ఆయన జగం ..ఆమె సగం | full story of the auspicious festival of Mahashivratri | Sakshi
Sakshi News home page

ఆయన జగం ..ఆమె సగం

Feb 15 2026 4:35 AM | Updated on Feb 15 2026 4:35 AM

full story of the auspicious festival of Mahashivratri

నేడు శివరాత్రి

బ్రహ్మానంద స్వరూపుడు, నిర్వికారుడు, నిత్యమూ శమాది గుణ సంపత్తి కలవాడు కనుక శివుడు అని ‘శివ’ పదానికి వ్యుత్పత్తి.‘శివ’ అంటే పరమేశ్వరుడు.‘శివా’ అంటే పార్వతి. పేర్లలో కూడా ఏక రూపత కలిగిన ఆది దంపతులు వారు స్త్రీ పురుషులు కలిస్తేనే పరిపూర్ణత. వారిలో ఎక్కువ తక్కువలు లేవు. ఇరువురూ సమానమేనని వేదకాలం నుంచే నిరూపించిన స్వరూపం అర్ధనారీశ్వర రూపం.

‘గౌరి సగం – శివుడు సగం – అర్ధ నారీశ్వరమే అఖిల జగం’ అంటూ అవినాభావమైన ఆ ఆదర్శ దంపతుల అద్వైత రూపాన్ని మహాకవి ఆరుద్ర కీర్తించారు. వాగర్థాలవలె కలిసిపోయిన వారని కాళిదాసు ప్రస్తుతించారు. ప్రకృతి – పురుషులే సృష్టికి మూలమని, అయితే ఇందులో ప్రకృతి స్వరూపిణి అయిన స్త్రీ పోషించే పాత్ర మరింత కీలకమైనదని చెప్పడానికి జగద్గురు ఆది శంకరులు తమ ‘సౌందర్యలహరి‘ లోని తొలి శ్లోకంలోనే ఇలా చె΄్పారు:‘శివః శక్త్యా యుక్తో యది భవ తి శక్తః ప్రభవితుమ్‌ / నచే దేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి ‘.

శక్తి స్వరూపిణి అయిన జగదంబతో కూడినప్పుడే పరమేశ్వరుడు సమస్త సృష్టిని నిర్వహించడానికి సమర్థుడై ఉంటాడు. పార్వతితో కూడనినాడు అంతటి శివుడూ కాస్తంత కదలడానికి కూడా శక్తిలేనివాడే అవుతాడు. అంతేకాదు. ఆదిశంకరాచార్యులవారు మరొక అడుగు ముందుకు వేసి ‘చితాభస్మమును దేహమంతా పులుముకొని, కంఠంలో గరళాన్ని ధరించి, దిగంబరుడై, జటాధారిగా, మెడలో పాములను వేసుకొని, పుర్రెను చేతిలో పట్టుకొని, యాచక వృత్తితో జీవిస్తూ, శ్మశానవాసిగా ఉన్న ఈశ్వరుడు ముజ్జగాలకే అధిపతి కావడం కేవలం పార్వతీదేవిని పెండ్లి చేసుకోవడం వలన లభించిన ఫలితమేనంటూ తమ ‘దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం’లో నొక్కి వక్కాణించారు. ఇలా భర్త ఔన్నత్యానికి కారణభూతురాలు అతని ఇల్లాలే అని ఆదిశంకరులు జగతికి చాటి చె΄్పారు. ఈ విషయాన్ని లోకానికి తెలియజేయడానికే పరమేశ్వరుడు జగన్మాత పార్వతిని తన దేహంలో సగభాగంగా స్వీకరించాడు. శివుడంటేనే శక్తిమయుడు. శక్తి అంటేనే శివుని అభివ్యక్తి. శివశక్తులు రెండూ విశ్వానికి ఆధారమైన మూల పదార్థాలు. ఆ అర్ధనారీశ్వరుని స్వరూపాన్ని మహా శివరాత్రి సందర్భంగా ఆవిష్కరించుకొందాం.

అర్ధనారీశ్వరత్త్వం
అర్ధనారీశ్వర స్వరూపంలో కుడిభాగం శివునిది. ఎడమభాగం పార్వతిది. శివుని మేని ఛాయ బంగారు వర్ణం కాగా, పార్వతీదేవిది కర్పూర సమ ధవళ వర్ణం. శివునిది జటలు కట్టిన రాగిరంగు కేశపాశం కాగా, అమ్మవారిది అందంగా అలంకరింపబడిన నల్లని కేశపాశం. విశాలమైన, ΄÷డవైన, నీలోత్పలం వంటి నయనం జగన్మాతదైతే, వికసించిన ఎర్ర కమలం వంటి నేత్రం ఈశ్వరునిది. తన చెవికి ఆ తల్లి రత్నపు చెవిపోగు ధరించగా, సర్పాలనే ఆయన తన చెవికి ధరిస్తాడు. పార్వతి దివ్యాభరణాలను ధరించి ఉండగా, ఆయన నాగాభరణ శోభితుడు. అమ్మవారు దివ్యమైన పట్టువస్త్రాలను అలంకరించుకొంటే, ఆయన దిగంబరుడై దర్శనమిస్తాడు. కస్తూరి, కుంకుమ వంటి సౌభాగ్య ద్రవ్యాలను ఆమె అలదుకొంటే, దేహమంతా చితాభస్మాన్ని శివుడు పులుముకొని ఉంటాడు. ఆమె పాదం అందెలతోను, ఆయన పాదం నాగ కంకణాలతోనూ కనిపిస్తాయి.

ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై
సమస్త సంహారక తాండవాయ 
జగజ్జనన్యై జగదేక పిత్రే  
నమశ్శివా యైచ నమః శివాయ

అమ్మవారి ముఖంలో వెల్లివిరిసిన చిరునవ్వుతో విశ్వసృష్టి ప్రారంభమవుతుంది. అయ్యవారి తాండవ నృత్యంతో విశ్వం మొత్తం శివునిలో కలిసిపోతుంది. జగత్తుకే మాతా పితరులైన శివపార్వతులు అర్ధనారీశ్వర రూపంగా కలిసి ఉన్న తత్త్వానికి నమస్కరిస్తున్నాను అని పై శ్లోకభావం.

రెండు విభిన్నమైన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు పరస్పర సమన్వయాన్ని సాధించిన వైనానికి సాకార రూపమే అర్ధనారీశ్వరం. విభిన్న లక్షణాలున్నప్పటికీ అన్యోన్యానురాగంతో దాంపత్య బంధాన్ని కొనసాగించాలన్నది అర్ధనారీశ్వరుడు ఇచ్చే సందేశం. ఈ తత్త్వాన్ని ఆకళింపు చేసుకోగలిగితే భూమిపై ప్రతి జంటా ఆ ఆదిదంపతుల లాగా అన్యోన్యతకు సాకార రూపమై నిలుస్తుంది. అలా ఉండే ప్రయత్నం మనమందరం చేయగలిగితే మన సంస్కృతిలో భాగమయిన వివాహధర్మం కలకాలం మనగలుగుతుంది !

– డాక్టర్‌ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement