చైనాను బెదరగొడితే చాలు! | Sakshi Guest Column On China, USA Issues | Sakshi
Sakshi News home page

చైనాను బెదరగొడితే చాలు!

Feb 13 2026 12:29 AM | Updated on Feb 13 2026 12:29 AM

Sakshi Guest Column On China, USA Issues

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

విశ్లేషణ

ప్రపంచం దృష్టి వెనిజులా, గ్రీన్‌ల్యాండ్, ఇరాన్‌ పరిణామాలపై కేంద్రీకృతం అయి ఉండటంతో, అమెరికన్లు మళ్లీ మళ్లీ ప్రక టిస్తున్న ఇండో–పసిఫిక్‌ వ్యూహం చర్చకు రావటం లేదు. ఈ వ్యూహంలో భారత దేశాన్ని కూడా భాగంగా చేసి చూపుతున్నందున, మౌలికంగా ఆ వ్యూహం ఏమిటో తెలుసుకోవటం అవసరం. ఆ వ్యూహం ఏమిటో తెలిసేందుకు మూడు డాక్యుమెంట్లను చూడవలసి ఉంటుంది: ఒకటి – 2022 ఫిబ్రవరిలో అప్పటి డెమోక్రటిక్‌ బైడెన్‌ ప్రభుత్వం ప్రకటించిన ‘ఇండో–పసిఫిక్‌ స్ట్రాటజీ’. రెండు – 2025 నవంబర్‌లో ప్రస్తుత రిపబ్లికన్‌ ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించిన ‘నేషనల్‌ సెక్యూరిటీ స్ట్రాటజీ’. మూడు – ఇదే ప్రభుత్వం 2026 జనవరిలో, అనగా గత నెలలో ప్రకటించిన ‘నేషనల్‌ డిఫెన్స్‌ స్ట్రాటజీ’. వీటన్నింటిలో ఇండో–పసిఫిక్‌ గురించిన సారాంశం ఈ విధంగా ఉంది. ప్రపంచ వాణిజ్యానికే అతిపెద్ద, అత్యంత క్రియా శీలమైన మార్కెట్‌ ప్రాంతం ఇది. కనుక అమెరికా భద్రత, స్వేచ్ఛ, సౌభాగ్యాలపై చాలా ప్రభావం చూపుతుంది.

చైనా సవాల్‌
ఈ ప్రకటనతో ఆరంభించిన అమెరికా వ్యూహం, తమ ప్రయోజనాల పరిరక్షణకు అక్కడ ఏమేమి చేయాలన్న విషయమై చాలానే చెప్పింది: పశ్చిమార్ధ భూగోళాన్ని మన్రో, డోన్రో డాక్ట్రిన్‌లను అనుసరించి పూర్తి నియంత్రణలోకి తెచ్చుకుంటున్నాము. పశ్చిమాసి యాలో ప్రయోజనాలు ఇజ్రాయెల్‌ ద్వారా నెరవేరుతున్నాయి. యూరోపియన్‌ దేశాలు తమ సహచరులే గనుక, వారు తమ రక్షణ వ్యయాన్ని మాత్రం పెంచి తమతో నిలబడితే సరిపోతుంది. ఆర్కిటిక్‌కు సంబంధించి గ్రీన్‌ల్యాండ్‌ను ఏదో ఒక విధంగా అధీనంలోకి తెచ్చుకుంటే ఆ సమస్య తీరుతుంది. ఉక్రెయిన్‌ యుద్ధం తేలిపోతే రష్యాతో పేచీ ఉండదు. పైగా అది ఒక ప్రాంతీయ శక్తి మాత్రమే. ఆ విధంగా ఇక మిగిలేది ఇండో–పసిఫిక్‌ ఒక్కటే!

ఇండో–పసిఫిక్‌ మాత్రమే మిగిలి ఉండటం ఎందుకంటే చైనా కారణంగా. మరొక విధంగా చెప్పాలంటే, మొత్తం ప్రపంచపు భౌగోళిక వ్యూహంలోనే అమెరికాకు మిగిలి ఉండగల సమస్య చైనా అన్నమాట. వేరెవరో అనవలసిన అవసరం లేకుండా, వ్యూహ పత్రా లలో అమెరికన్‌ ప్రభుత్వాలే అరమరికలు లేకుండా చెప్పాయి. చైనా పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, ఆర్థికంగానే గాక సైనిక బలం రీత్యా కూడా ఎదిగి ఇపుడు తమకు పోటీదారుగా మారిందన్నాయి. 

ఒత్తిడిలో అమెరికా
ఈ స్థితిని ఎదుర్కోవటం ఎట్లాగన్నది ప్రశ్న. మరొక మాటలో చెప్పాలంటే ఈ స్థితిని ఎదుర్కొని అమెరికా అగ్రస్థానాన్ని పదిలపర చుకోవటం, చైనాను ఇంతకుమించి ముందుకు రానివ్వక పోవటం అన్నమాట. రాగల కాలంలో అమెరికన్‌ వ్యూహాల కేంద్రీకరణ అంతా ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో ఉంటుందన్నది స్పష్టం. వాస్తవా నికి ఈ ఆలోచనలు కొత్తవి కావు. పశ్చిమాసియాలో ఎదురు దెబ్బల తర్వాత డెమోక్రటిక్‌ అధ్యక్షుడు ఒబామా(2009–17), ఇక తమ దృష్టి అటునుంచి ఆసియాకు మారాలని ప్రతిపాదించారు. బైడెన్‌ (2021–25) పైన పేర్కొన్న ‘ఇండో–పసిఫిక్‌ స్ట్రాటజీ’ని ప్రకటించారు. చైనాపై వాణిజ్య, పారిశ్రామిక యుద్ధాలను  ట్రంప్‌ శక్తి మేర సాగించారు. అమెరికా ప్రయోజనాల కోసం ఇండో–పసిఫిక్‌ విధాన మన్నది డెమోక్రటిక్, రిపబ్లికన్‌ ప్రభుత్వాల రెండింటి ఉమ్మడి సంప్రదాయం అయింది.

తన మొదటి విడత పాలనా కాలంలో (2017–21) ఏ వ్యూహ పత్రమూ ప్రకటించని ట్రంప్‌ ఇపుడు ఏడాదిలోనే రెండు పత్రాలు తేవటం గమనించదగ్గది. పదేళ్ల క్రితంతో పోల్చితే అమెరికా బలహీన పడగా, చైనా బలపడింది. అమెరికాపై పలు విధాలైన ఒత్తిళ్లు పెరుగు తున్నాయి. చైనాను కట్టడి చేయక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్థికంగా చూసినట్లయితే వారికి వేర్వేరు దేశాల నుంచి ఇంధనంతో సహా వనరుల సేకరణకు, మార్కెట్లకు, పెట్టుబడులకు ఆటంకాలు కల్పించాలి. వాటిని తమ నియంత్రణలోకి తెచ్చుకుని, ఇంతవరకు వలె గాక రాగల కాలంలో తమ అభివృద్ధిని వేగవంతం చేయాలి. సైన్స్, టెక్నాలజీ ఆధునికీకరణలు, వాటి ఆధారంగా ఆధునిక ఉత్ప త్తులు భవిష్యత్తుకు కీలకం అయినందున, ఆ రంగాలలో చైనా పురో గతి ఒక సవాలుగా మారినందున... ఆ విషయమై మరింత దృష్టి పెట్టాలి.

ఎన్ని వ్యూహాలు?
సైనిక విషయాలకు వస్తే వ్యూహ పత్రాలు ఒక సూత్రాన్ని పదే పదే పేర్కొనటం గమనించదగ్గది. అది– చైనాను కట్టడి చేయటమైతే తప్పనిసరి. కానీ యుద్ధం ద్వారా కాదు. ఒక బెదురు అన్నది సృష్టించి నిలువరించటం ద్వారా! బెదురును సృష్టించటం ఏ విధంగా? ఒకటి– ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలోని తమ సైనిక స్థావ రాలను (66 అని అంచనా) శక్తిమంతం చేయటం. రెండు– అక్కడి తమ కూటమి దేశాల సైన్యాలను బలోపేతం చేయటం. వారు తమ రక్షణ వ్యయాలను పెంచటం. మూడు– ఒకే చైనా విధానాన్ని కొన సాగిస్తూనే, తైవాన్‌ను తమ రక్షణ వ్యూహం కోసం ఉపయోగించు కోవటం. నాలుగు– జపాన్‌ నుంచి బోర్నియో వరకు వరుసగా గల మొదటి వరుస దీవులను (ఫస్ట్‌ ఐలాండ్‌ ఛెయిన్‌) దాటి చైనా యుద్ధ నౌకలు పసిఫిక్‌లోకి రాకుండా అడ్డుగోడ వంటిది తయారు చేయటం అన్నది వ్యూహం. దీనంతటి అమలు కోసమే ఇండియాతో కూడిన ‘క్వాడ్‌’ను 2017లో క్రియాశీలం చేసి, 2021లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో కలిసి ‘ఆకస్‌’ తదితర సంస్థలు ఏర్పాటు చేశారు.

ట్రంప్‌ వ్యూహ పత్రాలలో ఆసక్తికరమైన అంశం ఒకటి కనిపి స్తుంది. దాని ప్రకారం, చైనా అభివృద్ధికి వారు వ్యతిరేకం కాదు. కానీ అమెరికా అగ్రస్థానానికి మాత్రం చైనా సవాలు కారాదు. ఇందు కోసం ఇండో–పసిఫిక్‌లోని అన్ని దేశాలనూ రకరకాల పేర్లతో ఉపయోగించుకుంటారు. ఈ వ్యూహాల అమలుకు వచ్చినప్పుడు మాత్రం కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతోపాటు ఇండో–పసిఫిక్‌లోనూ అనేక దేశాలు అమెరికా ప్రయోజనాల కోసం ఉపయోగపడేందుకు సిద్ధంగా లేక బహుళ ధ్రువ ఆలోచనలు, అమెరికా–చైనా మధ్య సమతుల్యతల పాటింపు వంటివి చేస్తున్నాయి. ఇండియా కూడా ఈ కోవలోకే వస్తుంది. ట్రంప్‌ బుల్‌డోజరిజం కెనడా, యూరప్‌లలోనే వ్యతిరేకతను ఎదు ర్కొంటూ, ఆ దేశాలు చైనాతో వరుస ఒప్పందాలు చేసు కోవటం ఇందుకు అద్దం పడుతున్నది.

టంకశాల అశోక్‌ 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

Advertisement
 
Advertisement
Advertisement