మీరు అలసిపోయారా? విసిగిపోయారా? | Udyoga Parvam Chapter 4: What Is Burnout | Sakshi
Sakshi News home page

మీరు అలసిపోయారా? విసిగిపోయారా?

Feb 15 2026 7:00 AM | Updated on Feb 15 2026 8:07 AM

Udyoga Parvam Chapter 4: What Is Burnout

"ఉదయం నిద్ర లేవగానే ఒళ్లంతా భారంగా ఉంటుంది.. ఆఫీసుకి వెళ్లాలనే ఉత్సాహం అస్సలు ఉండదు.. చేసే పని మీద ఏకాగ్రత కుదరదు.." ఈ లక్షణాలు మీకు కనిపిస్తున్నాయా? అయితే మీరు కేవలం 'అలసిపోలేదు', మీరు 'బర్న్ అవుట్' (Burnout) కి గురవుతున్నారు.  సాధారణ అలసట ఒక రాత్రి నిద్రతో పోతుంది, కానీ బర్న్ అవుట్ అనేది నిద్రపోయినా తగ్గని ఒక దీర్ఘకాలిక మానసిక నిస్సత్తువ.

బర్న్ అవుట్ అంటే ఏమిటి?
యంత్రం అతిగా వాడితే ఎలా వేడెక్కి ఆగిపోతుందో, మనిషి కూడా తన శక్తికి మించిన మానసిక ఒత్తిడిని నిరంతరం భరిస్తే 'బర్న్ అవుట్' అవుతాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీన్ని ఒక 'వృత్తిపరమైన రుగ్మత'గా గుర్తించింది. ఇది పని పట్ల విరక్తిని, అపనమ్మకాన్ని కలిగిస్తుంది.

4 ముఖ్య సంకేతాలు...
1. Emotional Exhaustion ( నిరంతర అలసట): రాత్రి 8 గంటలు పడుకున్నా, ఉదయం లేవగానే ఇంకా నిద్ర చాలలేదన్నట్టు, శక్తి లేనట్టు అనిపించడం. ఇది శారీరక అలసట కాదు, మానసిక శ్రమ వల్ల కలిగే నీరసం.

2. Cynicism (నిరాశావాదం): ఒకప్పుడు ఇష్టంగా చేసిన పని ఇప్పుడు భారంగా అనిపించడం. సహోద్యోగుల మీద, క్లయింట్స్ మీద కారణం లేకుండా కోపం రావడం. "నేను ఇది ఎందుకు చేస్తున్నాను? దీనివల్ల ఉపయోగం ఏంటి?" అనే నైరాశ్యం.

3. Reduced Productivity (తగ్గిన పనితీరు): ఎంత ప్రయత్నించినా పాత వేగంతో పని చేయలేకపోవడం. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా గంటల తరబడి సమయం పట్టడం.

4. శారీరక సమస్యలు: కారణం లేని తలనొప్పి, కడుపులో అసౌకర్యం, తరచూ అనారోగ్యానికి గురవ్వడం. మనసు పడే ఒత్తిడిని శరీరం ఇలా బయటపెడుతుంది.

నా వద్దకు వచ్చిన ఒక సీనియర్ బ్యాంక్ మేనేజర్ రాధ (పేరు మార్చాను) కథ ఇక్కడ చెప్పుకోవాలి. ఆమె 15 ఏళ్లుగా అద్భుతంగా పని చేస్తోంది. కానీ గత కొన్ని నెలలుగా ఆమె ఆఫీసులో అందరితో గొడవ పడుతోంది. "నాకు ఈ జాబ్ వద్దు, నేను రాజీనామా చేస్తాను" అని ఏడుస్తూ చెప్పింది. వాస్తవానికి ఆమెకు పని చేతకాక కాదు, గత మూడేళ్లుగా సెలవు తీసుకోకుండా పని చేయడం వల్ల ఆమె మెదడు 'బర్న్ అవుట్' స్టేజ్ కి చేరుకుంది. ఆమెకు కావాల్సింది రాజీనామా కాదు, ఒక సుదీర్ఘమైన 'మెంటల్ బ్రేక్'.

బయటపడటం ఇలా...
* మీ శక్తికి మించిన బాధ్యతలను స్వీకరించడం ఆపండి. ప్రయారిటీలను సెట్ చేసుకోండి. 'నో' చెప్పడం నేర్చుకోండి.
* ఆఫీస్ సమయం తర్వాత ల్యాప్‌టాప్, ఆఫీస్ వాట్సాప్ గ్రూపులకు దూరంగా ఉండండి. డిజిటల్ కనెక్షన్ కట్ చేయండి. మీ మెదడుకు 'ఆఫ్ టైమ్' ఇవ్వండి. 
* మీకు ఇష్టమైన పని (సంగీతం, పెయింటింగ్, లేదా నడక) కోసం రోజుకు కనీసం 30 నిమిషాలు కేటాయించండి. హాబీలను పునరుద్ధరించండి. ఇది మీ మెదడుకు రీఛార్జ్ లా పనిచేస్తుంది.
* విశ్రాంతిని ప్లాన్ చేయండి. సెలవు తీసుకోవడం అంటే సోమరితనం కాదు. అది మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి తీసుకునే ఒక ఇన్వెస్ట్‌మెంట్.

ఈ వారం మీ కోసం పరీక్ష...
* మీకు ఇష్టమైన పనులు చేయడానికి కూడా ఇప్పుడు ఉత్సాహం ఉండటం లేదా?
* ఆఫీసులో చిన్న పొరపాటు జరిగినా అతిగా స్పందిస్తున్నారా (Overreacting)?
* ఒంటరిగా ఉండాలని, ఎవరితోనూ మాట్లాడకూడదని అనిపిస్తోందా?
పై మూడింటికి 'అవును' అని సమాధానం వస్తే, మీరు బర్న్ అవుట్ వైపు వెళ్తున్నారని అర్థం చేసుకోండి.

గుర్తుంచుకోండి.. కాలిపోయిన కొవ్వొత్తి వెలుగునివ్వలేదు. మీరు ఇతరులకు, మీ కంపెనీకి ఉపయోగపడాలి అంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీలోని ఉత్సాహం ఆవిరి కాకముందే మేల్కొనండి. బర్న్ అవుట్ లేదా కెరీర్ ఒత్తిడి నుండి బయటపడటానికి కౌన్సెలింగ్ లేదా కోచింగ్ తీసుకోండి.

- సైకాలజిస్ట్ విశేష్ 
కెరీర్ & మైండ్‌సెట్ కోచ్
8019 000066
www.psyvisesh.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement