Income Tax: ఆదాయం కరెక్టుగా రిపోర్ట్‌ చేయండి | Correct Income Reporting, Governments New Focus On Transparency And Compliance, Form 60 And 61 Explained In Telugu | Sakshi
Sakshi News home page

Income Tax: ఆదాయం కరెక్టుగా రిపోర్ట్‌ చేయండి

Feb 9 2026 11:03 AM | Updated on Feb 9 2026 11:22 AM

Correct Income Reporting Governments New Focus on Transparency and Compliance

రూల్‌ 114బీ ప్రకారం ఫారం ‘60’ ఇవ్వాలి. వ్యక్తులు.. అంటే మనం అందరం మనకు పర్మనెంట్‌ అకౌంట్‌ నంబరు లేకపోతే, నిర్దేశించిన హై–వేల్యూ ఆర్థిక వ్యవహారాలు జరపాలంటే, ఈ ఫారం 60ని సబ్మిట్‌ చేసి ఆ వ్యవహారాన్ని అయ్యిందనిపిస్తాం.

నిర్దేశిత ఆర్థిక వ్యవహారాలేమిటంటే 
▪️ బ్యాంకులో ఖాతా తెరవడం 
▪️ డీమ్యాట్‌ ఖాతా తెరవడం 
▪️ బ్యాంకులో రూ. 50,000 దాటి నగదు డిపాజిట్‌ చేసినప్పుడు 
▪️ రూ. 10 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ స్థిరాస్తి క్రయ, విక్రయాలు 
▪️ రెండు చక్రాల బండి తప్ప ఇతర ఏ మోటర్‌ వాహనం కొన్నా 
▪️ రూ. 50,000 దాటి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బాండ్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ కొన్నా 
▪️ విదేశీ మారకం/యాత్ర రూ. 50,000 దాటితే 
▪️ జీవిత బీమా ప్రీమియం రూ. 50,000 దాటితే

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
▪️ పాన్‌ లేని వారు ఫారం 60 సబ్మిట్‌ చేసి వ్యవహారం పూర్తి చేయొచ్చు. పాన్‌ ఉన్నవారు కాదు. 
▪️ ఫారం 60లో చాలా అంశాలుంటాయి. మీ వివరాలు సరిగ్గా ఇవ్వాలి. వివరాలకు ఆధారాలుండాలి. వాటితో సరిపోవాలి. అలా ఇవ్వకపోతే వ్యవహారం ఆగిపోవచ్చు. 
▪️ అసలు అర్హత ఉందా. అవసరం లేకుండా అబద్ధాలు చెప్పి దాఖలు చేయొద్దు. 
▪️ మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వాలి. 
▪️ మీకు పాన్‌ ఎందుకు లేదో కారణాలు తెలియజేయాలి 
▪️ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి 
▪️ జాయింటు వ్యవహారాలు అయితే, అందరి వివరాలు ఇవ్వాలి 
▪️ మైనర్‌ తరఫున అయితే, తల్లిదండ్రులు, గార్డియన్‌ ఇవ్వాలి

తప్పుడు ధ్రువీకరణలు ఇస్తే.. 
తప్పుడు సమాచారం, తప్పు ధృవీకరణలు ఇచ్చిన పక్షంలో కఠిన కారాగార శిక్షలుంటాయి. తప్పించుకోలేరు. పన్ను ఎగవేత మొత్తం నుంచి రూ. 25,00,000ల వరకు పెనాల్టీ వేస్తారు. కారాగారంతో పాటు ఫైన్‌ కూడా వేస్తారు. మరో ఫారం 61. ఈ ఫారం అనేది వ్యక్తులకు, కేవలం వ్యవసాయ ఆదాయం ఉండి, ఏ ఇతర ఆదాయం లేని వారు దాఖలు చేయాలి. ఫారం 60 వ్యవసాయేతర ఆదాయం ఉన్నవారికి వర్తిస్తుంది. ఫారం 60, వ్యవహారం జరిపే ముందు ఇవ్వాలి. ఫారం 61 అనేది ప్రతి సంవత్సరంలో రెండుసార్లు, ఆర్నెల్లకోసారి ఇవ్వాలి. రెండు ఫారం విషయాల్లోను తప్పులు దొర్లితే శిక్షకు అర్హులే. కఠిన కారాగార శిక్ష, పెనాల్టీ, ఫైన్‌ మామూలే. మిస్‌రిపోర్టింగ్‌ జరిగితే 50 శాతం నుంచి 200 శాతం వరకు పెనాల్టీ వేస్తారు.  

‘‘మన తక్షణ కర్తవ్యం ఏమిటి’’ అనే ప్రశ్నకు జవాబుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్‌ రవి అగర్వాల్‌ చాలా స్పష్టంగా ఇచ్చిన జవాబు సారాంశం ఏమిటంటే, ఈ సంవత్సరం పెండింగ్, లిటిగేషన్‌ తగ్గిస్తారు. అసెస్‌మెంట్‌ ప్రొసీడింగ్స్, పెనాల్టీ ప్రొసీడింగ్స్‌ కలిపి ఒకేసారి పూర్తి చేస్తారు. విడిగా అసెస్‌మెంట్‌ని 4–5 సంవత్సరాల సమయం, పెనాల్టీకి 7–8 సంవత్సరాలు పడుతోంది. ఒకేసారి ఆర్డర్‌ పాస్‌ చేస్తే సమయం కలిసి వస్తుంది.  
అసెస్‌మెంట్‌ తర్వాత, మీకో అవకాశం ఇస్తారు... రివైజ్‌ చేసుకునేందుకు. దీన్నే అప్‌డేట్‌ చేసుకోవాలి. శాంతిని పొందాలి. అప్పీలుకు వెళ్లడం వల్ల ఖర్చు, కాలయాపన, వడ్డీ, పెనాల్టీలు అవుతాయి.  

న్యూ రూల్స్‌ ఇంకా నోటిఫై చేయలేదు. ఫారం 60బీకి సంబంధించి ఉదాహరణగా ఒకప్పుడు బ్యాంకులు కోర్‌ బ్యాంకింగ్‌ సొల్యూషన్స్‌/సిస్టమ్స్‌ లేనప్పుడు పాన్‌ లేనివారికి ఫారం 60 తీసుకున్నవారు. ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో సీబీఎస్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఈ సందర్భానికి ఫారం 60 విషయంలో తగిన మార్పులు చేయొచ్చు. అలాగే ఆడిట్‌ రిపోర్టులోని అంశాల్లో రిటర్నులు ముందే నింపేలా చేయొచ్చు.

అంటే స్మార్ట్‌ ఫారంల ద్వారా వారికి కావల్సిన సమాచారాన్ని రాబట్టుకుంటారు. ఫారాలు, రిపోర్టులు ఉన్న సమాచారం, రిటర్నుల్లో ముందే వచ్చేలా ఆలోచిస్తున్నారు. దీన్నే ఆటోమేటిక్‌ ప్రీ–పాపులేట్‌ అంటారు. ఈ డేటా వల్ల అర్థవంతమైన (అర్థపరమైన) విశ్లేషణకు దారి సుగమం. ఇదే కొత్త మంత్రం. ఇన్‌కం కరెక్టుగా రిపోర్ట్‌ చేయండి. అప్పుడు వారికి చెకింగ్‌ టైమ్‌ తగ్గుతుంది. మంచివారిని వదిలేసి ‘దేశముదురు’లను.. అంటే పన్ను ఎగవేసే వారి మీద దృష్టి పెట్టొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement