మాచిరాజు కామేశ్వరరావు
ఒక పట్నం కోతి కొత్తగా అడవిలోకి వచ్చింది. వస్తూ వస్తూ అది ఒక ఇంట్లో నుంచి చిన్న అద్దం, పౌడర్ డబ్బా, పెదాలకు వేసుకునే ఎర్రరంగు దొంగిలించి తన వెంట తెచ్చుకుంది. అది ఒక చింత చెట్టు మీద తన నివాసం ఏర్పరచుకుంది. ఆ చెట్టు మీదనే తిమ్మమ్మ అనే కోతి తన కవల పిల్లలు చిట్టి, చిన్నిలతో కాపురం వుంది.
పట్నం కోతి అద్దంలో మొహం చూసుకుంటూ పౌడర్ రాసుకోవడం, పెదాలకు ఎర్రరంగు వేసుకోవడం ఆసక్తిగా చూసేవి చిట్టి, చిన్ని.
వాటిని చూసి పట్నం కోతి, ‘‘ఇలా రండి, మీకు కూడా పౌడర్ రాస్తాను’’ అంటూ పిలిచింది.
చిట్టి, చిన్ని పనస తొనలు తింటూ మొహాలకు పౌడర్ రాయించుకున్నాయి.
‘‘పనస తొనలను గింజలు తీసి తినాలి. అలా తినకూడదు. పట్నంలో గింజలు తినరు. పారేస్తారు’’ అంది పట్నం కోతి.
చిట్టి, చిన్ని పనస గింజలన్నీ తీసి పారేసి, గుజ్జు మాత్రమే తిన్నాయి.
అది మొదలు పట్నం కోతి వాటికి ఎలా నాజూకుగా నడవాలి, ఎలా తినాలి, ఏమి తినాలి అంటూ కొత్త విషయాలు చెప్పడం మొదలు పెట్టింది.
చిట్టి, చిన్ని రోజంతా ఆ పట్నం కోతి మాటలు ఆసక్తిగా వింటూ, అది చెప్పినట్లుగా నడుచుకునేవి.
‘‘అలా రోజంతా కూర్చుని కబుర్లు వింటూ ఉంటే సోమరిపోతుల్లా తయారవుతారు. మిగతా పిల్లలను చూడండి, ఎంత చక్కగా ఆడుకుంటున్నారో! మీరు కూడా చక్కగా వెళ్ళి వాటితో ఆడుకోండి.’’ అంటూ మొత్తుకునేది తిమ్మమ్మ. అయితే చిట్టి, చిన్ని తల్లి మాటలు లెక్క చేసేవి కావు. పట్నం కోతి దగ్గరకే పోయి కూర్చునేవి!
పట్నం కోతి దాని మాటలతో చిట్టి, చిన్నీల ఆహారపు అలవాట్లు మార్చేసింది!
‘‘దానిమ్మ తొక్కతో తినకూడదు, గింజలు వొలుచుకుని తినాలి. మొక్కజొన్న పొత్తి గింజలు తిని, కంకి పారేయాలి. మామిడి పండు రసం పీల్చుకుని తొక్క పారేయాలి. అరటి పండు తొక్క కూడా తినకూడదు. వీటితో పాటు ఆకుపచ్చని ఆకులు తింటే ఆరోగ్యానికి మంచిది!’’ అంటూ వాటికి నూరిపోస్తూ ఉండేది. అయితే నెల తిరిగేసరికి చిట్టి, చిన్ని నీరసపడ్డాయి. కడుపులో నొప్పి అంటూ ఏడుపు మొదలు పెట్టాయి .
హడలిపోయిన తిమ్మమ్మ పిల్లలనిద్దరినీ తీసుకుని వైద్యం చేసే ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళింది. సంగతి తెలుసుకున్న ఎలుగు చిట్టి, చిన్ని నోట్లో పసరు మందు పోసి, ‘‘చూడండి పిల్లలూ! మనం పుట్టినప్పటి నుంచి ఏం తిని పెరుగుతున్నామో అవి తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. వాళ్లూ వీళ్ళూ చెప్పారని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఇలాగే అనారోగ్యం పాలవుతారు. పళ్ళ మీద తొక్క, గింజలు ఇవే మనకు బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేవి. అవి తినకే మీరు నీరసపడ్డారు. ఆకులు, గడ్డి తింటే జీర్ణం కాదు. అది మీ ఆహారం కాదు. అందుకే ఈ కడుపు నొప్పి. ఈ వయసులో తిన్నది అరిగేదాకా ఆడుతూ ఉంటేనే, తిన్నది వంట పడుతుంది. ఇక ఆ పట్నం కోతి సలహాలు వినడం మానేసి, ఇన్నాళ్ళూ మీరు ఎలా ఉన్నారో, ఎలా తిన్నారో అలాగే ఉండండి. ఎటువంటి జబ్బు చేయదు!’’ అని చెప్పింది.
ఆ తరువాత చిట్టి, చిన్ని పట్నం కోతి సలహాలు పాటించక పోగా, క్రమంగా దానిని కూడా తమ దారిలోకి తెచ్చుకున్నాయి.


