నేను జోక్యం చేసుకోకపోతే అది అణు యుద్ధంగా మారేది | Donald Trump Claims He Averted India-Pakistan War Issue By Threatening Tariffs, More Details Inside | Sakshi
Sakshi News home page

నేను జోక్యం చేసుకోకపోతే అది అణు యుద్ధంగా మారేది

Feb 12 2026 6:01 AM | Updated on Feb 12 2026 11:00 AM

Donald Trump repeats India-Pak war issue

భారత్, పాక్‌లపై టారిఫ్‌ల హెచ్చరిక బాగా పనిచేసింది 

రెండు దేశాల ఘర్షణలో 10 యుద్ధ విమానాలు నేలకూలాయి 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడి

వాషింగ్టన్‌: గత ఏడాది భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధాన్ని తానే చొరవ తీసుకొని ఆపేశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి ప్రకటించారు. ఒకవేళ తాను స్పందించకపోతే అది కచ్చితంగా అణుయుద్ధంగా మారేదని, టారిఫ్‌ల యుద్ధం జరిగేదని అన్నారు. ట్రంప్‌ మంగళవారం ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలకు ముగింపు పలికానని చెప్పారు. 

ఇందులో ఆరు యుద్ధాలు టారిఫ్‌ల బెదిరింపు వల్ల ఆగిపోయానని తెలిపారు. మాట వినకపోతే మీ ఉత్పత్తులపై భారీగా టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించడంతో ఆయా దేశాలు దారికొచ్చాయని పేర్కొన్నారు. యుద్ధాల కారణంగా సామాన్య ప్రజలు మరణించడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదన్నారు. టారిఫ్‌ల భయంతో భారత్, పాకిస్తాన్‌లు యుద్ధం నిలిచివేశాయని వెల్లడించారు. ఇరుదేశాల ఘర్షణలో కనీసం 10 యుద్ధ విమానాలు నేలకూలాయని తెలియజేశారు. అయితే, అవి ఏ దేశానికి చెందినవన్న సంగతి ట్రంప్‌ బయటపెట్టలేదు. 

యుద్ధాన్ని ఆపడం ద్వారా కనీసం కోటి మందిప్రజల ప్రాణాలను ట్రంప్‌ రక్షించారని అప్పట్లో పాకిస్తాన్‌ ప్రధానమంత్రి చెప్పినట్లు గుర్తుచేశారు. తాను గనుక కలుగజేసుకోకపోతే భారత్, పాక్‌ల మధ్య అణుయుద్ధం జరిగేదని ట్రంప్‌ తేల్చిచెప్పారు. టారిఫ్‌ల హెచ్చరిక బాగా పనిచేసిందని వ్యాఖ్యానించారు. భారత్, పాక్‌ యుద్ధాన్ని తానే ఆపేశానంటూ ట్రంప్‌ చెప్పుకోవడం ఇది 80వ సారి కావడం గమనార్హం. 

అయితే, పాకిస్తాన్‌పై దాడులు నిలిపివేయడం వెనుక ట్రంప్‌ ప్రమేయం ఏమాత్రం లేదని భారత ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. కాల్పుల విరమణ పాటించాలని పాకిస్తాన్‌ ప్రభుత్వం పదేపదే వేడుకోవడం వల్లనే మానవతా దృక్పథంతో తాము వెనక్కి తగ్గామని పలుమార్లు ప్రకటించింది. ఇందులో మూడో వ్యక్తి జోక్యం లేదని తెలియజేసింది. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట భారత సైన్యం గత ఏడాది మే నెలలో పాకిస్తాన్‌పై, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై భీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే.  
 

Advertisement
 
Advertisement
Advertisement