సహనం, ఓర్పు, సంయమనం, ప్రయామం, నిగ్రహం... ఎదుటివారు ఎంతగా రెచ్చ గొడుతున్నా మాట తూలకుండా ప్రశాంతంగా ఉండే స్థితిని చెప్పటానికి ఇలా బోలెడు పదాలున్నాయి. కనీసం ఆర్నెల్లుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరిపోయినట్టేనని తరచు చెబుతూవచ్చారు. అందుకు మన దేశంనుంచి ఆశాజనకమైన స్పందన రానప్పుడల్లా రెచ్చిపోయి మాట్లాడారు. పాకిస్తాన్ పౌర, సైనిక అధినేతల్ని నెత్తినెక్కించుకుని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. జమ్మూ–కశ్మీర్ భౌగోళిక చిత్రపటాన్ని పాకిస్తాన్ సంబరపడేలా మార్చేశారు. ఎన్ని చేసినా మన ప్రభుత్వం మౌనంగా ఉండిపోవటం, లేదా ఆచితూచి మాట్లాడటం పనికొచ్చినట్టుంది.
ఎట్టకేలకు మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి భారత–అమెరికాల మధ్య ఒక అవగాహన కుదిరిందని మొన్న శనివారం అధికారికంగా ఉమ్మడి ప్రకటన వెలువడింది. అందుకు సంబంధించిన ఒక అమరిక (ఫ్రేమ్‌వర్క్) కూడా రూపొందింది. అంతే... వెనువెంటనే 25 శాతం అదనపు సుంకాలు రద్దయ్యాయి. ఇకపై సుంకాలు 18 శాతానికి మాత్రమే పరిమితమవుతాయని అమెరికా ప్రకటించింది. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి అలముకున్న తరుణంలో మన దేశం ఈ మాదిరి ఒప్పందానికి సంసిద్ధం కావటం ఒక సాహసోపేతమైన చర్య.
అయితే ‘ఇల్లలకగానే పండగ కాద’న్నట్టు ఈ ఒప్పందం వాస్తవ రూపం దాల్చేవరకూ ఒకింత ఉత్కంఠ, సంశయం తప్పవు. అటు తర్వాత కూడా దిన దిన గండం ఉండనే ఉంటుంది. అక్కడున్నది ట్రంప్ గనుకే ఈ సమస్య. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు గమనిస్తే ఇది తెలుస్తుంది. ‘భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనడం ఆపేసి, ఆ ఉత్పత్తులను అమెరికా నుంచే కొంటుందని ఆశిస్తున్నామ’ని అందులో ఉంది. భారత– రష్యా చమురు వాణిజ్యంపై తమ నిఘా ఉంటుందని కూడా అంటున్నది. ఈ విషయంలో మన దేశం అధికారికంగా ఏమీ చెప్పలేదు.
ఉమ్మడి ప్రకటనలోనూ ఆ ప్రస్తావనలేదు. కానీ జాతీయ ఇంధన ప్రయోజనాలే మన గీటురాయి అని గతంలో మోదీ అన్నారు. మన వ్యవసాయ, పాడి రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టే ప్రశ్నే లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ చెబుతున్నారు. అలాగే అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు సుంకాలు తగ్గించబోమంటున్నారు. అయితే ఉమ్మడి ప్రకటనలో అమెరికాకు సంబంధించిన అన్ని పారిశ్రామిక సరుకులు, విస్తృతశ్రేణి ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు లేదా రద్దు చేయటానికి భారత్ అంగీకరించిందని ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేనట్టయితే భారత్ వెనక్కి తగ్గిందని ట్రంప్ యాగీ చేయటంతోపాటు, అదనపు సుంకాలకు సాకుగా ఉపయోగించుకుంటారు.
ప్రస్తుత భారత–అమెరికా వాణిజ్యం 13,000 కోట్ల డాలర్ల మేర ఉంది. ఇందులో అమెరికాకు మన ఎగుమతులు 8,500 కోట్ల డాలర్ల వరకూ ఉంటే, అమెరికా నుంచి దిగుమతులు 4,500 కోట్ల డాలర్ల వరకూ ఉన్నాయి. అంటే మనం 4,000 కోట్ల డాలర్ల వాణిజ్య మిగులులో ఉన్నాం. దీన్ని మార్చాలన్నదే ట్రంప్ తాపత్రయం. అందుకే వచ్చే అయిదేళ్లలో అమెరికా నుంచి 50,000 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులుండేలా
ఒప్పందం నిర్దేశిస్తోంది. ఇంధనం ఉత్పత్తులు, విమానాలు, విమాన విడిభాగాలు,సాంకేతిక ఉత్పత్తులు, అరుదైన లోహాల వంటివి ఉంటాయంటున్నారు. అంటే ఆ దేశంనుంచి ఏటా అదనంగా వందకోట్ల డాలర్ల అదనపు ఉత్పత్తులు వస్తాయి. అప్పుడు మన వాణిజ్య మిగులు ఆవిరై, లోటులో పడుతుంది. దీన్ని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు?
కార్మికుల అవసరం ఎక్కువుండే మన ఉత్పత్తులకు ఒప్పందం వల్ల భారీ ప్రయోజనం కలిగే అవకాశమైతే ఉంటుంది. ఆ రకంగా దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగవు తాయి. ఇక జన్యుమార్పిడి ఆహారం అనారోగ్యహేతువని, ఆ విత్తనాల వల్ల దిగుబడి భారీగా వచ్చినా, అవి వాడిన పంటపొలాల్లో భవిష్యత్తులో దేశీయ విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉండదని గతంలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ విషయంలో సందే హాలన్నీ నివృత్తి చేయాలి. అలాగే తుది ఒప్పందం సమయానికి అవసరమైన మార్పులు, చేర్పులకు ఇరుపక్షాలూ సిద్ధపడే షరతుపైనే ఏ ఒప్పందంపైనైనా సంతకం చేయాలి.


