెందుతుందనే భావనను గౌరవిస్తూ, దానితో ఏకీభవిస్తూ నిలుచుంటున్నాం. ప్రతీకాత్మకంగానైనా లేదా సారభూతంగానైనా ఆ భావనకు కోత పెట్టడం జాతీయ గీత విస్తృత దార్శనికతను భంగపరచడమే అవు తుంది. ... జయ జయ జయ జయహే!

జోయా హసన్‌
వ్యాసకర్త జేఎన్‌యూలో ‘సెంటర్‌ ఫర్‌ పొలిటకల్‌ స్టడీస్‌’ ప్రొఫెసర్‌ ఎమిరిటా (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement