ఆరోగ్య ఖర్చుల కోసం ఎన్‌పీఎస్ ‘స్వస్థ్య’ | NPS Swasthya Pension Scheme described health wallet by PFRDA | Sakshi
Sakshi News home page

ఆరోగ్య ఖర్చుల కోసం ఎన్‌పీఎస్ ‘స్వస్థ్య’

Feb 9 2026 8:05 AM | Updated on Feb 9 2026 8:18 AM

NPS Swasthya Pension Scheme described health wallet by PFRDA

రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పించే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్‌) ఇప్పుడు ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు సిద్ధమైంది. పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ‘ఎన్‌పీఎస్ స్వస్థ్య’ అనే కొత్త పెన్షన్ స్కీమ్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇది పూర్తిస్థాయి ఆరోగ్య బీమాకు ప్రత్యామ్నాయం కానప్పటికీ వైద్య ఖర్చుల కోసం ఒక ప్రత్యేక వాలెట్‌లా పనిచేస్తుంది.

ప్రస్తుతం ఈ పథకాన్ని ‘రెగ్యులేటరీ సాండ్‌బాక్స్’ విధానంలో పరిశీలిస్తున్నారు. అంటే, ఈ పథకం క్షేత్రస్థాయిలో ఎంతవరకు విజయవంతమవుతుందో టెక్నాలజీ, కస్టమర్ రక్షణ పరంగా ఎదురయ్యే సవాళ్లేమిటో ఈ ట్రయల్ ద్వారా పర్యవేక్షిస్తారు.

ఎలా పనిచేస్తుంది?

ఎన్‌పీఎస్ స్వస్థ్య అనేది సాధారణ ఎన్‌పీఎస్ ఖాతాకు అనుబంధంగా ఉండే ఒక ప్రత్యేక ఖాతా. ఈ ఖాతా తెరవాలంటే సభ్యుడికి కనీసం ఒక సాధారణ ఎన్‌పీఎస్ ఖాతా ఉండాలి. సభ్యులు తమ ఇష్టానుసారం ఇందులో నగదు జమ చేయవచ్చు. ఈ నిధులను పెన్షన్ ఫండ్ మేనేజర్లు వివిధ పథకాల్లో పెట్టుబడిగా పెడతారు. ఓపీడీ ఖర్చులు, ఆసుపత్రిలో చేరి చికిత్సల కోసం ఈ నిధులను వాడుకోవచ్చు.

40 ఏళ్లు దాటిన వారికి..

ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన ప్రభుత్వేతర ఉద్యోగులకు ఈ పథకం కీలకమని చెప్పవచ్చు. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని తమ సాధారణ ఎన్‌పీఎస్ ఖాతాలోని కార్పస్ నుంచి 30 శాతం వరకు నిధులను ‘స్వస్థ్య’ ఖాతాకు బదిలీ చేసుకునే అవకాశం కల్పించారు. దీనివల్ల అదనపు పొదుపు చేయకపోయినా పాత పొదుపునే ఆరోగ్య అవసరాలకు మళ్లించుకోవచ్చు.

ఉపసంహరణ నిబంధనలు

మొదటిసారి ఉపసంహరణ చేయాలంటే ఖాతాలో కనీసం రూ.50,000 ఉండాలి. ఉపసంహరణల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదు. ఒకవేళ ఆసుపత్రి బిల్లులు మొత్తం నిధిలో 70 శాతం దాటితే సభ్యుడు పూర్తి మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో బిల్లుల చెల్లింపు నేరుగా సభ్యుడికి కాకుండా హెల్త్ బెనిఫిట్ అడ్మినిస్ట్రేటర్ (హెచ్‌బీఏ) లేదా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) ద్వారా జరుగుతుంది. దీనివల్ల నిధుల దుర్వినియోగం తగ్గుతుంది.

సవాళ్లు.. నిపుణుల అభిప్రాయం

ఈ పథకం క్రమశిక్షణతో కూడిన పొదుపును ప్రోత్సహిస్తున్నప్పటికీ కొన్ని పరిమితులు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్‌పీఎస్‌లో రూ.50,000 కనీస నిధి ఉండాలనే నిబంధన సామాన్యులకు ఇబ్బందిగా మారవచ్చు. క్లెయిమ్ ప్రాసెసింగ్ ఫీజులు, ఉపసంహరణలపై పన్ను విధింపు విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఇది మార్కెట్ ఆధారిత పథకం కావడంతో వైద్య ద్రవ్యోల్బణంకు తగ్గట్టుగా రాబడులు వస్తాయా లేదా అన్నది సందేహమే.

ఇదీ చదవండి: భారత్-యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement