పాన్‌ కార్డు రూల్స్‌ మారుతున్నాయ్‌.. | 5 PAN card related changes in draft Income tax Rules 2026 | Sakshi
Sakshi News home page

పాన్‌ కార్డు రూల్స్‌ మారుతున్నాయ్‌..

Feb 12 2026 5:54 PM | Updated on Feb 12 2026 6:00 PM

5 PAN card related changes in draft Income tax Rules 2026

పాన్‌ కార్డుకు సంబంధించి పలు నిబంధనలు మారబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘డ్రాఫ్ట్ ఆదాయపు పన్ను నిబంధనలు–2026’లో పాన్ కార్డు (PAN) బహిర్గతం తప్పనిసరి అయ్యే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పరిమితుల్లో మార్పులను ప్రతిపాదించింది.  

లక్ష్యం ఏమిటంటే.. 
సాధారణ, తక్కువ విలువైన లావాదేవీలకు పాన్ కార్డు అవసరాన్ని తగ్గిస్తూ, పెద్ద మొత్తాల లావాదేవీలలో పారదర్శకత పెంచడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ముసాయిదాపై ఫిబ్రవరి 22 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను కోరుతోంది. తుది ఆమోదం అనంతరం కొత్త నిబంధనలు  2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు, మోటారు వాహనాల కొనుగోలు, హోటల్, రెస్టారెంట్ బిల్లులు, స్థిరాస్తి లావాదేవీలు, ఇన్సూరెన్స్ పాలసీలు ప్రీమియం చెల్లింపులకు సంబంధించి పాన్ కార్డు అవసరం ఎలా మారబోతోందో ఈ కింద తెలుసుకుందాం.

నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు 
ప్రస్తుతం ఒకే రోజులో రూ.50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ లేదా ఉపసంహరణ చేసినప్పుడు మాత్రమే పాన్ తప్పనిసరి అవుతుంది.

మోటారు వాహనాల కొనుగోలు
ప్రస్తుత నిబంధనల ప్రకారం మోటార్ సైకిళ్లు మినహా అన్ని వాహనాల కొనుగోలుకు పాన్ అవసరం. ప్రతిపాదిత మార్పుల ప్రకారం రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన వాహనాలు (బైక్‌లు సహా) కొనుగోలు చేసినప్పుడు మాత్రమే పాన్ అవసరం ఉంటుంది.

హోటల్, రెస్టారెంట్ బిల్లులు
ఇప్పటి వరకు ఒక చెల్లింపులో రూ.50,000 దాటితే పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ముసాయిదాలో ఈ పరిమితిని రూ.1 లక్షకు పెంచాలని సూచించారు.

స్థిరాస్తి లావాదేవీలు
ప్రస్తుతం రూ.10 లక్షలకు పైబడిన ఆస్తి లావాదేవీలకు పాన్ తప్పనిసరి. ప్రతిపాదన ప్రకారం ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచనున్నారు.

ఇన్సూరెన్స్ పాలసీలు
ఇప్పటివరకు రూ.50,000 పైగా ప్రీమియం చెల్లింపులకు మాత్రమే పాన్ అవసరం ఉండేది. ఇకపై బీమా సంస్థలతో ఏదైనా ఖాతా ఆధారిత సంబంధం ఏర్పరిస్తేనే పాన్ తప్పనిసరి చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement