Income Tax: కోటీశ్వరులు పెరిగారు.. | Income Disclosures Rise For High Earners In India, Overall Tax Filings Show Minimal Growth, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Income Tax: దేశంలో పెరిగిన కోటీశ్వరులు..

Jan 10 2026 8:08 AM | Updated on Jan 10 2026 10:07 AM

More Crorepatis What Indias Tax Data Reveals

3.8 లక్షల మందికి రూ.కోటికిపైగా ఆదాయం

వెల్లడించిన ఐటీ ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌

మన దేశంలో ఆదాయ వివరాలను సమర్పిస్తున్న వ్యక్తుల సంఖ్య అతి స్వల్పంగా పెరిగింది. ఇదే సమయంలో రూ. కోటికి మించి వార్షిక ఆదాయం ప్రకటించిన వారు మాత్రం గతం కంటే భారీగా ఉన్నారు. పన్ను ఎగవేతల కట్టడికితోడు భారీ నగదు, విదేశీ రెమిటెన్సులు, లగ్జరీ వస్తువుల కొనుగోళ్ల వంటి అధిక విలువ కలిగిన లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం ట్రాక్‌ చేయడంతో అధిక ఆదాయ వర్గాలు అన్ని వివరాలు వెల్లడించక తప్పడం లేదు.  - సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

అధిక ఆదాయ వర్గాలు పెరగడం, లావాదేవీల వెల్లడి మరింత మెరుగవడం తాజా గణాంకాలను ప్రతిబింబిస్తోందని ట్యాక్స్‌ నిపుణులు అంటున్నారు. ఆర్థిక కార్యకలాపాల్లో విస్తృత వృద్ధికి ఈ ధోరణి కారణమని చెబుతున్నారు. వేతన వృద్ధి, బలమైన బోనస్, ఆరోగ్యకరమైన వ్యాపార లాభదాయకత కారణంగా గృహ ఆదాయాల్లో స్పష్టమైన మెరుగుదల నమోదవుతుందని పేర్కొంటున్నారు.

ఆదాయ వివరాల వెల్లడిలో కఠిన నిబంధనలు, డేటా అనలిటిక్స్‌ విస్తృత వినియోగం, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌), మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్‌)/మూలం వద్ద పన్ను వసూళ్లు (టీసీఎస్‌) ట్రాకింగ్‌ కారణంగా పారదర్శకత పెరిగి పన్ను ఎగవేతలు గణనీయంగా తగ్గాయి. కొత్త సంపద ఆకస్మిక సృష్టి కంటే నిబంధనల అమలు మెరుగైన తీరుకు గణాంకాలు నిదర్శనమని ఇతర ట్యాక్స్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అతి తక్కువగా.. 
ఆదాయపు పన్ను ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌ సమాచారం ప్రకారం.. 2025–26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–డిసెంబర్‌లో 9 కోట్లకు పైగా రిటర్నులు దాఖలు అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి సంఖ్య 8.92 కోట్లు. దాఖలైన మొత్తం రిటర్నులు ఏడాదిలో 1.22 శాతం మాత్రమే పెరగడం గమనార్హం. అసెస్‌మెంట్‌ సంవత్సరం 2025–26కుగాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి 2025 డిసెంబర్‌ 31 చివరి తేదీ.  

రెండంకెల వృద్ధి.. 
2024–25 ఏప్రిల్‌–డిసెంబర్‌తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్స రం ఇదే కాలంలో రూ.కోటికిపైగా ఆదాయాన్ని ప్రకటించిన వ్య క్తుల (అసెసీలు) సంఖ్య 3,17,098 నుంచి 3,85,752కు చేరింది. అంటే 21.65% అధికం కావడం విశేషం. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న అసెసీలు 24.1% తగ్గడం గమనార్హం.

ఇతర అన్ని ఆదాయ శ్రేణిలో.. అంటే రూ.5 లక్షలకుపైగా ఆదాయం కలిగిన అసెసీల సంఖ్యలో రెండంకెల వృద్ధి నమోదైంది. రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి, రూ.1–5 కోట్ల ఆదాయం చూపిన అసెసీలు 21% పెరిగారు. ఇక రూ.5–10 కోట్ల శ్రేణిలో ఏకంగా 29.7 %, రూ.10 కోట్లకుపైగా ఆదాయంతో రిటర్నులు సమర్పించినవారి సంఖ్య 28.3% దూసుకెళ్లడం ఆశ్చర్యం కలిగించే అంశం.

 

ఆదాయం వెల్లడించాల్సిందే.. 
కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని అత్యధికులు ఎంచుకుంటున్నారు. అంటే వార్షికాదాయం రూ.12 లక్షల వరకు పన్ను లేదు. అధిక విలువ కలిగిన లావాదేవీల సమాచారం వివిధ ప్రభుత్వ విభాగాలు, బ్యాంకుల నుంచి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకు ఎప్పటికప్పుడు చేరుతోంది. పన్ను ఎగవేతలకు చెక్‌ పెట్టేందుకు ఐటీ శాఖ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అందుకే అధిక ఆదాయ శ్రేణిలో దాఖలైన రిటర్నుల సంఖ్య భారీగా పెరిగింది.  
- అరుణ్‌ రాజ్‌పుత్, ఫౌండర్, ఆంబర్‌ గ్రూప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement