భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. టెస్లాకు దక్కని ఊరట! | India-US deal reduces tariffs on American cars Tesla without relief | Sakshi
Sakshi News home page

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. టెస్లాకు దక్కని ఊరట!

Feb 9 2026 11:16 AM | Updated on Feb 9 2026 11:23 AM

India-US deal reduces tariffs on American cars Tesla without relief

భారత్-అమెరికా మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో దేశీయ ఆటోమొబైల్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అయితే ఈ ఒప్పందం లగ్జరీ కార్ల ప్రియులకు తీపి కబురు అందించినప్పటికీ, ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లాకు మాత్రం నిరాశే ఎదురైంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే హై-ఎండ్ లగ్జరీ కార్లపై భారత్ దిగుమతి సుంకాలను 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలను ఈ రాయితీ పరిధి నుంచి మినహాయించడం గమనార్హం. దీనివల్ల ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లాకు భారత మార్కెట్‌లో తక్కువ ధరకు కార్లను విక్రయించే అవకాశం ప్రస్తుతానికి లేకుండా పోయింది.

ఒప్పందంలోని ముఖ్యాంశాలు

  • 3,000 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న సాంప్రదాయ పెట్రోల్ కార్లపై సుంకాలు 10 ఏళ్ల కాలపరిమితిలో క్రమంగా 30 శాతానికి తగ్గుతాయి.

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో పలుమార్లు ప్రస్తావించిన హార్లే డేవిడ్సన్ వంటి ప్రీమియం బైక్‌లపై దిగుమతి సుంకాలను భారత్ పూర్తిగా తొలగించనుంది. 800-1,600 సీసీ సామర్థ్యం గల బైక్‌లకు ఈ ప్రయోజనం కలుగుతుంది.

  • భారత ఎగుమతులపై సుంకాలను అమెరికా 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించనుంది. ప్రతిఫలంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించి, అమెరికా నుంచి దాదాపు 500 బిలియన్‌ డాలర్ల విలువైన ఇంధనం, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అంగీకరించింది.

  • మార్చి 2026లో ఇరు దేశాలు అధికారికంగా సంతకాలు చేసిన తర్వాత ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.

భారత్‌లో టెస్లా పరిస్థితి ఏమిటి?

భారతదేశం తన దేశీయ పరిశ్రమను రక్షించుకోవడానికి ఈవీలను ఈ ఒప్పందం నుంచి దూరంగా ఉంచింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, టెస్లా కోసం ప్రత్యేకంగా తక్కువ సుంకం మార్గాన్ని ప్రవేశపెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ప్రస్తుతం భారత్‌లో టెస్లా విక్రయాలు ఆశించిన స్థాయిలో లేవు. జనవరి 15, 2026 నాటికి నెల మొదటి పదిహేను రోజుల్లో కేవలం 16 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీనికి భిన్నంగా, చైనా కంపెనీ బీవైడీ 83 వాహనాలను విక్రయించింది. బీఎండబ్ల్యూ 351 యూనిట్లు, బెంజ్‌ 70 యూనిట్లను విక్రయించాయి.

ప్రభుత్వ పథకం..

భారత ప్రభుత్వం స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు ఎస్‌పీఎంఈపీసీఐ (Scheme to Promote Manufacturing of Electric Passenger Cars in India) అనే పథకాన్ని తెచ్చింది. దీని ప్రకారం కనీసం 500 మిలియన్‌ డాలర్లను స్థానికంగా పెట్టుబడి పెట్టి ప్లాంట్ ఏర్పాటు చేస్తేనే దిగుమతి సుంకాల్లో రాయితీ లభిస్తుంది. అయితే, టెస్లా ఇప్పటివరకు ఈ పథకంలో చేరకపోవడం వల్ల ఆ కంపెనీకి దిగుమతి సుంకాల భారం తప్పడం లేదు. మేక్ ఇన్ ఇండియా నిబంధనలకు కట్టుబడితే తప్పా విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రిక్ కార్లపై భారీ రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: రిస్క్‌ లేకుంటే రాబడి లేదు!

Advertisement
 
Advertisement
Advertisement