నలుపు మెరుపు | Black strawberries selling for 600 yuan per kg spark buzz in China | Sakshi
Sakshi News home page

నలుపు మెరుపు

Feb 15 2026 12:07 AM | Updated on Feb 15 2026 12:07 AM

Black strawberries selling for 600 yuan per kg spark buzz in China

స్ట్రాబెర్రీలు సాధారణంగా ఎర్రగా ఉంటాయి. జపాన్‌లో పండించే అరుదైన తెల్లని స్ట్రాబెర్రీలు కూడా కొందరికి తెలుసు. తాజాగా చైనాలో పండే ఈ నల్లని స్ట్రాబెర్రీలు జనాలకు నోరూరిస్తున్నాయి. ఇవి సాధారణ స్ట్రాబెర్రీల కంటే చాలా గాఢమైన రంగులో ఉంటాయి. వీటి పైనుండే తొక్క దాదాపు నల్లగా ఉంటుంది. లోపలి గుజ్జు కూడా గాఢమైన ఎరుపు, ఊదా రంగుల్లో ఉంటుంది. మిగిలిన రకాలకు చెందిన స్ట్రాబెర్రీల కంటే ఇవి చాలా తియ్యగా ఉంటాయి. 

సాధారణ స్ట్రాబెర్రీల కంటే వీటిలో దాదాపు ఇరవై శాతం చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల ఏమాత్రం పులుపు లేకుండా చాలా తీపిగా ఉంటాయి. చైనాలో వీటిని పదేళ్ల కిందట ప్రయోగాత్మకంగా పండించారు. ఇటీవల ఇవి అంతర్జాతీయ మార్కెట్‌కు చేరి, రుచులూరిస్తున్నాయి. ‘బ్లాక్‌ పర్ల్‌’ పేరుతో విక్రయిస్తున్న ఈ నల్లని స్ట్రాబెర్రీల ధర తెలుసుకుంటే మాత్రం కళ్లు తిరగడం ఖాయం. ఈ రకం స్ట్రాబెర్రీ ఒక్కో పండు ధర 6 డాలర్లు (రూ.550) మాత్రమే! సాధారణ స్ట్రాబెర్రీల కంటే భిన్నమైన రంగులో ఉన్నందున వీటిపై అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు.

వీటిని పండించడంలో జన్యుమార్పిడి పద్ధతులేవీ ప్రయోగించలేదని చైనీస్‌ వ్యవసాయ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ‘యాంథోసైనైన్‌’ అనే పదార్థం ఎక్కువగా  చేరడం వల్లనే ఈ పండ్లకు గాఢమైన రంగు ఏర్పడుతోందని చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఉద్యాన విభాగం ప్రొఫెసర్‌ లి బింగ్‌బింగ్‌ చెబుతున్నారు. చైనాలో వీటిని ముద్దుగా ‘బిజిన్‌ హిమె’ (అందాల యువరాణి) అని పిలుచుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement